బలమైన సామ్రాజ్యంగా పేరొందిన శాతవాహనుల కీర్తిని స్మరించుకునే కళోత్సవాలను నిర్వహించేందుకు బలమైన ముహూర్తం కుదరడంలేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
బలమైన సామ్రాజ్యంగా పేరొందిన శాతవాహనుల కీర్తిని స్మరించుకునే కళోత్సవాలను నిర్వహించేందుకు బలమైన ముహూర్తం కుదరడంలేదు. చారిత్రక గొప్పదనంపై రాజకీయ నేతల పట్టింపులేని వైఖరి, అధికార యంత్రాం గం నిర్లక్ష్యం వెరసి.. కరీంనగర్ జిల్లా కీర్తిని స్మరించుకునే శాతవాహన కళోత్సవాలు మళ్లీ వాయిదా పడ్డాయి. జనవరి నుంచి వాయిదాలు పడుతున్న శాతవాహన కళోత్సవాలను అక్టోబరు 20 నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తామని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మ య్య ఈ నెల 5న అధికారికంగా ప్రకటించారు. ఇది జరిగి మూడు రోజులుకాక ముందే వీటి నిర్వహణను వాయిదా వేయాలని నిర్ణయించారు. తిరిగి నవంబరు రెండో వారంలో నిర్వహించాలని భావిస్తున్నారు. కచ్చితమైన తేదీలపై రెండుమూడు రోజుల్లో ప్రకటన
చేయనున్నారు.
పండగలు ఉండడమే ఈసారి వాయిదాకు కారణమని అధికారులు చెబుతున్నప్పటికీ.. 20వ తేదీ దగ్గరగా ఉండడం, అప్పటిలోగా ఏర్పాట్లు చేయలేమనే ఆందోళన అసలు కారణంగా కనిపిస్తోంది. గడువులోపు ఏర్పాట్లు జరగవనే ఆందోళన ఉన్నప్పుడు ఉత్సవాల నిర్వహణ ప్రకటన ఎందుకు చేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరుస వాయిదాలతో అసలు శాతవాహన కళోత్సవాలు నిర్వహిస్తారా లేదా అని సాహితీవేత్తలు, కళాకారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాతవాహన కళోత్సవాలను చివరిసారిగా 2008లో నిర్వహించారు. అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఈ ఏడాది నిర్వహిస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. జనవరిలోనే నిర్వహిస్తామని మొదట చెప్పింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసినా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
ఎన్నికలు పూర్తయిన తర్వాత మార్చిలో పరీక్షలు ఉన్నాయని చెప్పి ఏప్రిల్‌లో నిర్వహిస్తామని చెప్పింది. మేలో కొంత హడావుడి చేసింది. ఉత్సవాల నిర్వహణ, ఖర్చు, ఏర్పాట్లు వంటి అంశాలపై జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో 10 కమిటీలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో జరిపే ప్రదర్శనలు, ఇతర అంశాలకు రూపకల్పన చేసే బాధ్యతను కళాకారులకు అప్పగించారు. ఉత్సవాల నిర్వహణకు రూ.80 లక్షల వరకు అవుతాయని అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి రూ.5లక్షల మంజూరుకే ఆమోదం రావడంతో జిల్లాలోని పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరించారు. ఇలా సేకరించిన, ప్రభుత్వం ఇచ్చిన మొత్తం కలిపి ప్రస్తుతం రూ.24 లక్షలు ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం తక్కువగా ఉండడం కూడా ఉత్సవాల నిర్వహణ వాయిదా పడడానికి కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు ఉత్సవాల వేదిక గొప్పగా ఉండాలని, దీనికోసం టీటీడీ సహాయం కోరారు. జిల్లా యంత్రాంగం పెట్టిన ప్రతిపాదనను టీటీడీ వెంటనే అంగీకరించింది.
ఆలయం రూపంలో రూ.20 లక్షలతో అంబేద్కర్ స్టేడియంలో భారీ సెట్టింగ్ వేసింది. ఉత్సవాలు వాయిదా పడుతుండడంతో ఇది నిరుపయోగంగా మారింది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, అసఫ్‌జాహీల పాలనలో విభిన్న సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం జిల్లా సొంతం. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేల కుటుంబాలు వందల ఏళ్ల క్రితమే వచ్చి ఇక్కడ ఉండడంతో విభిన్న సాంస్కృతిక వాతావరణ నెలకొంది. నిజాం సర్కారు హయాంలో 1905లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి అరిపిరాల గ్రామం ఎలగందుల ఖిలేదార్ సయ్యద్ కరీముద్దీన్ పేరిట కరీంనగర్ జిల్లా కేంద్రంగా మారింది. ఇలాంటి ఎన్నో అంశాలతో ముడిపడి ఉండే జిల్లా ఘన చరిత్రను భవిష్యత్తు తరాలకు చెప్పే కళోత్సవాలపై ప్రజాప్రతినిధులకు, జిల్లా యంగ్రానికి శ్రద్ధ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.