ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉన్నా..సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా.. వ్యవసాయానికి మాత్రం ఏడు గంటలపాటు విద్యుత్ అందించడం లేదు. కేవలం ఐదు గంటలు మాత్రమే సరఫరా చేస్తుండడంతో బోరుబావుల కింద వరిసాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉన్నా.. సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా.. వ్యవసాయానికి మాత్రం ఏడు గంటలపాటు విద్యుత్ అందించడం లేదు. కేవలం ఐదు గంటలు మాత్రమే సరఫరా చేస్తుండడంతో బోరుబావుల కింద వరిసాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 4.5 లక్షల ఎకరాలు కాగా ఈ సారి ఖరీఫ్‌లో 5 లక్షల ఎకరాలకు పైగా సాగు చేయడానికి రైతాంగం సిద్ధమైంది. కానీ వరి నార్ల దశలోనే విద్యుత్ 7 గంటల పాటు సరఫరా చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 2.95 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో కేవలం 9 వేల కనెక్షన్లు మాత్రమే పేయింగ్ వినియోగదారుల జాబితాలో ఉండగా మిగతావి ఉచిత విద్యుత్ వినియోగదారుల జాబితాలో
ఉన్నాయి. వ్యవసాయ సాగుకు రోజూ రెండు విడతలుగా 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనున్నట్లు అధికారికంగా షెడ్యూల్ ప్రకటించారు. కానీ 5 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఉదయం నాలుగు గంటలు, రాత్రి మూడు గంటల పాటు ప్రకటించిన షెడ్యూల్ సమయంలో పవర్ కట్ అయితే తిరిగి ఇచ్చేది లేదంటూ అధికారులు పేర్కొంటున్నారు.
సీఎండీ ఆదేశాల మేరకే సరఫరా..
వ్యవసాయానికి 7 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్‌కో సీఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఫీడర్‌లు, సబ్‌స్టేషన్ల వారీగా షెడ్యూల్ ప్రకటించారు. ప్రతి సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం వేళలో నాలుగు గంటలు, రాత్రి వేళలో మూడు గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయనున్నట్టు తెలిపారు. కాగా ఆ సమయంలో పవర్ కట్ అయితే మరో సమయంలో సరఫరా చేయడం లేదు. ఈ విధంగా షెడ్యూల్ ప్రకారం ప్రకటించిన సమయంలో రెండు గంటల మేర కోత పెడుతున్నారు. కేవలం 5 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు.
కొత్తగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో
మిర్యాలగూడ మండలం కొత్తగూడెం సబ్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మిపురం, రుద్రారం గ్రామాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు, రాత్రి ఒంటి గంట నుంచి 4 గంటల వరకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాషెడ్యూల్ ప్రకటించారు. కానీ మధ్యలో రెండు గంటలపాటు పవర్ కట్ అవుతున్నది. దీంతో రెండు విడతలుగా రోజుకు 5 గంటలు మాత్రమే సరఫరా అవుతుంది. ట్రాన్స్‌కో అధికారులను అడిగితే షెడ్యూల్ సమయంలో పవర్ కట్ అయితే తమకు సంబంధం లేదని చెబుతున్నట్టు రైతులు పేర్కొంటున్నారు.