28న జల వివాదాలపై చర్చ 

Decision of Telugu States to Debate of Water Disputes on 28th June - Sakshi

తెలుగు రాష్ట్రాల నిర్ణయం

తొలి దశలో రెండు ప్రభుత్వాల సీఎస్‌లు, జలవనరుల శాఖ అధికారుల భేటీ

మలి దఫా సమావేశం కానున్న ఇద్దరు సీఎంలు వైఎస్‌ జగన్, కేసీఆర్‌

తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసుకునే దిశగా చర్యలు  

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదాలను పరిష్కరించుకోవడానికి రెండు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 28న తొలి దశలో రెండు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావులు నిర్ణయం తీసుకుని మరోసారి భేటీ అయ్యి వివాదాలకు తెరదించాలని భావిస్తున్నారు. విశాఖ శ్రీ శారద పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్రకు బాధ్యతల అప్పగింత కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ నెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్‌ విజయవాడకు వచ్చారు. అదే రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు.

గోదావరి జలాల గరిష్ట వినియోగంతోపాటు నదీ జలాల వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసుకునే అంశంపై ఇద్దరు సీఎంలూ చర్చించుకున్నారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భంలోనూ ఇదే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఇద్దరు ముఖ్యమంత్రుల ఆదేశాల మేరకు జల వివాదాలతోపాటు విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూలులోని 142 సంస్థల ఆస్తుల పంపకాలపై సమస్యలను పరిష్కరించుకోవడానికి తొలి దశలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమై చర్చించనున్నారు. 

కృష్ణా నీటి పంపకాలపై చర్చ 
కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించింది. విభజన నేపథ్యంలో ఏపీ 512, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకునేలా కేంద్రం తాత్కాలిక ఏర్పాటు చేసింది. అయితే కృష్ణా నదీ జలాలను నాలుగు నదీ పరీవాహక రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. జలాల పునఃపంపిణీకి నిరాకరించింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను ఆదేశించింది. కానీ ఇప్పటివరకూ విచారణ పూర్తి కాలేదు. ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడం ద్వారా కేసులు ఉపసంహరించుకుని, వివాదాలను పరిష్కరించుకుందామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిపాదిస్తూ వస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగాను కృష్ణా నీటిలో 14 టీఎంసీలు మహారాష్ట్ర, 21 టీఎంసీలు కర్ణాటక, మిగతా 45 టీఎంసీలు నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఏపీ అదనంగా వినియోగించుకోవచ్చునని గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు తరలిస్తుండటం వల్ల.. కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ 2015 నుంచి ప్రతిపాదిస్తోంది. తెలంగాణ రాష్ట్రం 240 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి తరలిస్తోందని.. అందుకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని ఏపీ సర్కార్‌ కోరుతూ వస్తోంది. ఈ వివాదాలన్నిటిపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య 28న చర్చ జరగనుంది.  

శ్రీశైలానికి గోదావరి నీటి తరలింపుపై చర్చలు 
రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా మలి దఫా ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమై చర్చించనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి జలాలను తరలిస్తే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగలతో, ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా సమృద్ధిగా నీళ్లు అందించొచ్చు.  తెలంగాణలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పాత పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకూ గోదావరి నీటిని తరలించొచ్చని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడుతున్నారు. శ్రీశైలాన్ని గోదావరి జలాలతో నింపితే అవసరాన్ని బట్టి నాగార్జునసాగర్‌కు తరలించి.. సాగర్‌ ఆయకట్టునూ కృష్ణా డెల్టానూ సస్యశ్యామలం చేయవచ్చునని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top