ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికలో ప్రభుత్వ నిర్ణయం మరో రాష్ట్ర విభజనకు దారితీసేలా ఉండకూడదని సిటిజన్స్ ఫోరం అభిప్రాయపడింది.
రాజధాని ఎంపికపై సిటిజన్స్ ఫోరం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికలో ప్రభుత్వ నిర్ణయం మరో రాష్ట్ర విభజనకు దారితీసేలా ఉండకూడదని సిటిజన్స్ ఫోరం అభిప్రాయపడింది. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా జరిగిన పెద్ద మనుషుల ఒప్పందాలు అమలు కాలేదని తెలంగాణ ప్రజల్లో అశాంతి మొదలై రాష్ట్ర విభజనకు కారణమైందని.. ఇప్పుడు రాజధాని ఏర్పాటు రాయలసీమ ప్రజల్లో అశాంతి కలిగించని రీతిలో ఉండాలని ఫోరం ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
ఫోరం సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జయభారత్‌రెడ్డి, మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, ఎస్. వీరనారాయణరెడ్డి (ఐపీఎస్), ఏ గోపాలరావు, ఎస్.వీరనారాయణరెడ్డి, వీఎల్‌ఎన్ రెడ్డి, మల్లికార్జునరెడ్డి, డీ సుధాకరరెడ్డిలు మంగళవారం కాంగ్రెస్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖల కార్యాలయాలకు వెళ్లి నేతలకు వినతిపత్రాలు అందించారు.
రాజధాని ఎంపిక అందరికీ ఆమోదయోగ్యంగా జరిగేలా ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరాభవన్‌లో ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడి, బీజేపీ ఏపీ కార్యాలయంలో యడ్లపాటి రఘునాథబాబు, సుధీష్ రాంబొట్లను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతమైతే కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు అన్ని రకాల అందుబాటులో ఉంటుందన్నారు. దొనకొండలో దాదాపు 54 వేల ఎకరాలు బంజరు భూములు ఉన్న కారణంగా పంట పండే వ్యవసాయ భూములను రాజధాని కోసం వృధా చేసే అవసరం ఉండదని చెప్పారు.