విషాదపట్నం


* ఉత్తరాంధ్రను కాటేసిన హుదూద్.. విలవిలలాడిన విశాఖ

* విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ భారీ నష్టం

* మృతుల సంఖ్యపై రాని స్పష్టత... 21 మంది మరణించారని అధికారిక ప్రకటన

* అంచనాలకు అందని ఆస్తి, పంట నష్టం

* నాలుగు జిల్లాల్లో 6,695 ఇళ్లు నేలమట్టం

* రోడ్డు, రైలు మార్గాలు ఛిన్నాభిన్నం

* కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ.. హార్బర్‌లో మునిగిపోయిన 5 వేల టన్నుల యూరియా

 * రూ. 2 వేల కోట్ల తక్షణ సాయం కోరిన ఏపీ.. అంతకు పదుల రెట్లలో వాస్తవ నష్టం

* వాయుగుండంగా మారి ఛత్తీస్‌గఢ్‌కు చేరిన హుదూద్.. అప్రమత్తంగా ఉండాలని ఆరు రాష్ట్రాల సీఎంలను కోరిన రాజ్‌నాథ్

 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హుదూద్ తుపాను రూపంలో జలరక్కసి ఉత్తరాంధ్రను కాటేసింది. ప్రచండ వేగంతో తాకిన తుపాను ధాటికి విశాఖ నగరం విలవిలలాడింది. ఉక్కునగరం మూగబోయింది. అందాల సాగరతీరం తుడుచుకుపోయింది. తెగిన రోడ్లు, తెగిపడిన విద్యుత్‌స్థంభాలు, కూలిపోయిన మహావృక్షాలు, లేచిపోయిన ఇంటికప్పులు... నగరంలో ఎటుచూసిన విషాదస్వరాలే. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. పంటలు నీటమునిగి, అపార ఆస్తినష్టంతో రైతులు భోరును విలపిస్తున్నారు.పొరుగురాష్ట్రం ఒడిశాలోనూ హుదూద్ తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఒడిశాలో సుమారు 50 వేల గృహాలు ధ్వంసమయ్యాయి. గజపతి, కోరాపుట్, మల్కాన్‌గిరి, రాయగఢతోసహా 8 జిల్లాలు తుపాను తాకిడికి తీవ్రంగా నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలను వణికించిన తుపాను చత్తీస్‌గఢ్ దిశగా ప్రయాణించి కాస్తంత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. రాయపూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం వల్ల రానున్న 12 గంటల్లో 40-50 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయవచ్చని భారత వాతావరణశాఖ హెచ్చరించింది.వాయుగుండం కేంద్రానికి 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక మోస్తరునుంచి భారీ వర్షాలు కురియవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రం హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ సీఎంలతో ఫోన్‌లో మాట్లాడారు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు హుదూద్ విధ్వంసకాండను సందర్శించేందుకు ప్రధాని మోదీ నేడు విశాఖపట్నం రానున్నారు. తాను విశాఖ వెళ్లి పరిస్థితులను సమీక్షిస్తానని ఆయన ట్విటర్‌లో ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు. మరోవైపు సోమవారం ఉదయానికే నగరానికి చేరుకున్న సీఎం సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.మృతులపై రాని స్పష్టత

హుదూద్ పెను ఉప్పెన వల్ల ఎంతమంది మృత్యువాత పడ్డారన్న దానిపై 24 గంటల తర్వాత కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటివరకు విశాఖపట్నం జిల్లాలో ఏడుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మరణించారని వెల్లడించారు. సోమవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మొత్తం 21 మంది చనిపోయినట్లు తెలిపారు. విశాఖ జిల్లాలోనే 15 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఐదుగురు చనిపోయినట్లు పేర్కొన్నారు.అంచనాలకు అందని నష్టం

