కోవిడ్‌పై డ్రోన్‌తో యుద్ధం

Officials Using Drones For Do Not Spread Of Coronavirus In Nellore District - Sakshi

పబ్లిక్‌ అడ్రస్సింగ్‌ సిస్టమ్‌ ద్వారా ప్రజలకు హెచ్చరికలు, సూచనలు

డ్రోన్‌ సాయంతో హైపోక్లోరైట్‌ ద్రావణం స్ప్రేకు చర్యలు

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ఆధునిక యంత్రాలను వినియోగిస్తోంది. కరోనా చైన్‌ను తెంచేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలతో ఎక్కడికక్కడ కట్టడి చర్యలు చేపట్టింది. పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాలను  అధికారులు రెడ్‌జోన్లుగా ప్రకటించి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని నింగి నుంచి పర్యవేక్షించేందుకు డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. రెడ్‌జోన్ల పరిధిలో డ్రోన్‌లు ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఉల్లంఘనులను పట్టిస్తున్నాయి. కరోనా గీత దాటిన వారిని హెచ్చరించేందుకు, చర్యలు తీసుకునేందుకు దోహదపడుతున్నాయి. డ్రోన్‌లతో రెడ్‌జోన్ల పరిధిలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని సైతం స్ప్రే చేస్తున్నారు. 

సాక్షి, నెల్లూరు: లాక్‌డౌన్, రెడ్‌జోన్ల నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై గుంపులు గుంపులుగా గుమికూడినా, రాకపోకలను సాగిస్తున్నా.. గుర్తించి కట్టడి చేసేందుకు పోలీస్‌ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా నేత్రాలు (డ్రోన్‌)లను వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 12 డ్రోన్‌లు రెడ్‌జోన్‌లు, చెక్‌పోస్టుల వద్ద నింగిలో చక్కర్లు కొడుతూ పహారా కాస్తున్నాయి.

కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి ప్రతిక్షణం పరిశీలిస్తున్న పోలీసులు పబ్లిక్‌ అడ్రస్సింగ్‌ సిస్టమ్‌ ద్వారా ప్రజలకు హెచ్చరికలతో పాటు చైతన్యవంతులను చేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు జిల్లా పోలీ సు యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకు వచ్చారు. రోడ్లపై ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా చూడడంతో పాటు అత్యవసర పనులకు వెళ్లే వాహనాలు మినహా మిగిలిన వాహనాల రాకపోకల నియంత్రణకు చర్యలు చేపట్టింది.

కరోనా వైరస్‌ అధికంగా ఉన్న రెడ్‌జోన్లను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. రెడ్‌జోన్‌ ఏరియాల్లో నుంచి ఎవరిని బయటకు రానివ్వకుండా, బయట వారిని లోనికి వెళ్లనివ్వకుండా చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన బయటకు వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అదే క్రమంలో ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి ప్రజలు జిల్లాలోకి రాకుండా ఇంటర్‌స్టేట్, ఇంటర్‌ డిస్ట్రిక్ట్, సబ్‌డివిజన్‌ స్థాయిల్లో సుమారు 122 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. 24 గంటలు సిబ్బంది రోడ్లపై విధులు నిర్వహిస్తూ వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. 

అధునాతన పరిజ్ఞానంతో నిఘా 
కరోనా వైరస్‌ బారిన పడకుండా ప్రజలను రక్షించే క్రమంలో పోలీసులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. రెడ్‌జోన్లలోని కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో పోలీసులు విధులు నిర్వహించడం కష్టతరంగా మారడంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 10 (వీడియో చిత్రీకరణ), రెండు వీడియో, ఆడియో సిస్టం కలిగిన డ్రోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వాటిని కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు. వీఆర్‌లో ఉన్న సిబ్బంది, డ్రోన్‌ ఆపరేటర్లను కలిపి బృందాలుగా ఏర్పాటు చేశారు. వారు డ్రోన్‌ల సాయంతో రెడ్‌జోన్లు (కంటైన్మెంట్‌ ఏరియా)లో పరిస్థితులను పరిశీలించేందుకు చర్యలు చేపడుతున్నారు.

రోజుకు మూడు పర్యాయాలు నిర్దేశిత జోన్ల వద్ద మూడు కిలో మీటర్ల పరిధిలో డ్రోన్‌లు నింగిలో తిరుగుతూ లాక్‌డౌన్‌ అమలు తీరుతెన్నులు? నిబంధనలు పక్కాగా అమలవుతున్నాయా? తదితరాలను చిత్రీకరిస్తున్నాయి. వాటి ద్వారా అక్కడి స్థితిగతులను అధికారులు తెలుసుకుని సిబ్బందికి సూచనలు, సలహాలిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై చర్యలు సైతం తీసుకుంటున్నారు. పబ్లిక్‌ అడ్రస్సింగ్‌ సిస్టం ఉన్న డ్రోన్‌ల సహాయంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు కరోనాపై విస్తృత అవగాహన కల్పించి వారిని అప్రమత్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

రెడ్‌జోన్లలో డ్రోన్‌లతో విస్తృత నిఘా 
నెల్లూరు(క్రైమ్‌): అత్యంత సాంకేతిక కెమెరాలతో కూడిన డ్రోన్‌ల సాయంతో రెడ్‌జోన్లలో స్థితిగతులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా రెడ్‌జోన్లలో వీటిని వినియోగించారు. నగరంలోని ఖద్దూస్‌నగర్, మన్సూర్‌నగర్, కోటమిట్ట, పెద్దబజారు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో డ్రోన్‌లతో లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. 10 కిలోల బరువు కలిగిన ఈ యంత్రం చుట్టూ నాలుగు కెమెరాలు అమర్చి ఉన్నాయి. దీంతో పాటు పబ్లిక్‌ అడ్రస్సింగ్‌ సిస్టం (మైక్‌)ను అమర్చారు. సెల్‌ఫోను నుంచి మైక్‌ ద్వారా ప్రజలకు హెచ్చరికలు, జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. దీనిని వినియోగించి గుంపులుగా గుమికూడిన ప్రజలను అక్కడి నుంచి తరిమేశారు.   

అందుబాటులో స్ప్రేయింగ్‌ డ్రోన్‌ 
కరోనా కేసులు అధికంగా నమోదైన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం తరచూ శానిటైజ్‌ చేయిస్తున్నారు. ఇప్పటి వరకు ఫైర్‌ ఇంజిన్లు, వాటర్‌ ట్యాంకర్లు తదితరాల సాయంతో సోడియం హైపో క్లోరైట్‌ను స్ప్రే చేయిస్తున్నారు. అయితే పరిస్థితి అదుపు తప్పుతుండటంతో వాయుమార్గాన స్ప్రే చేయించేందుకు స్ప్రేయింగ్‌ డ్రోన్‌ను జిల్లా పోలీసు యంత్రాగం అందుబాటులోకి తీసుకు వచ్చింది. స్ప్రేయింగ్‌ డ్రోన్‌కు సమారు ఆరు లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకు (సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం నింపిన)ను అమర్చి రెడ్‌జోన్లలో ద్రావణం స్ప్రే చేయవచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో దానిని వినియోగిస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. మొత్తం మీద ఓ వైపు లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉల్లంఘనులపై చర్యలు తీసుకునేందుకు, మరో వైపు ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు, ఇంకో వైపు ద్రావణాన్ని స్ప్రే చేసి వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో డ్రోన్‌లు కీలక భూమిక పోషిస్తున్నాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top