తరుముకొస్తున్న హుదూద్ | Cyclone Hudhud heads to Andhra Pradesh, Odisha coast | Sakshi
Sakshi News home page

తరుముకొస్తున్న హుదూద్

Oct 10 2014 1:41 AM | Updated on Sep 2 2017 2:35 PM

తరుముకొస్తున్న హుదూద్

తరుముకొస్తున్న హుదూద్

ఈ ఏడాదిలో అతి పెద్దదిగా భావిస్తున్న హుదూద్ తుఫాన్ తరుముకొస్తోంది. పెనుతుఫాన్‌గా బీభత్సం సృష్టించే అవకాశం ఉండడంతో అందరిలో భయాందోళన మొదలైంది. పై-లీన్, లెహెర్ తరహాలో

 సాక్షి ప్రతినిధి, విజయనగరం :  ఈ ఏడాదిలో అతి పెద్దదిగా భావిస్తున్న హుదూద్ తుఫాన్ తరుముకొస్తోంది.  పెనుతుఫాన్‌గా బీభత్సం సృష్టించే అవకాశం ఉండడంతో అందరిలో భయాందోళన మొదలైంది. పై-లీన్, లెహెర్ తరహాలో బీభత్సం సృష్టించొచ్చని భావిస్తున్న అధికార యంత్రాంగం  అప్రమత్తమయ్యింది. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేలా  సన్నద్ధమయింది. పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు వివిధ శాఖలు సమన్వయమవుతున్నాయి. ఈమేరకు కలెక్టర్  ప్రత్యేకాధికారులను  నియమించారు. రెవెన్యూ గ్రామానికొకరు చొప్పున బాధ్యతలు చేపట్టనున్నారు. మత్స్యకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.  పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా కలెక్టర్ దృష్టికి తీసుకురానున్నారు.
 
 అవసరమైతే పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించనున్నారు. వారికి అవసరమైన అన్నీ వసతులు సమకూర్చనున్నారు.  హుదూద్ తుఫాన్ ప్రభావం జిల్లాలోని ఏడు  మండలాలపై   ఉండొచ్చని భావిస్తున్నారు. తీవ్ర ప్రభావం పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు ఉండగా, నాగావళి నదికి వరద నీరు పోటెత్తడం ద్వారా కొమరాడ, పార్వతీపురం మండలాలకు, భారీ వర్షాల ద్వారా గుర్ల, విజయనగరం, ఎస్‌కోట మండలాల్లో ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు.   ముఖ్యంగా పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని ఆరు రెవెన్యూ గ్రామాల పరిధిలో గల 20 గ్రామాలపై పెనుగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కొక్క రెవెన్యూ గ్రామానికి ఒక్కొక్క  జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించారు. చేపల కంచేరు రెవెన్యూ పంచాయతీకి  జిల్లా పరిషత్ సీఈఓ మోహనరావు, కొంగవానిపాలెంనకు డ్వామా పీడీ గోవిందరాజులుు, కోనాడకు డీఆర్‌డీఏ పీడీ పెద్దిరాజు, చింతపల్లికి సెట్విజ్
 
 సీఈఓ దుర్గారావు, కొల్లాయవలసకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హెచ్.వి.ప్రసాదరావు, పతివాడకు హౌసింగ్ పీడీ డి.కుమార్ ప్రత్యేక అధికారులగా వ్యవహరించనున్నారు. వీరంతా అక్కడే ఉండి పర్యవేక్షించనున్నారు. వాతావరణ ఇబ్బందులను అధిగమించి, జిల్లా యంత్రాంగానికి సమాచారమిచ్చేందుకు దోహదపడే విధంగా ఆయా గ్రామాల్లో ‘వెరీ హై ప్రీక్వెన్సీ వైర్‌లై స్’  సెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. రెవెన్యూ యంత్రాంగం వద్ద ఆ స్థాయి వైర్‌లెస్ సెట్లు లేకపోయినప్పటికీ   జిల్లా పోలీసు యంత్రాంగం నుంచి తీసుకుని గ్రామాలకు చేరవేస్తున్నారు. అలాగే, భారీ వర్షాలకు రోడ్లు శిథిలమై రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందనే దృష్టితో రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో అధికారులను అందుబాటులో ఉంచుతున్నారు.  
 
 అవసరమైతే విశాఖ నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను తీసుకురానున్నారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో  అపాయకర పరిస్థితులు తలెత్తితే యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగేలా బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. వరద  ఉద్ధృతి ,పెనుగాలులకు  నివాస ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉంటే వారికోసం సురక్షిత ప్రాంతాల్లో 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 15,670మందికి సరిపడా ఆహార, వసతులను కల్పించనున్నారు.   విపత్తు నిర్వహణ ఓఎస్‌డీగా శోభజిల్లా విపత్తు నిర్వహణ ఓఎస్‌డీగా పీఏ శోభను ప్రభుత్వ నియమించింది. ఈమె గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement