జిల్లాలోనే అతి పెద్దదైన శ్రీరంగరాయుడి (శింగనమల) చెరువు కింద ఆయకట్టుకు నీరు విడుదల చేస్తే దాదాపు ఐదు వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయి.
ఈసారైనా పంట పెట్టి అప్పులు తీర్చుకోవాలన్న ఆశలో అన్నదాతలు.. వాళ్లలా చేస్తే తమ కుటుంబాలు వీధిన పడతాయన్న నిరాశలో మత్స్యకారులు కొట్టుమిట్టాడుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హామీ కూడా నీటిమూటే అని తెలిసినా అన్నదాతలు సాగుకు సిద్ధమవుతున్నారు. ఏళ్ల తరబడి బీడు పెట్టిన పొలంలో ఆరుతడి పంటనైనా సాగు చేయాలనుకుంటున్నారు. అయితే అరకొర నీటితో సాగు చేస్తే పంటలు చేతికందేది అనుమానమేనని అధికారులు అంటున్నా..అవేమీ పట్టించుకోని రైతన్న నాగలి పట్టి పొలం బాట పట్టాడు. ఇదే సమయంలో చెరువులో నీరు తగ్గిపోతే తమ జీవితాలు దుర్భరమవుతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం టౌన్/ శింగనమల, న్యూస్‌లైన్ : జిల్లాలోనే అతి పెద్దదైన శ్రీరంగరాయుడి (శింగనమల) చెరువు కింద ఆయకట్టుకు నీరు విడుదల చేస్తే దాదాపు ఐదు వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. శింగనమల, గోవిందరాయునిపేట, సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం, మట్లగొంది, శివపురం, బండమీదపల్లి, పోతురాజుకాల్వ, చక్రాయపేట, పెరవలి తదితర గ్రామాల్లోని మూడు వేల కుటుంబాలకు శింగనమల చెరువు కింద భూములు ఉన్నాయి. ఏడేళ్ల నుంచి సరిగా వర్షాలు రాకపోవడంతో చెరువులోకి సమృద్ధిగా నీరు చేరడం లేదు. దీంతో ఆయకట్టు భూములను రైతులు బీడుగానే పెట్టేయడంతో అవి ముళ్ల కంపలతో నిండిపోయాయి.
అయితే గత నెలలో నార్పలలో జరిగిన రచ్చబండలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేత శింగనమల చెరువు ఆయకట్టుకు నీరిస్తామని మంత్రి శైలజానాథ్ హామీ ఇప్పించారు. దీంతో రైతులంతా గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఏళ్లుగా బీడు పడిన భూములను వేలాది రూపాయలు వెచ్చించి సాగు చేయడానికి అనువుగా తయారు చేసుకుంటున్నారు. అయితే నీరు విడుదల చేయడం అసాధ్యమనే భావన వ్యక్తమవుతోంది. ఎందుకంటే అదనపు కోటాలో దాదాపు 2 టీఎంసీలు కోత పడడంతో శింగనమల చెరువుకు ఇవ్వడం కుదరడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అదనంగా నీటిని తీసుకొస్తే తప్పా నీరు విడుదల చేయలేమని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది రైతులు చెరువులో ఉన్న 0.5 టీఎంసీల అరకొర నీటితో ఆరుతడి పంటలైనా సాగు చేయాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే రైతులు సాగు చేసిన పంటలు చేతికందడం గగనమేనని అధికారులు అంటున్నారు. ఒక వైపు రబీ సీజన్ కావడంతో ఎక్కువ నీటి తడులు అవసరమవుతాయని, పంట చేతికొచ్చే సమయంలో చెరువులో నీరు తగ్గిపోతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసిన రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. పరిస్థితి ఇంతగా ఉన్నా మంత్రి శైలజానాథ్ కానీ, ఎమ్మెల్సీ శమంతకమణి గానీ రైతుల సమస్యలపై దృష్టి సారించడం లేదు. అదనంగా ఒక టీఎంసీనైనా తీసుకొస్తే కాస్త ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు.