సర్కార్‌ బడిలోనూ ఇంగ్లిషు మీడియం

English Medium In Government Schools Kurnool - Sakshi

1437 స్కూళ్లలో అమలు 

క్షేత్రస్థాయిలో ప్రచారం  

కర్నూలు సిటీ:  ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిషు మాధ్యమం అమలు చేయాలని గతేడాది ప్రయత్నించినా కొన్ని పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు.  ఈ ఏడాది నుంచి ఎలాగైనా అమలు చేయాలని అధికారులు  జిల్లాలోని 2035 స్కూళ్లను ఎంపిక చేసి విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపారు.  ఈ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న విద్యాశాఖ గత నెలలో మొదటి విడత కింద జిల్లాలో 625 పాఠశాలలకు అనుమతులు ఇచ్చారు. తాజాగా మరో 812 స్కూళ్లలోనూ అమలుకు ఆదేశాలు ఇస్తూ,  క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి తోడు రాష్ట్రంలోనే అత్యధిక మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న జిల్లాగా  కర్నూలుకు గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం  అమలుకు అనుమతులు ఇచ్చారు. ఈ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంతో పాటు డిజిటల్‌ తరగతులు కూడా ఏర్పాటు చేసి ప్రైమరీ క్లాస్‌లకు ప్రత్యేకంగా నిపుణులతో తయారు చేసిన మెటీరియల్‌  ఇవ్వాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది. 

విస్తృత ప్రచారం..: జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల కింద మొత్తం 2870 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక  1927, ప్రాథమికోన్నత 389, ఉన్నత పాఠశాలలు 554 ఉన్నాయి. వీటిలో మొదటి విడత కింద 541 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు, 52 ప్రైమరీ, 32 ప్రాథమికోన్నత పాఠశాలలు, రెండో విడత కింద 599 ప్రాథమిక, 213 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం అమలుకు ఆదేశాలు ఇచ్చారు. మొదటి విడత కింద ఎంపిక చేసిన స్కూళ్లలో ప్రవేశాలు భారీగా కల్పించేందుకు  విద్యాశాఖ అధికారులు టీచర్లతో విస్త్రృతంగా ప్రచారం చేయిస్తున్నారు.  పాణ్యం   ఎంఈఓ కోటయ్య ప్రత్యేకంగా ఆటోకి ఫ్లెక్సీలు వేయించి మండల పరిధిలోని గ్రామాల్లో  తిప్పుతున్నారు.  ఈ ప్రచారంతో  సుమారు 60కిపైగా కొత్త అడ్మిషన్లు చేయించి జిల్లాలోని మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు. ఈ విధంగా అన్ని మండలాల్లోని గ్రామాల్లో ప్రచారం చేస్తే ఈ ఏడాది భారీగానే సర్కార్‌ స్కూళ్లలో ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంది. అయితే వీరికి తెలుగు మీడియం టీచర్లతోనే చదువులు చెప్పిస్తారా? లేకపోతే కొత్త  నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తారా అనేది ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top