నకిలీలకు చెక్‌.. కల్తీకి కళ్లెం

Laboratories for farmers in AP for the first time in the country - Sakshi

దేశంలోనే తొలిసారిగా ఏపీలో రైతుల కోసం ప్రయోగశాలలు

నాణ్యతపై భరోసాతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల ప్రమాణాలు పెంపు

వైఎస్సార్‌ ల్యాబ్‌లు 147

జిల్లా స్థాయి ప్రయోగశాలలు 13

ప్రాంతీయ కోడింగ్‌ సెంటర్లు 4

ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్న నియోజకవర్గాలు  46

ముఖ్యమంత్రి ముందు చూపు.. 

సాక్షి, అమరావతి: దేశంలో తొలిసారిగా వ్యవసాయ, అనుబంధ రంగాల కోసం సమగ్ర (ఇంటిగ్రెటెడ్‌) ప్రయోగశాలల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.198 కోట్లు వ్యయం చేయనుంది. సాగు ఖర్చులు తగ్గించి ఉత్పాదన పెంచడంతోపాటు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభించేలా ప్రయోగశాలలు కీలకపాత్ర పోషిస్తాయి. రైతు లాభమే ధ్యేయంగా ఈ ల్యాబ్‌లు పని చేస్తాయి. నియోజకవర్గాల్లో ఏర్పాటయ్యే కేంద్రాలను వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ పరీక్షా ప్రయోగశాలలుగా వ్యవహరిస్తారు. 

ముఖ్యమంత్రి ముందు చూపు.. 
రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులతో రైతులు నష్టపోకుండా ముందు చూపుతో ఈ ప్రయోగశాలలకు శ్రీకారం చుట్టింది. నాబార్డ్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విత్తన బిల్లు ముసాయిదాలోనూ వీటి గురించి ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. వైఎస్సార్‌ ల్యాబ్స్‌ కోసం ఇప్పటికే స్థలాల ఎంపిక జరిగిందని, త్వరలో ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు.  

ప్రయోజనాలు ఎన్నెన్నో...  
ప్రస్తుతం నమూనాల సేకరణ, ఫలితాల విశ్లేషణకు చాలా సమయం పడుతోంది. అన్ని కంపెనీల ఉత్పత్తులు ఈ పరిధిలోకి రావడం లేదు. ఇకపై అలా కుదరదు. యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ వ్యవస్థలోని ఆటోమేటెడ్‌ శాంప్లింగ్‌ మాన్యువల్‌ వ్యవస్థని పూర్తిగా మారుస్తారు. జిల్లా స్థాయిలోనే శాంపిళ్లను పరీక్షించి నకిలీవని తేలితే చట్టపరమైన చర్యలు చేపడతారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ కేంద్రాలకు బాధ్యుడిగా ఉంటారు. 600 చదరపు గజాల స్థలంలో ఇవి ఏరా>్పటవుతాయి. 2,112 చదరపు అడుగుల స్థలాన్ని భవనం కోసం వినియోగిస్తారు. నియోజకవర్గ ల్యాబ్‌కు రూ.81 లక్షల చొప్పున వ్యయం అవుతుంది. ఇందులో భవనానికి రూ.55 లక్షలు కేటాయించారు. జిల్లా స్థాయి ల్యాబ్‌ 1.10 ఎకరాల్లో ఏర్పాటవుతుంది. ప్రస్తుతం ఉన్న పరీక్షా కేంద్రాలు కొత్తవాటితో విలీనం అవుతాయి.  

పర్యవేక్షణ ఇలా.. 
నెల్లూరులోని జీవన ఎరువుల నాణ్యతా నియంత్రణ ప్రయోగశాల, అమరావతిలోని పురుగు మందుల అవశేషాల పరీక్షా ప్రయోగశాల, గుంటూరులోని డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్, జన్యుమార్పిడి పంటల పర్యవేక్షణ కేంద్రాలు ఇకపై రాష్ట్ర స్థాయి ప్రయోగశాలలుగా పనిచేస్తాయి. ఏకీకృత డిజిటల్‌ వేదిక ద్వారా శాంపిళ్లు స్వీకరిస్తాయి.  విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, తిరుపతిలో ప్రాంతీయ కోడింగ్‌ సెంటర్లు ఏర్పాటవుతాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల శాంపిళ్లను స్వీకరించి కోడింగ్‌ చేసి పరీక్షా కేంద్రాలకు పంపడం వీటి ప్రధాన కర్తవ్యం. ప్రతి కోడింగ్‌ సెంటర్‌కు సుమారు రూ.90 లక్షల వరకు వ్యయం అవుతుంది. జిల్లా ల్యాబ్‌లకు అధిపతిగా ఉండే ఏడీఏకి 12 మంది ఏవోలు సహకరిస్తారు. నియోజకవర్గ ల్యాబ్‌లను రెగ్యులర్‌ ఏడీఏ పర్యవేక్షిస్తారు. గ్రామ వీఏఏలు లేదా మండల సిబ్బంది ఆయనకు సహకరిస్తారు.

ఆక్వా ల్యాబ్‌లకు రూ.12.42 కోట్లు
ముఖ్యమంత్రి జగన్‌ సూచనల మేరకు కోస్తాలోని 46 నియోజకవర్గాలలో సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలతో పాటు ఆక్వా ల్యాబ్‌లు కూడా ఏర్పాటవుతాయి. వీటికోసం రూ.12.42 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆక్వా ల్యాబ్‌లతో రైతులకు మేలైన సీడ్‌ అందుతుంది. ఆక్వా సీడ్‌పై నియంత్రణ, పరీక్షలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

దేశ వ్యవసాయ రంగ చరిత్రలోనే ముందడుగు
‘నకిలీ, కల్తీలను అరికట్టి అన్నదాతను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమగ్ర ప్రయోగశాలలు దేశ వ్యవసాయ రంగ చరిత్రలోనే పెద్ద ముందడుగు. నియోజకవర్గ స్థాయి అగ్రీ ల్యాబ్‌ ముఖ్యమంత్రి మానస పుత్రిక. రైతుల సంక్షేమం పట్ల ఆయన చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. త్వరలో 147 వైఎస్సార్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు నాబార్డ్‌ ఆర్థిక సహకారం అందించనుంది. కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయిస్తే ఏ కంపెనీనీ వదలం’ 
    – కె.కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top