కాసుల కోసమే..? | Eventually there ..? | Sakshi
Sakshi News home page

కాసుల కోసమే..?

Dec 30 2013 2:01 AM | Updated on Sep 2 2017 2:05 AM

ఏసీడీపీ నిధుల వినియోగం కోసమేనా? పార్టీ ఖాళీ అవుతున్న వేళ కొత్త నాటకానికి తెరలేపారా? భవిష్యత్ రాజకీయాల్లో కేడర్ తమ వెంట ఉంచుకునే యత్నమేనా?

=ఏసీడీపీ నిధుల పందారానికి రెడీ!
 =ఎట్టకేలకు ఇన్‌చార్జి మంత్రిగా కాసు
 =కేడర్‌ను దక్కించుకోవడానికి నియామకం

 
సాక్షి, విశాఖపట్నం: ఏసీడీపీ నిధుల వినియోగం కోసమేనా? పార్టీ ఖాళీ అవుతున్న వేళ కొత్త నాటకానికి  తెరలేపారా? భవిష్యత్ రాజకీయాల్లో కేడర్ తమ వెంట ఉంచుకునే యత్నమేనా? ఇన్‌చార్జి మంత్రిగా కాసు వెంకట కృష్ణారెడ్డి తాజా నియామకం ఉద్దేశమదేనా?...అంటే అవుననే అనిపిస్తోంది. ఏడాదిగా జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి లేరు. వారి కోటా కింద మంజూరైన రూ. కోట్ల ఏసీడీపీ(అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి ఫండ్స్) నిరుపయోగంగా ఉండి పోయాయి. దీంతో నియోజకవర్గాల అభివృద్ధి కుంటుపడింది. అయినా ఇన్‌చార్జిని నియమించే ప్రయత్నం సీఎం చేయలేదు. ఇదిగో అదిగో అని కాలం వెళ్లదీశారు. ఏసీడీపీ నిధుల్ని గాలికొదిలేశారు.

జిల్లాలో 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.4.5 కోట్లు విడుదలవ్వగా, గతేడాదికి సంబంధించి రూ.8.5 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో గతేడాదికి సంబంధించి సుమారు రూ.కోటి మాత్రమే ఖర్చయింది. వాస్తవానికి నియోజకవర్గాల్లో వివిధ అవసరాలు, పనుల నిమిత్తం ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపితే, వాటికి ఇన్‌చార్జి మంత్రి తన వాటాలో నిధులను మంజూరు చేస్తారు. ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ధర్మానప్రసాదరావు రాజీనామా చేశాక న్యాయ శాఖామంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి నియమిస్తారని ప్రచారం జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు.

దీంతో ఈసారికింతే అన్న వాదన వ్యక్తమైంది. అలాగే ఏసీడీపీ నిధులకు మోక్షం కలగ లేదు. ఇంతలో రాష్ట్ర విభజన రచ్చతో కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. దాదాపు కేడర్ దూరమవుతోంది. రకరకాల రాజకీయ ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితిపై సీఎం దృష్టిసారించారు. ఇన్‌చార్జి మంత్రిగా సహకారశాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డిని నియమించారు.

యుద్ధప్రాతిపదికన ఏసీడీపీ నిధులను ఖర్చు పెట్టే అంకానికి తెరలేపారు. అనుకూల వ్యక్తులకు ఆ పనులు కట్టబెట్టి భవిష్యత్ రాజకీయాల్లో కేడర్‌ను తమ వెంట తిప్పుకునేందుకు అధికారపార్టీ నాయకులు యత్నిస్తున్నారు. అయితే సీఎం ఎత్తుగడ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ఏదేమైనా ఇన్‌చార్జి మంత్రి కోటాలో విడుదలైన ఏసీడీపీ నిధులకు మోక్షం కలగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement