ఆర్టీసీకి ఎన్నికల సెగ | Elections Effect On RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి ఎన్నికల సెగ

Mar 14 2018 10:52 AM | Updated on Aug 14 2018 5:56 PM

Elections Effect On RTC - Sakshi

తిరుపతి సిటీ: ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీకి ఎన్నికల సెగ మొదలైంది. ఆర్టీసీలో ఎన్‌ఎంయూకు ఉన్న అధికార గుర్తింపు కాలం ఈ నెల 3 వ తేదీ నాటికి ముగియడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తికరం కానున్నాయి. ఇంకా ఎన్నికల తేది ఖరారు రాకముదే ఆర్టీసీలోని కార్మిక సంఘాల నాయకులు తమ తమ సంఘాల గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. కొన్ని డిపోల్లో  గ్రూపులు గ్రూపులుగా కూడగట్టుకుని కార్మికులను తమ వైపు తిప్పుకునేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికుల్లో ఆ పార్టీపై మరింత విశ్వాసం పెరిగింది.

జిల్లా వ్యాప్తంగా 7,205 మంది ఓటర్లు
జిల్లా వ్యాప్తంగా 7,205 మంది ఓటర్లు ఉన్నారు. వాటిలో 14 డిపోలతో పాటు ఆర్‌ఎం కార్యాలయం, రీజనల్‌ వర్క్‌షాపుల్లో పనిచేసే ఓటర్లు ఉన్నారు. అధికారులు, సూపర్‌వైజర్లు, కాంట్రాక్ట్‌ కార్మికులకు ఓటు హక్కు లేదు. మరో రెండు వందల మంది దాకా పదవీ విరమణ చెందడం, వారిలో కొంతమంది మృతి చెందడం, వివిధ కారణాలతో ఓట్లు తగ్గిపోయాయి.

గత ఎన్నికల్లో ..
గత 2016 ఫిబ్రవరి నెలలో జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఎన్‌ఎంయూ 11 డిపోల్లో అధిక్యత సాధించింది. మిగిలిన కుప్పం, తిరుపతి, శ్రీకాళహస్తి డిపోల్లో మాత్రమే ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధిక్యత కనబరిచింది. జిల్లా వ్యాప్తంగా ఎన్‌ఎంయూ 700 ఓట్ల మోజారిటీ సాధించి ఆర్టీసీలో అ«ధికారిక గుర్తింపును దక్కించుకుంది. 

వైఎస్‌ హయంలో 2 వేల మంది రెగ్యులర్‌  
9 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పాలనలో ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా క్యాజువల్‌ కార్మికులుగా పనిచేస్తున్న 2వేల మందిని స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రెగ్యులర్‌ ఉద్యోగులుగా నియమించారు. దీంతో పాటు ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయల నిధులన్నీ వైఎస్‌ హయంలో విడుదల అయ్యాయి. ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆర్టీసీని ప్రవేట్‌ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారనే నెపంతో ఇప్పటికే  కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత, ఆందోళన నెలకొంది. 

ఆర్టీసీని విలీనం చేస్తామనే ప్రకటనతో..
వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌.జగన్‌ ఇటీవల జిల్లాలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారు. దీంతో ఆర్టీసీలోని కార్మికులంతా వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ డిపోల్లో వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ మోజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఎన్‌ఎంయూ, ఈయూ, వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్, కార్మిక పరిషత్, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఆర్టీసీ బహుజన వర్కర్స్‌ యూనియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అసోషియేషన్లు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రధాన యూనియన్లతో కొన్ని యూనియన్లు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

మే చివరి వారంలో ఎన్నికలు ?
ఆర్టీసీలో గుర్తింపు యూనియన్‌గా ఉన్న ఎన్‌ఎంయూ పదవీకాలం ఈనెల 3వ తేదికి ముగిసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేతలు కార్మిక సంఘం అధికారులను కలిసి త్వరలో ఎన్నికలు నిర్వహించాలని చాలెంజ్‌ నోటీస్‌ ఇచ్చారు. ఎన్నికల తేది ఖరారు అయిన తర్వాత కార్మిక సంఘాల మధ్య పొత్తులు, సహకారం తదితర అంశాలపై కార్మిక సంఘాలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా మే చివరి వారంలో గానీ, జూన్‌ 10 లోగా కానీ ఎన్నికలు నిర్వహించవచ్చునని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement