కేంద్ర సంస్థలను రంగంలోకి దింపండి | Sakshi
Sakshi News home page

కేంద్ర సంస్థలను రంగంలోకి దింపండి

Published Thu, Jul 20 2017 1:00 AM

కేంద్ర సంస్థలను రంగంలోకి దింపండి - Sakshi

ఏపీ, తెలంగాణలో డ్రగ్స్‌ వ్యవహారంపై ఎంపీ విజయసాయిరెడ్డి వినతి
 
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి రాజ్యసభలో బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ నిరోధానికి కేంద్ర సంస్థలను రంగంలోకి దింపాలని కోరారు. జీరో అవర్‌లో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘‘దురదృష్టవశాత్తూ కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోయింది. ముఖ్యంగా సినీ నటులు, కళాశాల విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో పాటు పాఠశాలలకు వెళ్లే చిన్నారులు కూడా ఈ డ్రగ్స్‌ వినియోగదారుల్లో ఉన్నారు. ఇది దిగ్భ్రాంతి కలిగించే అంశం.

డ్రగ్స్‌ సరఫరా చేసే ముఠాలు దేశవ్యాప్తంగా వారి కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. వీటిని నియంత్రించడంలో రాష్ట్రస్థాయి సంస్థలు విఫలమవుతున్న నేపథ్యంలో కేంద్ర సంస్థలు రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌ తయారుచేసే ముఠాలు విదేశాల నుంచి, ముఖ్యంగా జర్మనీ నుంచి ముడిసరుకును దిగుమతి చేసుకుంటున్నాయని విజయసాయిరెడ్డి తెలిపారు. మెథంపెటమైన్, కెటమైన్, ఎఫిడ్రిన్, ఆంఫెటమైన్‌ తదితర రూపాల్లో డ్రగ్స్‌ను ఇక్కడ సరఫరా చేస్తున్నారని వివరించారు.

డ్రగ్స్‌ ముఠాల మాయలో పడి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 20 ప్రముఖ కార్పొరేట్‌ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాల యాజమాన్యాలకు సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవలే 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి 700 యూనిట్ల ఎల్‌ఎస్‌డీ, 35 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారని వివరించారు.

Advertisement
Advertisement