సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల చదువులకు కీలకమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆలస్యంగా నిధులను విడుదల చేసింది.
ఫీజులకు రూ.2,537 కోట్లు విడుదల
ఇంకా రూ.1,500 కోట్లు అవసరం
ఆధార్ నంబర్ కొర్రీతో దరఖాస్తుకు నోచుకోని 12 లక్షల మంది
సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల చదువులకు కీలకమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆలస్యంగా నిధులను విడుదల చేసింది. 2013-14 విద్యా సంవత్సరం మరో మూడు నాలుగు నెలల్లో ముగుస్తుండగా.. కేవలం రూ. 2,537 కోట్లను విడుదల చేసింది. వాస్తవానికి ఈ ఏడాదికి సంబంధించి పూర్తిగా ఫీజులు, స్కాలర్‌షిప్‌లు చెల్లిం చాలంటే రూ.4,000 కోట్లకుపైగా అవసరమవుతాయని సంక్షేమ శాఖల ఉన్నతాధికారుల అంచనా. నిజానికి ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో దాదాపు రూ. 1,000 కోట్లు మినహా మిగిలినవన్నీ గతేడాది బకాయిలు చెల్లింపునకే సరిపోయాయి. దీంతో అదనపు నిధులివ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్ కన్నా రూ.1,448 కోట్లు అదనంగా.. మొత్తం రూ. 2,537 కోట్లు ఫీజుల పథకానికి ఇస్తున్నామని ఆర్థిక మంత్రి ఆనం శనివారం వెల్లడించడం విశేషం.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పుడో?
నిధుల విడుదల అటుంచితే అసలు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద దరఖాస్తు చేసుకున్న, చేసుకోవాల్సిన విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ఆధార్ యూఐడీ నంబర్ నమోదు చేస్తేనే దరఖాస్తు ఓపెన్(తెరచుకోవడం) అవుతుండడంతో నంబర్‌లేని దాదాపు 12లక్షల మంది విద్యార్థులు కనీసం ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదు. ఇక దరఖాస్తు చేసుకున్న వారి విషయంలోనూ ఎలాంటి పురోగతి లేదని అధికారులు చెబుతున్నారు. కనీసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ప్రారంభం కాలేదని, ఈ నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని వారు కోరుతున్నారు.