అత్యవసర వైద్య సేవల్లో అతి పెద్ద ముందడుగు

Nationally praised On CM YS Jagan decision over Emergency Medical Services - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంపై జాతీయ స్థాయిలో ప్రశంసలు

ఏపీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి. ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల వైఎస్‌ జగన్‌ నిబద్ధతతో ఉన్నారు.
–ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ 

సాక్షి, అమరావతి : ప్రజలకు సత్వరం వైద్య సేవలు అందించే వ్యవస్థలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
► ‘కరోనా వైరస్‌ విస్తరిస్తున్న ఈ సమయంలో ఇది చాలా పెద్ద స్టెప్‌. 1088 అంబులెన్స్‌లను ఒకే సారి ప్రారంభించడం చిన్న విషయం కాదు. అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్, వెంటిలేటర్స్, ఇతర ఆధునిక పరికరాలతో కూడిన అంబులెన్స్‌లను ప్రారంభించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు’ అని టైమ్స్‌ నౌ చానల్‌ పేర్కొంది. 
► ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ అతిపెద్ద ముందడుగు వేసిందని జాతీయ చానళ్లు, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ చానళ్లు పేర్కొన్నాయి. జాతీయ స్థాయిలో సామాజిక వేత్తలు, వైద్య నిపుణులు ప్రశంసించారు. 

సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు 
అత్యవసర వైద్య సేవలకు తగ్గట్టుగా ఆధునీకరించి 108, 104 అంబులెన్స్‌ సర్వీసులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన అంశం సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అయ్యింది. నెటి జన్లు అన్ని సోషల్‌ మీడియా వేదిక ల్లోనూ ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్య మిచ్చారు.  ‘నీడ్‌ ఆఫ్‌ ది అవర్‌ వెల్‌ డన్‌ గాడ్‌ బ్లెస్‌’ అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ట్వీట్‌ చేశారు.  

గొప్ప కార్యక్రమంలో మేమూ భాగస్వాములం
1,088 అంబులెన్స్‌లను ఒకేసారి ప్రారంభించడం గొప్ప కార్యక్రమం అని ఏపీ– తెలంగాణలో బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ అండ్రూ ఫ్లెమింగ్‌ కొనియాడారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను కలసినప్పుడు వైద్య–ఆరోగ్య, విద్యా రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తానని చెప్పారన్నారు. చెప్పినట్టుగానే 108, 104 సేవలను ఆధునీకరించిన అంబులెన్స్‌ సర్వీసులను ప్రారంభించారని బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు.  బ్రిటన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్‌ను ఆయన రీట్వీట్‌ చేశారు. 

ఏపీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి
అత్యవసర వైద్య సదుపాయాలతో కూడిన 108, 104 అంబులెన్స్‌ సర్వీసులను ప్రారంభించడం ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిబద్ధతను తెలియజేస్తోంది. అంబులెన్స్‌ సర్వీసులను స్థానిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించడం మంచి ఆలోచన. ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి. 
– ట్విట్టర్‌లో రాజ్‌దీప్‌ సర్దేశాయ్, ప్రముఖ పాత్రికేయుడు 

హ్యాట్స్‌ ఆఫ్‌ టు వైఎస్‌ జగన్‌
ప్రపంచం కరోనా సంక్షోభంతో పోరాడుతున్న సమయంలో 108, 104 అంబులెన్స్‌లను ఇంత పెద్ద సంఖ్యలో ప్రారంభించడం అభినందనీయం. హ్యాట్స్‌ ఆఫ్‌ టు వైఎస్‌ జగన్‌. అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులకు, ప్రమాదాలు, విపత్తుల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ అంబులెన్స్‌ల ఉపయోగం ఎంతగానో ఉంటుంది.  
– ట్విట్టర్‌లో పూరీ జగన్నాథ్, ప్రముఖ దర్శకుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top