రాష్ట్ర మాజీమంత్రి, టీడీపీ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావును అసమ్మతి వెంటాడుతూనే ఉంది. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా పరాజయం పాలవడంతో కోడెల ప్రాభవం మసకబారుతూ వచ్చింది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు
రాష్ట్ర మాజీమంత్రి, టీడీపీ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావును అసమ్మతి వెంటాడుతూనే ఉంది. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా పరాజయం పాలవడంతో కోడెల ప్రాభవం మసకబారుతూ వచ్చింది. కోడెలకు గతంలో అత్యంత సన్నిహితులుగా మెలిగిన కొంత మంది నాయకులు వ్యతిరేకవర్గంగా మారి నరసరావుపేట నియోజకవర్గంలో వేరుకుంపటి పెట్టారు. ఇరవై రోజుల క్రితం వీరిలో కొందరు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలిసి రానున్న ఎన్నికల్లో కోడెలకు తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా తామంతా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని తమ అభిప్రాయాన్ని చెప్పారు.
అధినేత ఏ విధంగానూ స్పందించకపోవడంతో రెండు రోజుల క్రితం ఆయన కుమారుడు నారా లోకేష్‌ను కలిసి పార్టీ పరిస్థితులను వివరించారు. కోడెల తమనే కాకుండా నియోజకవర్గంలోని కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆయన వైఖరి కారణంగా పార్టీ ఇప్పటికి రెండుసార్లు ఓటమిని చవి చూసిందని, ఇప్పటికైనా నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించాలని వివరించినట్టు తెలిసింది. అందుకు లోకేష్ సానుకూలంగానే స్పందించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి