మందెళ్లి పోతోంది.. !


మహబుబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ ఏడాది ఆశించిస్థాయిలో వర్షాలు కురిసినా, ప్రధాన జలాశయాల్లో పుష్కలంగా నీళ్లున్నా మేత కోసం మూగజీవాలకు యాతన తప్పడం లేదు. ఇప్పటికే జిల్లా నుంచి గొర్రెల మంద వలస ప్రారంభమైంది. డిసెంబర్ నుంచే ఈ వలసలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో పశుసంవర్థకశాఖ లెక్కల ప్రకారం 50 లక్షల గొర్రెలు ఉన్నాయి.

 

 వీటిపై ఆధారపడి 20వేలకు పైగా కుటుంబాలు జీవ నం సాగిస్తున్నాయి. జిల్లాలో వేసవిలో గడ్డి దొరక్కపోవడంతో ఇక్కడి కాపరులు వలసబాట పడుతున్నారు. ఇలా ఇక్కడి నుంచి ఏటా 40 లక్షల గొర్రెలు అత్యధికంగా నల్గొండ జిల్లాకు వలస వెళ్తున్నా యి. జిల్లాలో ముఖ్యంగా మరికల్, దేవరకద్ర, నారాయణపేట, దామరగిద్ద, చిన్నచింతకుంట, మక్తల్, కోడేరు, కొల్లాపూర్, వీపనగండ్ల, వనపర్తి, అడ్డాకుల, ఊట్కూ ర్ మండలాల నుంచి మిర్యాలగూడ, నాగార్జునసాగ ర్ తదితర ప్రాంతాలకు మేతకోసం తీసుకెళ్తున్నారు. అయితే కాపరులను ఆదుకొని గొర్రెలు ఇతర జిల్లాల కు వలసలు వెళ్లకుండా ఉన్న చోటే మేత ఏర్పాటుచేసేందుకు 1996లో అప్పటి ప్ర భుత్వం ప్రత్యేక జీఓలను విడుదల చేసిం ది.

 

 జీఓనెం. 559 ప్రకారం కాపరులు నివసించే ప్రాంతాల్లో గైరాన్, బీడు, బంజా రు భూములు ఉన్నట్లయితే గొర్రెలమేత కోసం వాటిని వారిని అప్పగించాలి. అలాగే జీఓ నెం. 1016 ప్రకారం కాపరు లు నివసించే ప్రాంతంలోని శిఖం, చెరువులు, కుంటలకు చెందిన భూములను గొర్రెల మేత కోసం అప్పగించాలి. ఈ భూములను ఆయా గ్రామాల్లోని గొర్రెల కాపరుల సహకార సంఘం పేర రిజిస్ట్రేషన్ చేయాలని ఆ జీఓలో పేర్కొన్నారు. కాగా, ఈ జీఓలను జారీచేసి 18 ఏళ్లు గడిచినా.. ఇప్పటివరకు జిల్లాలో ఎకరాపొ లం కేటాయించిన దాఖలాలులేవు.

 

 అడుగుపెట్ట నివ్వని అటవీశాఖ

 జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్, నారాయణపేట తదితర ప్రాంతాల్లో లక్ష ఎకరాలకు పైగా అటవీ, గైరాన్ భూములు ఉన్నా వాటిని కాపరులు వినియోగించుకోలేకపోతున్నారు. దూరప్రాంతాలకు వె ళ్లకుండా జిల్లాలోనే గొర్రెలను మేపుకుందామని ఆశించిన కాపరులను అటవీ శాఖ సిబ్బంది అడవిలోకి అడుగుపెట్టని వ్వడం లేదు. అడవిలోకి గొర్రెలను తీసుకెళ్లిన తమను చిత్రహింసలకు గురిచేస్తూ తరిమేస్తున్నారని కాపరులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా, ఇదే విషయమై గతేడాది జరిగిన డీఆర్‌సీ మీటింగ్‌లో కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్‌యాదవ్ కాపరులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా గొర్రెలు అడవుల్లో మేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. ఇదిలాఉండగా మేతకోసం వలసవెళ్లిన చోట గొర్రెలను కాపాడుకోవడం కాపరులకు తలకుమించిన భారం గా మారింది. దొంగలు స్వైరవిహారం చేసి మందలోని గొర్రెలను ఎత్తుకెళ్తున్నా పట్టించుకునే దిక్కులేదు.

 

 వర్తించని పథకాలు

 ప్రభుత్వం ఏర్పాటు చేసిన గొర్రెలబీమా పథకం వలసవెళ్లిన కాపరులకు వర్తించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. బీమా చేయించిన గొర్రెలను మే త ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లిన సందర్భంలో చనిపోతే పరిహారం ఇవ్వడం లేదు. ఎందుకంటే గొర్రె చనిపోతే స్థానిక పశువైద్యాధికారి పోస్టుమార్టం ఇవ్వాల్సి ఉంటుంది. అలా వలసవెళ్లిన ప్రాంతం లో స్థానిక వైద్యులు రిపోర్టు ఇవ్వడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు మూతి పుండు, నీలినాలుక, గిట్టలపుండ్లు తది తర వ్యాధులతో రెండులక్షల గొర్రెలు మృత్యువాతపడ్డాయి. తమపిల్లలను బడి కి పంపించకపోవడంతో నిరక్షరాస్యులు గా గొర్రెల వెంటే తమ బాల్యం గడుపుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందిం చి జిల్లాలోనే గొర్రెల మేత కోసం ఏర్పాటుచేయాలని కాపరులు కోరుతున్నారు.

 

 కాపరులను ఆదుకోవాలి

 గొర్రెల కాపరులు గొర్రెలమేత కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీఓనెం. 559,1016లను వెంటనే అమలుచేయాలి. అంతేకాకుండా జిల్లా నుంచి వలసలు వెళ్లకుండా అడవుల్లో గొర్రె లు మేసే విధంగా అధికారులు చర్య లు తీసుకోవాలి. గొర్రెలు ఇతర జిల్లా లో చనిపోయిన కూడా బీమా డబ్బులను చెల్లించాలి

 - జి.కార్తీక్ , గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top