దసరాకు ముమ్మర ఏర్పాట్లు | Intensive arrangements for Dasara | Sakshi
Sakshi News home page

దసరాకు ముమ్మర ఏర్పాట్లు

Aug 25 2014 2:33 AM | Updated on Sep 29 2018 5:52 PM

దసరాకు ముమ్మర ఏర్పాట్లు - Sakshi

దసరాకు ముమ్మర ఏర్పాట్లు

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో తొమ్మిది రోజులపాటు జరిగే దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

  • ఘాట్ రోడ్డు మీదగానే క్యూలైన్లు
  •  ఈ ఏడాది వెయ్యి రూపాయల బుక్‌లెట్లు
  • విజయవాడ : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో తొమ్మిది రోజులపాటు జరిగే దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఆహ్వాన పత్రికలుసిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 25 నుంచి దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలామంది భక్తులు ఈ ఏడాది మహామండపం మీదుగా క్యూలైన్ ఏర్పాటు చేస్తారని భావించారు. అయితే గతంలో మాదిరిగా వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేస్తామంటూ ఆహ్వానపత్రికల్లో పేర్కొన్నారు. దీంతో ఎప్పటిలానే సుమారు ఐదు కిలోమీటర్లు భక్తులు క్యూ మార్గంలో నడుచుకుంటూ వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే.
     
    బుక్‌లెట్స్ రూ.1,000
     
    తొమ్మిది రోజులు అమ్మవారి దర్శనం చేసుకునే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ఏటా వెయ్యి రూపాయల టికెట్ బుక్‌ను ముద్రిస్తున్నారు. ఈ ఏడాది కూడా  ఈ తరహా పుస్తకాలను దేవస్థానం విక్రయించేందుకు సిద్ధమవుతోంది.  ఈ పుస్తకం కొనుగోలు చేసిన భక్తులకు నిర్ణీత సమయంలో అనుమతిస్తారు.
     
    తొలి రోజు దర్శనం ఉదయం 9.30 గంటలకు
     
    సెప్టెంబర్ 25వ తేదీన ఉదయం అమ్మవారికి స్నపనాభిషేకం, న్వర్ణకవచాలంకృత  కనకదుర్గాదేవిగా అలంకరణ అనంతరం 9.30 గంటల తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.  అక్టోబర్ 2న  అష్టమి, నవమి   రెండు తిథులు కలిసి రావడంతో  ఒకేరోజు అమ్మవారు రెండు అలంకారాల్లో దర్శనమిస్తారు.  ఆ రోజున తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దుర్గాదేవి, మధ్యాహ్నం  3 గంటల నుంచి  మహిషాసురమర్ధిని అలంకారాలు ఉంటాయి.  1 గంట నుంచి మూడు గంటల వరకు దర్శనాన్ని నిలిపివేస్తారు. ఇక  ఉత్సవాలలో మిగిలిన  రోజులు తెల్లవారుజామున  3 నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు.
     
    ప్రత్యేక కుంకుమార్చనలు..
     
    సెప్టెంబర్ 25 నుంచి  అక్టోబర్ 3 వరకు జరిగే దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహిస్తారు. పాల్గొనే భక్తులు రోజుకు రూ.1,116 చొప్పున చెల్లించాలి. 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఒక బ్యాచ్‌ను మాత్రమే పూజకు అనుమతిస్తున్నారు.  26వ తేదీ నుంచి 3వ తేదీ వరకు రోజుకు రెండు బ్యాచ్‌ల చొప్పున  ఉదయం  7 గంటల నుంచి 9 గంటల వరకు , తిరిగి 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement