ఇంటర్‌ ఫెయిలా? పర్లేదులే.. ‘బాబ్బాబూ.. అడ్మిషన్‌ తీసుకో’

Degree College`s Fraud In New Admissions Kurnool - Sakshi

డిగ్రీ కళాశాలల్లో చేరితే విద్యార్థికే రూ.5000 చెల్లిస్తున్న యాజమాన్యాలు 

పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.. బస్సు ప్రయాణం ఫ్రీ

 ఐటీఐ చదివినా డిగ్రీలో అడ్మిషన్‌  

 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాజేసే ఎత్తుగడ 

సాక్షి, కర్నూలు :  ‘బాబ్బాబూ.. డిగ్రీ అడ్మిషన్‌ తీసుకో.. కళాశాలకు వచ్చినా రాకున్నా పర్వాలేదు. అంతా మేము చూసుకుంటాం.. ఆరు సెమిస్టర్ల పరీక్షల ఫీజు చెల్లిస్తాం.  బస్సు పాస్‌కు అయ్యే ఖర్చు భరిస్తాం.  ఇదే కాకా అదనంగా రూ.5000 ఇస్తాం. ఐటీఐ చదివినా.. ఇంటర్‌ ఫెయిల్‌ అయినా పర్వాలేదు. రాష్ట్ర  ఉన్నత విద్యా మండలి,  రాయలసీమ విశ్వవిద్యాలయంలో మేనేజ్‌ చేసుకుంటాం’ ఇదీ ప్రస్తుతం జిల్లాలోని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న తంతు.  ఆన్‌లైన్‌  అడ్మిషన్ల ప్రక్రియ..  బయోమెట్రిక్‌ హాజరు సిస్టమ్‌ లేకపోవడంతో  ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నాయి.

ఐటీఐ చదివినా డిగ్రీలో అడ్మిషన్‌  
బనగానపల్లె, కోవెకుంట్ల, పాములపాడు, ఆత్మకూరు ప్రాంతాల్లో ఐటీఐ చదివిన విద్యార్థులకు కూడా అడ్మిషన్లు ఇస్తున్నారు. పత్తికొండలోని ఒక ప్రైవేట్‌ డిగ్రీ కళా«శాలలో ఇంటర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులకు సైతం ఆడ్మిషన్లు ఇచ్చారు. సదరు విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు. రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో ఇలా జరగదు. అక్కడ డిగ్రీ విద్యార్థుల విద్యార్హత ధ్రువ పత్రాలను పక్కాగా పరిశీలిస్తారు.   ఆర్‌యూలో మాత్రం ఇవేమీ చేయరు. దీంతో ఇంటర్‌ ఫెయిల్‌ అయినా, ఐటీఐ చదివినా డిగ్రీలో ప్రవేశాలు పొందుతున్నారు.   

రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 12 ప్రభుత్వ, 7 ఎయిడెడ్, 85 ప్రైవేట్‌ మొత్తం 104 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.  వీటిలో 65వేలకు పైగా మంది విద్యార్థులు  చదువుతున్నారు. జిల్లాలోని చాలా కళాశాలలు ముఖ్యంగా పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో డిగ్రీలో చేరితే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కళాశాలల యాజమాన్యాలే ఒక్కో విద్యార్థికి డిమాండ్, పరిస్థితులను బట్టి రూ.3000 నుంచి  రూ.6000 వరకు చెల్లిస్తున్నాయి. ఆరు సెమిస్టర్‌లకు సంబంధించిన పరీక్ష ఫీజు రూ.3000, బస్‌పాస్‌కు అయ్యే ఖర్చు రూ.5000 ఇలా ఒక విద్యార్థికి సుమారు రూ.14000 వరకు ఖర్చుచేసి సీట్లు భర్తీ చేసుకుంటున్నారు. వీరు కళాశాలకు వచ్చినా రాకున్నా పర్వాలేదు. అంతా యాజమాన్యాలే చూసుకుంటాయి. వీరు ఇలా ఎందుకు చేస్తున్నారేంటే  ఒక్కొక్క విద్యార్థికి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ద్వారా సంవత్సరానికి రూ.18000, మూడేళ్లకు రూ.54000 ప్రభుత్వం నుంచి వస్తుంది. ఒక విద్యార్థిపై తాయిలాల రూపంలో రూ.14000 ఖర్చు చేస్తే తమకు రూ.40,000 వరకు మిగులుతుందని ప్రైవేట్‌ కళాశాలల నిర్వాహకుల ప్లాన్‌. 

ఆన్‌లైన్‌లో లేకపోవడంతో..  
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీలో చేరాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఆధారంగా మార్కులు, మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. ఇది విద్యార్థులకు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ వారి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేట్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ అడ్మిషన్లు లేకపోవడంతో అడ్డూఅదుపు లేకుండా పోయింది.  వర్సిటీ  కేటాయించిన సీట్లకంటే కూడా 20 శాతం అదనంగా చేర్చుకుంటున్నారు. వాటికి సంబంధించి అఫ్లియేషన్‌ ఫీజు సైతం వర్సిటీకి చెల్లించకుండా లాబీయింగ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో వర్సిటీ అధికారులు కూడా కఠినంగా వ్యవహరించక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

అమలు కాని బయోమెట్రిక్‌ హాజరు  
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే ఫీజు రీయింబర్స్‌ మెంట్, స్కాలర్‌ షిప్‌నకు అర్హులు. ప్రైవేట్‌ కళాశాలల్లో ఈ నిబంధనలేవీ  లేకపోవడంతో ప్రవేశాలు భారీగా జరుగుతున్నాయి.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top