పరిహారం.. పరిహాసం

Mirchi Farmers Not Get Compensation In Guntur - Sakshi

నకిలీ పత్రాలతో పరిహారం పొందిన అక్రమార్కులు

ఏడాదిగా ఎదురుచూస్తున్న రైతులు

వారంతా ఆరుగాలం కష్టించి పంట పండించిన మిర్చి రైతులు. గతేడాది లాగే లాభాలు వస్తాయి, కొంతలో కొంత కష్టాలు గట్టెక్కుతాయని ఆశించి, మిర్చి పంటను వేశారు. అయితే మార్కెట్లో ధర పతనమవడం తో తీవ్రంగా నష్టపోయారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం  అదనపు పరిహారం ప్రకటించింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న కొందరు అక్రమార్కులు నకిలీ పత్రాలు పుట్టించి లక్షల్లో పరిహారం పొందారు. తీరిగ్గా విషయం తెలుసుకున్న అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేయడంతో అసలు రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందక దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

ఈపూరు(వినుకొండ) : ప్రభుత్వం గత ఏడాది రైతులకు ప్రకటించిన మిర్చి అదనపు పరిహారం అందేనా అని రైతన్నలకు సందేహం ఏర్పడింది. అసలు మిర్చి పంట పండించని వారికి పరిహారం అందింది మా పరిస్థితి ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నకిలీ పత్రాలతో పరిహారం..
2016 సంవత్సరంలో మిర్చి పంట బాగా దిగుబడి రావడంతో గత ఏడాది కూడా ఎక్కువగా మిర్చిని పండించారు. అయితే పండించిన పంటకు ఆశించిన ధర రాకపోవడంతో రైతన్నలు దిగాలు పడ్డారు. ఇది గమనించిన ప్రభుత్వం క్వింటాకు అదనపు పరిహారం కింద రూ.1500 ప్రకటించింది. ఒక్కో రైతు 20 క్వింటాళ్ల వరకు పరిహారం పొందవచ్చు. ఇదే అదునుగా భావించిన కొండాయిపాలెం, బొగ్గరం, చిన్నకొండాయిపాలెంకు చెందిన కొందరు అక్రమార్కులు పంటలు వేయకపోయినా అధికారులతో లాలుచీపడి పండించినట్లు నకిలీపత్రాలు సృష్టించి సుమారు రూ.20లక్షల వరకు అదనపు పరిహారం పొందారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విచారణకు అదేశించారు. విచారణ మూడు నెలలపాటు సాగింది. ఆర్‌డీఓ సారధ్యంలో 100 మంది అధికారులతో విచారణ పూర్తి చేశారు. సంవత్సరం అయినప్పటికీ ఇంతవరకు పరిహారం రాకపోవడంపై సందేహం ఏర్పడింది. సుమారు 558 మంది రైతులకు రూ.కోటి 29లక్షలు నగదు రావాల్సి ఉంది. మండలంలోని రైతులు ఈనెల 9న జిల్లా అధికారులను కలిసి పరిహారం వెంటనే అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

దర్జాగా అక్రమార్కులు.. రోడ్డున పడ్డ ఉద్యోగులు
అక్రమంగా మిర్చి పరిహారం పొందిన వారు దర్జాగా తిరుగుతుంటే. అందుకు సహకరించిన ఉద్యోగులు ఉద్యోగాలు పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదైనా ఇంతవరకు వారి వద్దనుంచి నగదును రికవరీ చేయకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించడంలో ముఖ్యపాత్ర పొషించిన ఒక వీఆర్‌ఓ సస్పెండ్‌ అవటంతోపాటు ఇద్దరు వ్యవసాయ విస్తరణ అధికారులు అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న  ముగ్గురు ఎంపీఈఓలు తమ ఉద్యోగాలు ఊడి రోడ్డున పడ్డారు. అలాగే హర్టికల్చర్‌ ఎంపీఈఓను విధుల నుంచి తొలగించారు. దీనికి కారణమైన టీడీపీ నాయకులు మాత్రం దర్జాగా తన పనులు జరుపుకొంటున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

పరిహారం ప్రశ్నార్థకం !
మిర్చి అదనపు పరిహారం అసలు అందేనా అని రైతులకు సందేహం ఏర్పడింది. అక్రమార్కులు చేసిన పనిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వం రైతులకు మొండిచేయి చూపుతుందేమోనని సందేహం ఏర్పడింది. మరలా పంట చేతికివచ్చినా పరిహారం రాకపోవడంతో పలురకాల అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.

అప్పు తీర్చుకుందామనుకున్నాను
నేను మూడు ఎకరాలు మిర్చి పంట వేశాను. చివరి కోతలో ప్రభుత్వం అదనపు పరిహారం ప్రకటించింది. దీంతో సంతోష పడ్డాను, 16 క్వింటాళ్లు యార్డుకు తీసుకొని పోయి అమ్మాను, రూ.24వేలు అదనంగా వస్తాయని అనుకున్నా. అదనపు పరిహారం అందితే కనీసం మందుల కొట్లో అప్పుతీర్చుకుందామనుకున్నాను. పరిహారం రాకపోవడంతో ఆ అప్పు అంతే ఆగిపోయింది. ఏంచేయాలో పాలు పోవడం లేదు.
– మందపాటి కోటేశ్వరావు, రైతు, బొగ్గరం

ఏడాదైనా పరిహారం లేదు
నాకు సొంతగా ఎకరం పొలం ఉంది. మరో ఎకరంన్నర పొలం కౌలుకు తీసుకుని మిర్చి పంట వేశాను. గత ఏడాది మిర్చి బాగా పండిందని అదనంగా వేశాను. చివరి దశలో వచ్చిన 20 క్వింటాళ్ల మిర్చిని యార్డుకు అమ్మాను. ప్రభుత్వం అదనపు పరిహారం చెల్లిస్తానని చెప్పిన మాటలు నమ్మాను. ఏడాదైనా ఇంకా అందలేదు.
– గన్నవరం వెంకయ్య, మిర్చి రైతు

వచ్చిన వెంటనే ఖాతాల్లో జమచేస్తాం
మిర్చి పరిహారం పొందవల్సినవారికి పరిహారం ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే వారి ఖాతాలకు నగదు జమచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అక్రమార్కుల వద్ద నుంచి రికవరీ విషయం నా పరిధిలోనిది కాదు. 
– తెల్లిక సుబ్బారావు, మండల వ్యవసాయశాఖాధికారి, ఈపూరు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top