చిత్తూరుజిల్లా వి.కోట మండలం దాసర్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది
వి.కోట: చిత్తూరుజిల్లా వి.కోట మండలం దాసర్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తల్లీకూతుళ్లు.. అనసూయమ్మ(43), సునీత(18) శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమారుడి అనుచిత ప్రవర్తనే వీరి మరణానికి కారణంగా తెలుస్తోంది.
వివరాలు.. రెండు రోజుల క్రితం వీరి పక్క ఇంట్లో ఓ మహిళ స్నానం చేస్తుండగా అనసూయమ్మ కుమారుడు వీడియో తీశాడు. ఇది గమనించిన ఆ మహిళ కుటుంబీకులు.. అతడిని కొట్టడంతో అనసూయమ్మ, ఆమె కుమార్తె సునీత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో వీరికి ధైర్యం చెప్పేందుకు తోడుగా మరో మహిళ అనసూయమ్మ ఇంట్లో ఉంటోంది. ఇవాళ ఉదయం ఆమె బయటకు వెళ్లిన సమయంలో తల్లీకూతుళ్లు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్.ఐ. రాజశేఖర్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


