చీకటి మిత్రులు!

Dark Friends! - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి.. ఇద్దరూ ఉప్పునిప్పుగా అనంతపురం అభివృద్ధిని ‘రోడ్డు’న పడేశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా వీరిద్దరి మధ్య వైరం తమ పదవీ కాలంలో ఇది చేశామని చెప్పుకునేందుకు వీలు లేకుండాపోయింది. 2014 ఎన్నికల్లో ఇద్దరూ కలిసే పోటీ చేశారు. ఫలితాలు వచ్చాక ఇద్దరి మధ్య తేడా వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ నేత రషీద్‌ అహ్మద్‌ను టీడీపీలో చేర్చుకునేందుకు ప్రభాకర్‌ చౌదరి లలిత కళాపరిషత్‌లో సభ ఏర్పాటు చేశారు. ఈ చేరికను జేసీ వ్యతిరేకించారు. ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య వ్యవహారం చెడింది. ఆ తర్వాత పాతూరులో రోడ్ల విస్తరణ చేయాలని జేసీ పట్టుబట్టారు. అయితే వద్దని చౌదరి తెర వెనుక  ‘రాజకీయం’ చేశారు. కోర్టులో పిటిషన్లు వేయించారు.

విస్తరణ చేయాలా? వద్దా? అనే అంశం పక్కనపెడితే ఈ అంశాన్ని రాజకీయంతా ఇద్దరూ ఎంత వాడాకోవాలో అంత వాడుకున్నారు. అదేవిధంగా రాంనగర్‌ రైల్వే వంతెనకు సంబంధించి కార్పొరేషన్‌ కౌన్సిల్‌సమావేశంలో ఇద్దరూ పరస్పరం తీవ్ర స్థాయిలో దూషించుకున్నారు. అనంతరం కూడా పలు సందర్భాల్లో చౌదరిని వాడూ.. వీడూ.. వాడెంత.. అని జేసీ దుర్భాషలాడారు. ఎమ్మెల్యే నేను కూడా మాట్లాడగలను.. బెదిరింపులకు తలొగ్గేది లేదని దీటుగా సమాధానమిచ్చారు. వీరిద్దరి విభేదాలతో టీడీపీ కేడర్‌ కూడా రెండుగా చీలిపోయింది.

ప్రజల కోసం, నగరాభివృద్ధి  కోసం కలవని వైనం
ఈ ఐదేళ్లలో అనంతపురం సిటీలో ఎలాంటి అభివృద్ధి జరిగిందని ఒక్కసారి ఆలోచిస్తే గత ప్రభుత్వంలోని పనులు మినహా చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవు. రాంనగర్‌ వంతనెకు అప్పటి ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి 2013లోనే నిధులు మంజూరు చేయించి అనుమతులు తీసుకొచ్చారు. నిర్మాణంలో ఉన్న మంచినీటి పైపులైన్‌ పనులను కూడా అనంత వెంకట్రామిరెడ్డి తీసుకొచ్చి ఆయన హయాంలోనే టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత టెండర్‌ రద్దు చేసి, అధిక ధరలకు మరో టెండర్‌ వేశారు. నిర్మాణంలో ఉన్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి కూడా గత ప్రభుత్వంలోనే మంజూరైంది. శిల్పారామానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నిధులు మంజూరు చేస్తే.. వద్దని ప్రభాకర్‌ చౌదరి అడ్డుపడ్డారు. కోర్టును ఆశ్రయించారు. ఇవి కాకుండా మనకు కన్పించేవి డివైడర్లు. అక్కడక్కడా కన్పించే సిమెంట్‌రోడ్లు. వీటిని వినహాయిస్తే ఒక్క పనిచేయలేదు. ఇద్దరి పంతంలో నగరానికి తీరని అన్యాయం జరిగింది.

ఓటమి అంచున కలిసిన చేతులు
ప్రభాకర్‌చౌదరికి టిక్కెట్‌ రాకుండా జేసీ విఫలయత్నం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా చౌదరి, ఎంపీ అభ్యర్థిగా జేసీ తనయుడు పవన్‌ బరిలో ఉన్నారు. మొన్నటి వరకు ఇద్దరూ వేర్వేరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో మినహా ఎక్కడా కలిసి వేదిక పంచుకోలేదు. ఎంపీగా పవన్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని చౌదరి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చేయాలని జేసీ నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరూ ఓడిపోతున్నారని వారి సర్వేల్లోనే తేలింది. దీంతో ఆత్మరక్షణలో పడ్డారు. గతం మరిచి చేతులు కలిపారు. ఇద్దరూ కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు గురించి కూడా ఇద్దరూ మాట్లాడుకున్నారు. నగరంలోని 25వార్డులకు ఎంపీ, 25వార్డులకు ఎమ్మెల్యే, నాలుగు పంచాయతీల్లో రెండు పంచాయతీల చొప్పున విభజించుకుని ఎవరి పరిధిలో వారు డబ్బులు పంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ పరిణామాలు ముందే గ్రహించిన పలువురు కార్పొరేటర్లు, ముఖ్యనేతలు ఇద్దరినీ ఛీకొట్టి ‘సైకిల్‌’ దిగేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ పరిణామాలను నగర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నగరంలో ఉద్యోగులు 32వేల కుటుంబాలు కాగా.. తక్కిన వారిలోనూ అధికశాతం విద్యావంతులే. చౌదరి, జేసీ వారి స్వార్థరాజకీయాల కోసం అవసరం ఉన్నప్పుడు కలిసి, అవసరం తీరాక సొంత రాజకీయ ప్రయోజనాల కోసం విభేదిస్తూ నగరాభివృద్ధిని విస్మరించార. ఈ నేపథ్యంలో వారికి మనం అండగా నిలవాలా? అనే చర్చ సర్వత్రా మొదలైంది. స్వార్థరాజకీయాల కోసం కలిసిన ఇద్దరికీ ఎన్నికల్లో సరైన తీర్పు ఇస్తామనే చర్చ జరుగుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top