సర్వేశ్వరా ! 

Land Survey In Chittoor District - Sakshi

తంబళ్లపల్లె మండలంలోని కోటకొండ గ్రామానికి చెందిన రామప్ప అనే రైతు తగాదాలో ఉన్న తన పొలాన్ని కొలవాలని మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. అతని సమస్య ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదు. పిచ్చాటూరు మండలంలోని రాజనగరం గ్రామానికి చెందిన Ôశంకరప్ప అనే భూ యజమాని తన స్థలాన్ని కబ్జా చేసారని, తన భూమిని కొలవాలని గత ఏడాది డిసెంబర్‌లో మీ–సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. నెలలు గడిచినా సర్వేయర్‌ రాకపోవడంతో, తహసీల్దార్‌ కార్యాలయంలో సంప్రదించాడు. మీసేవ దరఖాస్తు తమకు అందలేదని సమాధానం. చేసేది లేక ఆయన ప్రైవేట్‌ సర్వేయర్‌ను ఆశ్రయించాడు. 

చిత్తూరు కలెక్టరేట్‌ : రాష్ట్ర ప్రభుత్వమేమో ఒక పక్క రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అంటూ గొప్పలు చెప్పుకుంటోంది. అయితే జిల్లాలో క్షేత్రస్థాయిలో సర్వేయర్లు లంచం లేనిదే విధులు నిర్వహించరనే విమర్శలున్నాయి. భూ కొలతల కోసం అర్జీ అందజేసే సామాన్యులు, రైతుల నుంచి ఆమ్యామ్యాలు తీసుకున్నాకే విధులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఆమ్యామ్యాలు ఇవ్వడానికి వెనకాడితే వాళ్లను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతూ నరకం చూపిస్తున్నారు.

సర్వే శాఖపై జిల్లా ఉన్నతాధికారులు సమీక్షలు జరపకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటలా తయారైంది. సర్వే నిమిత్తం వచ్చేఅర్జీదారులను ముప్పుతిప్పలు పెడుతున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. భూ కొలతలకు సంబంధించి అర్జీలు చేసుకుంటున్న వారి స్థలం విస్తీర్ణాన్ని బట్టి రేటు నిర్ణయిస్తున్నారు. ఈ విధంగా అక్రమ సంపాదనకు అలవాటు పడిన సర్వేయర్లు ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా లెక్కపెట్టే స్థితిలో లేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది సర్వేయర్లు ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని ప్ర జలు తమ భూమిని సర్వే చేయించుకోవా లంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.

పెండింగ్‌లో దరఖాస్తులు
జిల్లాలోని 66 మండలాల్లో మూడు నెలలుగా 2,786 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వేయర్ల అలసత్వం కారణంగానో.. ముడుపులు అందని కారణంగానో అధిక సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మండల, జిల్లా స్థాయిలో దరఖాస్తులు కొండలా పేరుకుపోతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. కొన్ని దరఖాస్తులకు మోక్షం లభించడం లేదని తెలుస్తోంది. సాధారణంగా రైతుల మధ్య భూముల హద్దులకు సంబంధించి వివాదాలు, సమస్యలు తలెత్తినప్పుడు లేదా భూముల క్రయవిక్రయాల సందర్భంగా హద్దులను క్షేత్రస్థాయిలో అధికారికంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు తదితర సమయాల్లో ప్రభుత్వ సర్వేయర్ల అవసరం ఏర్పడుతుంది. గ్రామస్థాయిలో కొలతల కోసం మీ సేవల ద్వారా దరఖాస్తులు చేసుకుంటారు. ఆ దరఖాస్తులు తహసీల్దార్‌ కార్యాలయాలకు చేరుతాయి. ఆ దరఖాస్తులను రెవెన్యూ శాఖ సర్వేయర్లు పరిశీలించి, కొలతలు వేసి హద్దులను నిర్ణయించి, అధికారికంగా నివేదికలను సమర్పిస్తారు. సంబంధిత అర్జీదారుని భూములను సర్వే చేసేందుకు ఫలానా తేదీన భూమి దగ్గరకు వస్తున్నామని, అందుబాటులో ఉండాలని నోటీసులు పంపాల్సి ఉంటుంది. కానీ వారికి ముడుపులు అందలేదనే కారణంతో ఏదో ఒక సాకు చెప్పి తరచూ వాయిదాలు వేస్తున్నారని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.

కొరవడిన పర్యవేక్షణ
సర్వే శాఖపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సర్వేయర్లు ఆడిందే ఆటగా మారిందనే ఆరోపణలు ఉన్నా యి. ఈ శాఖకు సంబంధించి జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్లు పర్యవేక్షణ చాలా అవసరం. ప్రస్తుతం వారు పని ఒత్తిడిలో ఉండడంతో సర్వేయర్లు తమ ఇష్టానుసా రం ప్రవర్తిస్తున్నారు. సర్వేయర్లు భూము ల కొలవకపోవడంతో రైతులు, ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. మరికొంతమంది ప్రభుత్వ సర్వేయర్లకు లంచాలు ఇచ్చుకోలేక, ప్రైవేటు సర్వేయర్లను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top