చచ్చినా వదలని అప్పులోళ్లు..

Loan Merchants Stopped Crimiations In Visakhapatnam - Sakshi

అంత్యక్రియలను అడ్డుకున్న వడ్డీ రాకాసులు

బుచ్చెయ్యపేటలో దారుణం

బుచ్చెయ్యపేట(చోడవరం):  చచ్చినా చేసిన రుణం తీరలేదు. కాటికెళ్లకుండానే వడ్డీ పిశాచులు పీక్కుతినడం మొదలు పెట్టాయి. కడుపు నొప్పితో మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలు చేయకుండా ఇంటి మీద పడిన అప్పులోళ్లు అడ్డుకున్న వైనమిది. మండల కేంద్రం బుచ్చెయ్యపేటకు చెందిన గుమ్మిడిశెట్టి వాసు(40) ఇరవై ఏళ్లుగా బుచ్చెయ్యపేటలో కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. వ్యాపార లావాదేవీల కోసం వడ్డీ వ్యాపారస్తులు వద్ద డబ్బులు తెచ్చి వ్యాపారం చేసేవాడు. అప్పులు చేసి వ్యాపారం చేసినా కలిసి రాక మరిన్ని అప్పుల పాలయ్యాడు. అధిక వడ్డీలకు తెచ్చి వ్యాపారం చేసినా లాభాలు రాకపోగా ఎటువంటి స్ధిర చరాస్తులు లేని అతనికి భార్య నలుగురు కుమారులు పోషణ భారంగా మారింది. కొంత కాలంగా అప్పుల బాధతో విచారంగా ఉండేవాడు. గురువారం అతనికి  తీవ్రమైన కడుపునొప్పి రావడంతో

కుటుంబ సభ్యులు విశాఖ ప్రవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వాసు మృతి చెందినట్టు తెలుసుకున్న వడ్డీ వ్యాపారులు అతని మృతదేహం ఇంటికి రాక ముందే అప్పులు తీర్చాలని వాసు ఇంటి ముందు కూర్చున్నారు. దీంతో వాసు భార్య సంతోషమ్మ భర్త మృతి చెందాడన్న పుట్టెడు దుఃఖంలో ఉండగా వడ్డీ వ్యాపారులు అప్పులు తీర్చాలని ఇంటి మీదకు రావడంతో ఏమి చెప్పాలో తెలియక భోరున విలపించింది. దీంతో ఇంటి ముందు అప్పులోళ్లు ఉన్నారని తెలుసుకుని వాసు మృత దేహాన్ని గ్రామంలో ఇంటికి తీసుకురాకుండా పక్క గ్రామమైన పోలేపల్లి వద్ద ఉంచేశారు. మా అప్పులు ఎలా తీరుస్తారో చెప్పాలని వడ్డీ వ్యాపారులు గొడవకు దిగడంతో వాసు భార్య, నలుగురు కుమారులు ఏం చేయాలో తెలియక పెద్ద ఎత్తున విలపించారు. దీంతో సర్పంచ్‌ సుంకరి గాంధీ,మాజీ సర్పంచ్‌ డొంకిన అప్పలనాయుడు తదితరులు వడ్డీ వ్యాపారులకు నచ్చజెప్పడంతో వాసు మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top