అర్హులందరికీ పరిహారం

Floods Compensation Given Eligible People Said MLA Sudheer Reddy - Sakshi

గండికోట ముంపు బాధితులకు సుధీర్‌రెడ్డి హామీ

సాక్షి, కొండాపురం:  గండికోట ప్రాజెక్టులో అర్హులైన ముంపు నిర్వాసితులకు  పరిహారం చెల్లింపులో అన్యాయం జరగకుండా చూడాలని జమ్మలమడుగు ఎమ్మేల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని తాళ్లప్రొద్దుటూరు జెడ్పి ఉన్నతపాఠశాల ఆవరణంలో ముంపుబాధితులతో ఆయన భేటీ అయ్యారు.  ఎమ్మేల్యేతోపాటు ఆర్డీఓ నాగన్న, జిఎన్‌ఎస్‌ఎస్‌ ఈఈ రామంజనేయులు.. మండల తహశీల్దార్‌ మాధవ కృష్ణారెడ్డి హాజరయ్యారు. డాక్టర్‌ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ గండికోట జలాశయంలోకి ఈనెలాఖరులోపు నీరు విడుదల కానుందన్నారు. కరువు నేపథ్యంలో ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డి సాగు, తాగునీరు అవసరాలకోసం శ్రీశైలంనుంచి కృష్ణా జలాలను తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. వామికొండ, సర్వారాయసాగర్, మైలవరం, పైడిపాళెం ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసి గండికోట జలాశయంలో 20 టీఎంసీలనీటిని నిల్వ చేయబోతున్నామన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే నిర్వాసితులకు రూ.10లక్షల పరిహారం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో 2017 నుంచి ఇప్పటివరకు పేస్‌–2 గ్రామాలకు  కనీసం పునరావాస స్థలాలు కేటాయించలేదన్నారు. పేస్‌–2  కిందయర్రగుడి, చామలూరు, తాళ్లప్రొద్దుటూరు గ్రామాల్లో చెక్కులు ఇవ్వకమునుపే ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌కు స్థలాలు చూసి ప్లాట్‌లలో  లే ఆవుట్‌ ఎర్పాటుచేయాలని ఆదేశించారు. గండికోటలో 13 టీఎంసీలు నీరు నిల్వ చేరితే తాళ్ల ప్రొద్దుటూరులోని ఎస్సీ, బిస్సీ కాలనిల్లోకి  నీరు చేరుతుందన్నారు. నిర్వాసితులందరు సహాకరించాలన్నారు. అందరికి న్యాయం జరిగేలా పరిహారం అందిస్తామన్నారు. ముంపునిర్వాసితులు తమ సమస్యలను వివరించార. ఈ నెల 16 వ తేదిన రెండో దశ గ్రామాలకు గెజిట్‌ లిస్ట్‌ విడుదల చేస్తామని ఆర్డీవో నాగన్న చెప్పారు.  అందులో రాని వారు ఆర్జీ రూపంలో తెలిపితే అర్హులందరికీ న్యాయం చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా  కార్యదర్శి ఎస్‌. చిన్న అంకిరెడ్డి, జిల్లా యూత్‌ప్రధాన కార్యదర్శి ఆర్‌. హరినారాయణరెడ్డి, బోరునారాయణరెడ్డి, మండల కన్వీనర్‌ నిరంజన్‌రెడ్డి, యర్రగుడి లక్ష్మినారాయణరెడ్డి, తుంగ శివారెడ్డి, నారాయణరెడ్డి, రామిరెడ్డి, చింతరాజారెడ్డి, సత్యనారాయణరెడ్డి, అల్లం సత్యం,రామసుబ్బారెడ్డి, రహంతుల్ల, మునయ్య  పాల్గొన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top