ఇంకా అడ్డుకోవడమేమిటి? | Gattu Ramachandra Rao Questioned Telangana JAC | Sakshi
Sakshi News home page

ఇంకా అడ్డుకోవడమేమిటి?

Mar 3 2014 1:07 AM | Updated on Sep 4 2018 5:07 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఖమ్మంలో చేయతలపెట్టిన ‘వైఎస్సార్ జనభేరి’ని అడ్డుకుంటామని తెలంగాణ జేఏసీ, టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ నేతలు పిలుపునివ్వడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు.

టీ-నేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ నేత ‘గట్టు’ప్రశ్న
ఇది ప్రజాస్వామ్య పద్దతి కాదని హితవు
 
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఖమ్మంలో చేయతలపెట్టిన ‘వైఎస్సార్ జనభేరి’ని  అడ్డుకుంటామని తెలంగాణ జేఏసీ, టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ నేతలు పిలుపునివ్వడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అడ్డుకోవాలంటూ పిలుపునివ్వడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. టీ-జేఏసీ నేతలు దొరల మాట వినడం మంచిది కాదన్నారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంవద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినందున రాష్ట్రాభివృద్ధికి అందరి అభిప్రాయాలను తీసుకుని ముందుకెళ్లాలి తప్పితే.. అణచివేత కొనసాగుతుందని చెప్పడం టీ-జేఏసీకి, టీఆర్‌ఎస్‌కు తగదని హితవు పలికారు. వారికి తెలంగాణపై ఉన్న అభిమానం కంటే అధికారంపైనే కోరిక ఎక్కువ ఉన్నట్టుందని విమర్శించారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. అంతి మంగా నిర్ణయించాల్సింది ప్రజలేనని, అది ఎన్నికల్లో తేలుతుందన్నారు.

ప్రజాభిమానాన్ని పక్కనపెట్టి అడ్డుకుంటామని పిలుపునివ్వడం ప్రజాస్వామిక చర్య కాదన్నారు. భవిష్యత్తులో మరో నేత వచ్చి నాలుగైదు జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్‌తో కేసీఆర్, కోదండరాంలను అడ్డుకుంటామని పిలుపునిస్తే అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలమధ్య విద్వేషాలు, వైషమ్యాలు తీసుకొచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించడం పద్ధతి కాదని హితవు పలికారు. తెలంగాణ  ఏర్పడినందున ఇకనుంచైనా రెచ్చగొట్టే ప్రకటనలు ఆపాలని ఆయన కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement