నాడి పట్టిన నారి

doctor rajyalaxmi special story on wpmen empowerment - Sakshi

నాడి పట్టి వైద్యం చేసేవారు డాక్టర్లయితే.. కష్టాల నాడి పట్టి మనోధైర్యం నింపేవారు ఈ మహిళా డాక్టర్లు. స్టెతస్కోప్‌తో గుండె పనితీరునే కాదు.. గుండెలో నిండి ఉన్న బాధనూ తీరుస్తున్నారు. సమస్యలతో వచ్చే మహిళా రోగుల్లో మనోస్థైర్యం నింపుతున్నారు.

లబ్బీపేట (విజయవాడ తూర్పు): జీవితంపై ఎన్నో గాట్లు పడతాయి.. ప్రసవం కోసం కోసే కడుపు కోత ఒకటైతే..కష్టాల గుండెకోత మరొకటి.. మత్తు మందు ఇస్తే కడుపు కోత నొప్పి తెలియకపోవచ్చు..గుండెకోత నొప్పి మాత్రం ఈ డాక్టర్లకు చెబితేనే తీరుతుంది.ఆ నొప్పికి మంచి వైద్యంలాగే, ఈ నొప్పికి మనోధైర్యాన్ని నింపుతున్నారు ఈ మహిళా డాక్టర్లు.

ఆమె వైద్యం.. మానసిక ధైర్యం
‘అమ్మ ఆదరించదు. అత్త పట్టించుకోదు. భర్త మద్యం సేవించి ఇంటికి వస్తుంటాడు. అలాంటి కుటుంబాలు నేటికీ ఎన్నో ఉన్నాయి. అలా ఆర్థిక ఇబ్బందితో పేద కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా మా వద్దకు ప్రసవం కోసం వస్తుంటారు. వారిని చూస్తే జాలేస్తుంది. తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతూ ఇతర సమస్యలతో వస్తుంటారు. వారికి తక్షణమే స్పందించి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. కుటుంబ పరిస్థితులు చెబుతుంటే ఆవేదనకు గురవుతాం.’

సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో వైద్యవృత్తిని ఎంచుకున్నారు  ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగాధిపతి డాక్టర్‌ డి.రాజ్యలక్ష్మి. నాన్న దేవరపల్లి అమ్మేశ్వరరావు కోఆపరేటివ్‌ సబ్‌ రిజిస్ట్రార్, అమ్మ సరస్వతి గృహిణి. ఉద్యోగంలో నిబద్ధతతో వ్యవహరించే నాన్నను స్ఫూర్తిగా తీసుకున్నారామె. అలా ఎంబీబీఎస్, పీజీ పూర్తిచేసి 1983లో సర్వీస్‌లో చేరారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన రాజ్యలక్ష్మి 1975–81 బ్యాచ్‌లో గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. 1982–84లో అబ్‌స్టేటిక్స్‌ అండ్‌ గైనకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. కాగా, పీజీ చదువుతున్న సమయంలోనే ఏపీపీఎస్సీ ద్వారా 1983లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన రాజ్యలక్ష్మి 35 ఏళ్లుగా పేదలకు సేవలు అందిస్తున్నారు.

గుడిసెల్లోకి వెళ్లి మరి..
ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేసిన తొలినాళల్లో గుడిసెల్లోకి వెళ్లి నులకమంచంపైనే కాపర్‌ టీ లాంటివి వేసే వాళ్లమని ఆమె గుర్తుచేసుకున్నారు. గ్రామాలకు వెళ్లి షెల్టర్లలో ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్‌లు చేసేవారు. ఇలా.. 35 ఏళ్లు ఎంతోమంది పేదలను చదివారామె.

‘ఇటీవల చుక్కమ్మ అనే గర్భిణీ ప్రసవం కోసం వచ్చింది. వారిది ప్రేమ వివాహం. ఇద్దరు పండంటి శిశులకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు లోకల్‌ సిండ్రోమ్‌ ప్రాబ్లమ్‌ కారణంగా మూడు నెలలుగా వెంటిలేటర్‌పైనే ఉంటోంది. ఇద్దరు పిల్లలకు మూడు నెలలు వయస్సు వచ్చినా తల్లి ఇంకా కోలుకోలేని స్థితిలోనే ఉంది. నా సర్వీసులో ఇలాంటి పరిస్థితి  చూడలేదు.’

కుటుంబమంతా డాక్టర్లే
మహిళలు ఎప్పుడూ బెస్ట్‌ అడ్మినిస్ట్రేటర్లుగా ఉంటారని, తనకు ప్రతి పనిలో భర్త డాక్టర్‌ నాంచారయ్య సహకారం ఉంటుందని రాజ్యలక్ష్మి తెలిపారు. ఆయన జనరల్‌ సర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారని, తనకు ఇద్దరు మగపిల్లలని, ఇద్దరూ ఎంబీబీఎస్‌ పూర్తిచేశారని చెప్పారు. మరింత మంది పేద మహిళలకు సేవచేస్తూ బెస్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని డాక్టర్‌ రాజ్యలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు.

అక్క వాళ్లు మెడిసిన్‌ చేసి బిజీగా ఉండటం చూసి ఆ జీవితం వద్దనున్నాను. అమ్మ అందుకు ఒప్పుకోలేదు. నాన్న నిర్ణయం ప్రకారం చేయాల్సిందేనన్నారు. కానీ, ఇప్పుడు ఈ వైద్య వృత్తిలోకి వచ్చి 21 సంవత్సరాలు నిండింది. ఎందరో అభాగ్యులైన మహిళలకు ఓదార్పుగా నిలిచిన క్షణాలు నాకు గుర్తు. సంతృప్తిగా ఉంది. మా నాన్న నిర్ణయం మంచిదని గుర్తించాను.

రోగులకు ఆమె మనోస్థైర్యం
సాధారణంగా హెచ్‌ఐవీ సోకినవారిని చాలామంది హీనంగా చూస్తుంటారు. వారి దగ్గరకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. కానీ, హెచ్‌ఐవీ సోకిన ఎంతోమంది బాధితులకు కంకిపాడు సామాజిక ఆరోగ్యకేంద్రం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ (డీసీఎస్‌) చిత్రా గురుస్వామి. ధైర్యంగా ప్రసవాలు చేశారు. అంతేకాదు.. భర్త వేధింపులకు గురై శారీరకంగా గాయపడి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, లైంగిక దాడి జరిగిన మహిళలు, చిన్నారులకు ఎంతో సేవ చేశారు. వైద్యం ఒక్కటే ప్రధానం కాదు. మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తన 21 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి ఎన్నో కేసులను ఆమె పరిష్కరించారు. జీవితంపై విరక్తి చెందకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించి బాధితుల్లో ధైర్యం నింపారు.

వద్దనుకున్న రంగంలోనే విజయాలు
చిత్రా గురుస్వామి తల్లిదండ్రులు గురుస్వామి, తాయమ్మ. ఐదుగురు అక్కచెల్లెళ్లు. ముగ్గురు వైద్యరంగం, ఇద్దరు ఇంజినీరింగ్‌ రంగం. చిత్రా గురుస్వామి పుట్టి పెరిగింది అంతా విజయవాడలోనే. ఉన్నత చదువులు అన్నీ మధురైలో కొనసాగించారు. ఇంటర్‌ పూర్తయ్యే నాటికి అక్కలు మెడిసిన్‌ చేసి వైద్యరంగంలో స్థిరపడ్డారు. వారి బిజీ జీవితం చూసి అమ్మో ఈ రంగం వద్దనుకున్నారామె. తల్లికి ఈ విషయాన్ని చెప్పారు. చదువు గురించి నాకేమీ తెలీదు. మీ నాన్న ఏం చెబితే అదే నిజం. అదే జరగాలి అని అమ్మ చెప్పింది. నాన్న నిర్ణయం ప్రకారమే మెడిసిన్‌ పూర్తిచేశారు. కొద్దిరోజులు తమిళనాడులోనూ, ప్రస్తుతం కంకిపాడులో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ‘హెచ్‌ఐవీ బాధితులు, గర్భిణులు.. ఈ పరిస్థితులు అన్నీ గమనించాక నాన్న నిర్ణయం సరైనదేనని గుర్తించాను. కౌమార దశలో వచ్చే మార్పును బాలబాలికలు గుర్తించి మసలుకోవాలి. మంచి నడవడిక అలవర్చుకుంటే మహిళలు, చిన్నారులపై దాడులు, వేధింపులు జరగవు.’ అన్నారు చిత్ర. – కంకిపాడు (పెనమలూరు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top