ఖరీ...ఉఫ్‌ 

Kharif Season Made Farmers Tears In Kurnool - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌) : ఖరీఫ్‌ సీజన్‌లో ముందస్తుగా వేసిన దాదాపు అన్ని పంటల్లో దిగుబడులు జీరోగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగానికి చెందిన సహాయ గణాంక అధికారులు, వ్యవసాయశాఖకు చెందిన ఏఈవోలు, ఎంపీఈవోలు నిర్వహిస్తున్న పంటకోత ప్రయోగాల్లో ఈ విషయం నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా జిల్లాలోని కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్‌లలో ఖరీఫ్‌ దిగుబడులను అంచనా వేసేందుకు  పంటకోత ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. వరికి గ్రామం యూనిట్‌గా ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన అమలు చేస్తున్నందున 1,580 పంటకోత ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంది. మిగిలిన పంటల్లో 666 పంటకోత 

ప్రయోగాలు నిర్వహిస్తారు. వరిలో ఇంకా పంటకోత ప్రయోగాలు మొదలు కాలేదు. మిగిలిన పంటల్లో కొద్దిరోజులుగా దిగుబడులను అంచనా వేస్తున్నారు.  ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి సాధారణ సాగు 6,35,327 హెక్టార్లు ఉండగా జూన్, జూలై నెలల్లో 3 లక్షల హెక్టార్ల వరకు సాగు చేశారు. తరువాత సాగు.. 6,24,897 హెక్టార్లకు పెరిగింది. వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోవడంతో పలు గ్రామాల్లో దున్నేశారు. కొన్ని గ్రామాల్లో ఉన్నా..దిగుబడులు అసలు కనిపించలేదు. వేరుశనగతో పాటు కొర్ర, సజ్జ, మినుము పంటల్లో ఈ పరిస్థితి కనిపించింది.   
ఆలస్యంగా వేసిన పంటల్లో 

ఒక మోస్తరు దిగుబడులు.... 
సెప్టెంబరు నెలలో వివిధ మండలాల్లో భారీగా, మరికొన్ని మండలాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ప్రభావంతో ఆలస్యంగా సాగుచేసిన పంటల్లో 20 నుంచి 40 శాతం వరకు దిగుబడులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా..ఖరీఫ్‌లో నిండా మునిగిన రైతులు ర బీలో శనగ, జొన్న వంటి పంటలు వేసుకోవడానికి భూములను సిద్ధం చేసుకున్నారు. వర్షాలు లేకపోవడంతో రబీ సాగు ప్రశ్నార్థకం అయింది. రబీలో సాధారణ సాగు 3.50 లక్షల హెక్టార్లు ఉండగా శనగ 2.20 లక్షల హెక్టార్లలో సాగవుతోంది.  

రూపాయి దిగుబడి లేదు
నేను ఐదు ఎకరాల్లో సజ్జ, కంది, ఆముదం వేశాను. ఎకరాకు సగటున రూ.15వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఒక్క రూపాయి విలువ పంట కూడా రాలేదు. ఇంతటి దారుణ పరిస్థితులు ఎన్నడూ లేవు. అప్పులు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. పశువులకు మేత కూడా లేకుండా పోయింది. దారుణమైన కరువు పరిస్థితులు ఉన్నా.. ప్రభుత్వం నుంచి చేయూత లేకుండా పోయింది.   : ముసలన్న, నేరడుచెర్ల గ్రామం, ప్యాపిలి మండలం 
 
దిగుబడులే లేవు : 
జూన్‌లో వేసిన పంటలన్నీ దెబ్బతిన్నాయి. పంట కోత ప్రయోగాలకు ఎంపిక చేసిన భూముల్లో ఇప్పటికే పంటలను దున్నేశారు. దీంతో రైతులు స్టేట్‌మెంట్‌ తీసుకొని.. జీరో దిగుబడులు ఉన్నట్లు నమోదు చేస్తున్నాం. ముందస్తుగా వేసిన వేరుశనగ, కొర్ర, ఆముదం తదితర పంటలన్నీ ఎత్తిపోయాయి. పంట కోత ప్రయోగాలపై విశ్లేషణ అమరావతిలో చేస్తారు. 
– రమణప్ప, డీడీ, జిల్లా ముఖ్య  ప్రణాళిక విభాగం 

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు.. (మిల్లీమీటర్లలో)
నెల     సాధారణ వర్షపాతం     నమోదైన వర్షపాతం 

జూన్‌         77.2                  65.2 
జూలై         117.2                 52.9 
ఆగస్టు       135.0                65.8 
సెప్టెంబరు    125.7               98.7 
అక్టోబరు     114.5               32.3  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top