సావిత్రమ్మ.. నీకు సాటిలేరమ్మా..!

Most Inspirational Women Savitramma - Sakshi

పలువురికి ఆదర్శంగా కార్మికోద్యమ నాయకురాలు  

కుటుంబానికి పెద్దదిక్కుగా.. కార్మిక సంఘానికి నాయకురాలిగా..

కార్మికులు, మహిళల్లో చైతన్యం తీసుకువచ్చిన సావిత్రమ్మ

కేవలం తన కుటుంబం కోసమే ఆమె ఆలోచించి ఉంటే.. ఆమె ఈ రోజున ఒట్టి సావిత్రిగానే మిగిలేది. కానీ ఆమె ఆలా చేయలేదు. తాను పీకల్లోతు కష్టాల్లో ఉన్నా పక్కనున్న కార్మికుల కోసం ఆలోచించింది. కొన్ని పరిస్థితుల కారణంగా కుటుంబ బాధ్యతను స్వీకరించి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ బతుకు పోరాటం సాగించింది. భర్త లేని సంసారాన్ని రెక్కల కష్టంపై మోస్తూనే.. సాటి కార్మికుల కోసం ఉద్యమాలు చేసింది. సాటి కార్మికుల బతుకుల్లో ‘చెమ్మ’చీకటిని పారద్రోలి వారి బతుకుల్లో వెలుగులు నింపింది. అందరికీ సావిత్రమ్మ అయ్యింది. ఆమే ఆకివీడుకు చెందిన కార్మికోద్యమ నాయకురాలు సావిత్రమ్మ. ఆమె జీవిత గాథ.. ఆమె మాటల్లోనే..

ఆకివీడు :  నా పేరు సావిత్రి. కాని సావిత్రమ్మ అంటారు. 1944లో కృష్ణా జిల్లా తాడేపల్లి అనే చిన్న పల్లెలో పుట్టాను. మక్కా వెంకన్న, వరహాలమ్మ దంపతులకు జన్మించాను. 1965 దశకంలో వివాహమైంది. నా భర్త మారుబోయిన సాంబశివరావు విద్యుత్‌ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేసేవారు. తిరుపతిలో విద్యుత్‌ స్తంభంపైకి ఎక్కి పని చేస్తుండగా కరెంట్‌ షాక్‌ కొట్టి కిందకు పడిపోయారు. తలకు బలమైన గాయం అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే కన్పించకుండా వెళ్లిపోయారు. అప్పటికి నేను గర్భవతిని. నేటికీ ఆయన తిరిగి రాలేదు.

నా తండ్రి వెంకన్న రైల్వే డిపార్టుమెంట్‌లో చిరుద్యోగి. అల్లుడు కోసం ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి, కాళ్లు అరిగేలా తిరిగిన ఆయన అలసి సొలసిపోయారు. అల్లుడు కన్పించకపోవడం, చుట్టుపక్కలవారి సూటిపోటి మాటలు పడలేకపోయారు. అప్పుడే బతుకుపై భయమేసింది. చేతిలో చిల్లి గవ్వలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. నాకు ప్రసవ సమయం దగ్గర పడింది. పండంటి బిడ్డ పుట్టాడు. పల్లెటూరులో జీవనం సాగించలేక, బతుకు తెరువు కోసం తల్లిని, తండ్రిని వెంటబెట్టుకుని చంకలో చంటి బిడ్డతో ఆకివీడు వచ్చాను.

కన్నప్రేగు తడారకుండానే కార్మికురాలిగా..
నా... అన్న వారు లేకపోయినా, మానవత్వం నిండిన వారు ఉండకపోతారా అని వెతుక్కుంటూ వచ్చిన నన్ను ఆకివీడు ప్రజలు ఆదరించారు. కన్న ప్రేగు తడారకుండానే రైసుమిల్లులో కార్మికురాలిగా చేరాను. ధాన్యం, బియ్యం డబ్బాలను మోసి బతుకు బండిని గెంటుకువచ్చాను. రోజుకు రూ. 2.50 కూలితో ముగ్గురం బతుకుతూ, పిల్లవాడిని పెంచాం. తండ్రి వెంకన్న స్థానిక పెద్దల సహకారంతో రైస్‌మిల్లులో నైట్‌వాచ్‌మెన్‌గా చేరారు. రైస్‌ మిల్లు కార్మికురాలిగా పనిచేస్తూ, తోటి కార్మికులు పడుతున్న అవస్థల్ని చూడలేకపోయాను. ఇంట్లో పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ తోటి కార్మికుల ఇబ్బందులను భుజాన వేసుకుంటూ పనిచేశాను.

కార్మికులు పడుతున్న అవస్థలు, దోపిడీకి గురవుతున్నారని తెలుసుకుని వాటిని ఎదిరించాలని నిర్ణయించుకుని ముందుకు వెళ్లాను. ఆకలి బాధలు, కార్మికుల తిప్పలు కార్మికోద్యమ నేతగా నన్ను నిలబెట్టాయి. నా ఆవేదన, ఆలోచన, ఆక్రందనలను వింటున్న కార్మికోద్యమ నేత నంద్యాల సుబ్బారావు నేతృత్వంలో కార్మిక సంఘంలో చేరాను. రైస్‌మిల్లు కార్మికల సంఘం ఏర్పాటు చేసి వేతనాల కోసం, పని గంటల కోసం వీరోచితంగా పోరాడాను. కార్మికులకు ప్రత్యేక చట్టాలు, ప్రతి రెండేళ్లకు వేతనాలు, కూలీల «వేతనాల పెంపు, బోనస్‌లు, íపీఎఫ్‌లు, గ్రాట్యుటీ వంటి వాటిని కల్పించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేశాను. నాటి వేతన ఒప్పందం నేటీకి అమలులోనే ఉంది.

నాదారిలోనే నా కుమారుడు
కార్మికురాలిగా పిల్లవాడ్ని చదివించడానికి డబ్బు సరిపోదని చిన్నపాటి హోటల్‌ పెట్టాను. చీటీలు కట్టించుకుని కార్మికులకు చేదోడు వాదోడుగా ఉంటూ కుమారుడ్ని బీఈడీ చేయించాను. అదే చీటీల వ్యాపారాన్ని వృద్ధి చేసిన కుమారుడు మారుబోయిన రమణ ఉద్యమాల్లో పాల్గొంటూ కార్మికులకు ఆసరాగా నిలబడ్డారు. నిజాయితీగా, నిబద్దతతో కార్మికులకు అండగా నిలుస్తున్న రమణను స్థానిక పెద్ద, కమ్యునిస్టువాది గాదిరాజు సుబ్బరాజు రమణకు లెనిన్‌ ఆశయాలున్నాయంటూ లెనిన్‌గా నామకరణం చేశారు. లెనిన్‌బాబుకు అరుణకుమారితో వివాహం చేశాను. లెనిన్‌ నేడు వ్యాపారం, రొయ్యల చెరువులు, ఐస్‌ ఫ్యాక్టరీని నడుపుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం పుట్టుకతో రావడంతో నేటికీ కార్మిక ఉద్యమాల్లోనూ, కార్మికుల బాధల్లో పాలుపంచుకుంటూ జీవనం గడుపుతున్నాం.

ప్రజాసమస్యల పరిష్కార వేదికనయ్యాను
కార్మికుల సమస్యల నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికనయ్యాను. 1980 ప్రాంతం నుండే వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు పింఛన్ల కోసం పోరాటాలు చేశాను. ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సామరస్యంగా పరిష్కరించా. మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకువచ్చాను.

నేడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు భయంకరంగా ఉంటున్నాయి. చిన్న పిల్లలు గ్రామాల్లో కూడా తిరగలేని పరిస్థితి నెలకొంది. మేధస్సు పెరిగినా మానవత్వం విలువలు చనిపోతున్నాయి. చంద్ర మండలంలో కాపురం ఉండేందుకు మేధస్సు ఉపయోగపడుతున్నా భూమండలంలో వికృత చేష్టలు పాతాళానికి తీసుకు వెళ్తున్నాయి. జనాభాలో సగంకు పైగా ఉన్న మహిళలకు స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందనేది నా బాధ. అణచివేతపై మహిళలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది.
 
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని..
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఏనాడూ ఎదురు చూడలేదు. ఎదురు చూసి ఉంటే ఈనాడు ఇలా ఉండేదాన్ని కాదు. కొడుకు కోడలుతో పాటు మనవరాళ్లతో ఆనందమయమైన జీవనం గడుపుతున్నాను.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top