సమైక్యానికి అదృష్టమూ తోడవ్వాలి..
రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి అదృష్టం సైతం కలసి రావాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
-
కలసి ఉంటేనే అందరికీ మంచిది
-
పెద్ద రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం: సీఎం
పీలేరు, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి అదృష్టం సైతం కలసి రావాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి అధిష్టానంతో పోరాడుతున్నానని చెప్పారు. చిత్తూరు జిల్లా, కేవీపల్లె(కంభంవారిపల్లె) మండలం జిల్లేళ్లమందలో బుధవారం రచ్చబండలో భాగంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌పై విభజన ప్రకటన ఓ ఆటంబాంబులాంటిదన్నారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో విభజనను ఆపడానికి విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కలసి ఉంటేనే అందరికీ మంచిదన్నారు.
పెద్ద రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో ఏడాదిన్నర క్రితం స్త్రీ నిధి బ్యాంక్ ప్రారంభించామని, ఇటీవల ప్రధాని, సోనియా మహిళా బ్యాంక్‌ను ప్రారంభించడం గర్వకారణమన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో మహిళలకు రూ. 16,500 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలుగా రూ. 1,200 కోట్లు, రైతులకు రూ. 450 కోట్లు ఇచ్చామన్నారు. గతంలో నిర్వహించిన రెండు రచ్చబండ కార్యక్రమాల్లో 60 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, మూడో విడత రచ్చబండలో 50 లక్షల కుటుంబాలకు రూ. 13 వేల కోట్లతో వివిధ పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ఈ ఏడాది రూ. 12,080 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. సత్యవేడు సెజ్‌లో పదిహేను ఫ్యాక్టరీల ద్వారా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. కలకడలో నిర్వహించిన రచ్చబండలోనూ సీఎం పాల్గొన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి సీఎం శంకుస్థాపన
తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు సీఎం బుధవారం శంకుస్థాపన చేశారు. తిరుపతి ఎస్‌వీ జూ పార్కు సమీపంలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్ల అంచనాతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధులతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు రూ.7,200 కోట్ల అంచనాతో చేపట్టిన తాగునీటి సరఫరా పథకానికి, స్విమ్స్‌లో పద్మావతీ మహిళా వైద్య కళాశాలకూ సీఎం శంకుస్థాపన చేశారు.