
శ్రీకాకుళం జిల్లాకు విమానాశ్రయం అవసరమా?
ఎన్నో సహజ వనరులున్నా.. వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిన శ్రీకాకుళం జిల్లాకు ఇప్పటికిప్పుడు విమానాశ్రయం అవసరమా?.. అసలు జిల్లాలో విమాన ప్రయాణం చేయగలిగే స్తోమత
శ్రీకాకుళం: ఎన్నో సహజ వనరులున్నా.. వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిన శ్రీకాకుళం జిల్లాకు ఇప్పటికిప్పుడు విమానాశ్రయం అవసరమా?.. అసలు జిల్లాలో విమాన ప్రయాణం చేయగలిగే స్తోమత ఎంతమందికి ఉంది??.. ఇవేవీ పట్టించుకోకుండా.. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్న ఎన్నికల హామీని సైతం విస్మరించిన టీడీపీ ప్రభుత్వం శ్రీకాకుళం ప్రాంతంలో విమానాశ్రయం పెడతామంటూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తోంది. జిల్లా పరిస్థితిని ఒక్కసారి పరిశీలిస్తే.. వ్యవసాయాధారమైన జిల్లా ప్రజల ఆర్థిక స్థితిగతులు అంతంతమాత్రమే.
పరిశ్రమలు లేక.. ఉపాధి దొరక్క వలసపోయే వారే ఎక్కువ. కొన్ని సర్వేల ప్రకారం.. జిల్లా జనాభాలో 3 శాతం మంది కూడా విమాన ప్రయాణాలు చేయడం లేదు. సుమారు 20 శాతం మందే రైళ్లలో ఏసీ ప్రయాణాలు చేస్తున్నారు. మిగతా వారంతా రైళ్లలో జనరల్ భోగీలు, బస్సుల మీదే ఆధార పడుతున్నారు. ప్రజా రవాణా పరిస్థితి ఇలా ఉండే.. విమానాల ద్వారా సరుకుల రవాణాకు అవకాశాలేమైనా ఉన్నాయా అంటే.. అదీ లేదు. అసలు పరిశ్రమలే లేనప్పుడు ఇక సరుకు రవాణా ఎక్కుడుంటుంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. కేవలం మూడు శాతం ప్రజల కోసం వందల కోట్లు పోసి విమానాశ్రయం నిర్మిస్తామని పాలకులు ప్రతిపాదించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
పరిశ్రమలతోనే ప్రగతి
జిల్లా అభివృద్ధి చెందాలంటే విమానాశ్రయాలు కాకుండా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ప్రతిపాదిత కోస్టల్ కారిడార్‌ను శ్రీకాకుళం వరకూ పొడిగిస్తే కొంతమేర విమానాశ్రయం అవసరం ఉంటుంది. అపుడు కూడా శ్రీకాకుళం జిల్లాలోనే విమానాశ్రయం ఉండాలని లేదు. సమీప ప్రాంతంలో ఉంటే సరిపోతుంది. విమానాశ్రయానికి పెట్టే వందల కోట్ల ఖర్చుతో మరికొన్ని పరిశ్రమలు పెట్టవచ్చు. దాని వల్ల ఉపాధి అవకాశాలు పెరిగి జిల్లా నుంచి వలసలకు కూడా అడ్డుకట్ట వేయవచ్చు. ముందు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే.. ఆ తర్వాత విమానాశ్రయాలు ఏర్పాటు చేసిన పర్వాలేదు గానీ.. విమానాశ్రయం ఉన్నంత మాత్రాన పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉండవు.
విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయానికి అదనంగా గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల విశాఖకు సమీపంలోనే ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు విమానాశ్రయాల అవసరం అంతగా ఉండదు. విమాన ప్రయాణం చేయాలనుకున్నవారు విశాఖపట్నం వెళ్లి విమానం ఎక్కగలరు. ఉదాహరణకు హైదరాబాదులో ఓ భాగమైన ఘటకేసర్, తదితర ప్రాం తాల విమాన ప్రయాణికులు శంషాబాద్ వెళ్లి విమానాలు ఎక్కుతున్నారు. వాటి మధ్య ఉన్నంత దూరమే శ్రీకాకుళం- విశాఖపట్నం మధ్య ఉంటుంది. జిల్లా ప్రజాప్రతినిధులు ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అత్యధిక జనాభాకు ఉపయోగపడే.. జిల్లా ప్రగతికి దోహదపడేలా పరిశ్రమలు, ఇతర పెద్ద ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.