
నిరంతర విద్యుత్ అందించిన ఘనత బాబుదే
రాష్ట్రానికి నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబునాయుడుకే దక్కిందని...
స్పీకర్ కోడెల
మూల్పూరు (అమృతలూరు): రాష్ట్రానికి నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబునాయుడుకే దక్కిందని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. మండలంలోని మూల్పూరు గ్రామంలో శుక్రవారం రూ.1.25 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. కోడెల మాట్లాడుతూ కరెంటు నిత్యవసర వస్తువుగా మారిందని, ఏటా 20 శాతం విద్యుత్ వాడకం పెరుగుతూ వస్తుందని చెప్పారు. విద్యుత్ ఖర్చును తగ్గించడానికి ప్రభుత్వం ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేసిందన్నారు.
విద్యుత్ అవసరమైనంత వరకు మత్రమే వినియోగించాలని కోరారు. ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఆయన తెలిపారు. భూగర్భ జలాలను కాపాడుకునేందుకు నీరు-చెట్టును తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, భూగర్భ జలాలుంటే రైతులు సమృద్ధిగా పంటలు పండించుకోవచ్చునని తెలిపారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.
అనంతరం లోకేష్ సంక్షేమ నిధికి గ్రామానికి చెందిన ఆవుల కృష్ణ్ణప్రసాద్ రూ.5వేల చెక్కును స్పీకర్‌కు అందజేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, ఎంపీపీ బొంతా నాగమల్లేశ్వరి, జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ పృధ్వీలత, సర్పంచ్ రోజ్‌మేరి, ఎంపీటీసీలు ఆరెమండ్ల సుగుణమ్మ, యల్లంకి లలితకుమారి, ఎలక్ట్రికల్ డీఈ మురళీకృష్ణయాదవ్, ఏడీఈ జె.సంజీవరావు, ఏఈ బసవరాజు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.