ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలో రోజురోజుకూ పైశాచికత్వం పెరిగిపోతోందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు.
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలో రోజురోజుకూ పైశాచికత్వం పెరిగిపోతోందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. విభజన విషయంలో ఆయన ఒక అవగాహన, శాస్త్రీయత లేకుండా మాట్లాడుతూ.. ఎదుటివారిని అసహనానికి గురిచేస్తున్నారని విమర్శించారు.
మంగళవారం అసెంబ్లీలాబీలోని తన చాంబర్లో రాజనర్సింహ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా సీఎం మాట్లాడితే అందుకు దీటైన సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేసి విభజనపై చర్చను కొనసాగిస్తే సభలో చర్చకు ఆస్కారమే లేకుండా చేస్తే మాత్రం సీఎం సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరికీ నష్టమన్నారు. పరిస్థితి చూస్తుంటే సభలో చర్చ జరిగే అవకాశమే కన్పించడం లేదన్నారు. శాసనసభను రద్దు చేస్తే తమకు వచ్చిన నష్టమేమి లేదని, ఎవరేం చేసినా విభజన మాత్రం ఆగదని దామోదర చెప్పారు.