
'నేను కూడా జూన్ 2 వ తేదీనే ప్రమాణ స్వీకారం చేస్తున్నా'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తీరుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ వివరించినట్లు గవర్నర్ నరసింహన్ తెలిపారు.
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తీరుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ వివరించినట్లు గవర్నర్ నరసింహన్ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన నరసింహన్..మోడీని కలిసి విభజన తదితర అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేసే జూన్ 2 తేదీనే తాను కూడా తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో విద్యుత్ అవసరం ఎక్కువగా ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకోవాలన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు నరసింహన్ స్పష్టం చేశారు. జూన్ రెండో తేదీతో తెలంగాణలో రాష్ట్రపతి పాలన ముగుస్తుండగా, జూన్ ఎనిమిదో తేదీతో ఏపీలో రాష్ట్రపతి పాలన ముగుస్తుందన్నారు. అదే రోజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని నరసింహన్ తెలిపారు.