హుదూద్ పెను ప్రళయం మిగిల్చిన అపార నష్టం అంచనాలకు అంతుచిక్కడం లేదు. ప్రచండ గాలులతో విరుచుకుపడిన తుపాను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పెను విధ్వంసం సృష్టించింది. అధికారిక అంచనాల ప్రకారం  ఈ 4 జిల్లాల్లో మొత్తం 6,695 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వాటిలో విశాఖపట్నంలో 2,402, శ్రీకాకుళంలో 1,756, విజయనగరంలో 1,397, తూర్పుగోదావరిలో 1,140 ఇళ్లు ఉన్నాయి. ఇక రైలు, రోడ్డు రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది.4 జిల్లాల్లో కలిపి మొత్తం 109 రైలు, రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. విద్యుత్తు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో మొత్తం 5,727 విద్యుత్తు లైన్లు, స్తంభాలు నేలకూలాయి. వాటిలో విశాఖపట్నంలోనే 3,291, శ్రీకాకుళంలో 917, విజయనగరంలో 844, తూర్పుగోదావరిలో 675 ఉన్నా యి. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో మొత్తం 181 మత్స్యకార బోట్లు దెబ్బతిన్నాయి. మొత్తం 1,798 పశువులు మృత్యువాత పడ్డాయి. ఇక ప్రైవేటు ఆస్తులకు అపారంగా నష్టం వాటిల్లింది.ఇన్ని వేలకోట్లు అని ప్రాథమికంగా కూడా అంచనా వేయలేని దుస్థితిలో ప్రభుత్వం పడిపోయింది. అందుకే నష్టం అంచనాలు తరువాత చూసుకుందామని ప్రభుత్వం ప్రస్తుతం సహా య, పునరావాస చర్యలపై దృష్టిసారించింది. మొత్తం 5 లక్షల మందికి పునరావాసం కల్పిం చినట్లు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించేం దుకు, కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించేం దుకు సీనియర్ ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో 5 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తుపాను బాధితులకు అందించేందుకు 5 లక్షల ఆహారపొట్లాలను సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.తక్షణ సహాయంగా రూ.2వేల కోట్లకు ప్రతిపాదన

హుదూద్ నష్టం అంచనాలు అంతుచిక్కపోవడంతో ప్రభుత్వం కేంద్రం నుంచి తక్షణ సహాయం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తక్షణ సహాయంగా రూ.2వేల కోట్లు కోరుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ లెక్కన అధికారికంగా వెల్లడించక పోయినప్పటికీ నష్టంపై ప్రభుత్వ అంచనాయే రూ.10వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే హుదూద్ నష్టం అధికారిక అంచనాలకు మించి ఉంటుందన్నది స్పష్టంగా తెలుస్తోంది.ఉదాహరణకు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లోనే 58 బోట్లు పూర్తిగా, 100 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కానీ ప్రభుత్వ లెక్కల్లో మాత్రం విశాఖపట్నంలో 14 బోట్లకు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. బోట్లు దెబ్బతినడంవల్ల తమకు రూ.150 కోట్ల నష్టం వాటిల్లిందని విశాఖ మత్స్యకారులు చెబుతున్నారు. తుపాను వల్ల మొత్తం 6,695 ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ విశాఖలోనే వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. శివారులోని కొండలపై ఉన్న ఇళ్లను అధికారులు ఇంతవరకు పరిశీలించనేలేదు.కొండలపై ఉన్న ఇళ్లల్లో 90శాతం నేలకూలాయి. అవే దాదాపు 5వేల వరకు ఉంటాయని అంచనా. ఇక 4 జిల్లాల్లో తీరప్రాంతాల్లోని ఇళ్లు లెక్కకు అందని స్థాయిలో దెబ్బతిన్నాయి. అధికారులు అసలు క్షేత్రస్థాయిలో పర్యటించనే లేదు. కేవలం గుడ్డి అంచనాలతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. విద్యుత్తు, రవాణా, సమాచార వ్యవస్థలకు అంతులేని నష్టం వాటిల్లింది. ఈపీడీసీఎల్‌కే రూ.700కోట్ల భారీ నష్టం వాటిల్లింది. అందులో విశాఖ నగరంలోనే రూ.500కోట్ల నష్టం కలగడం గమనార్హం. ఈపీడీసీఎల్ టవర్లు 12 కూలిపోయాయి. 7వేల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. ఇక విద్యుత్తు స్తంభాలకు వాటిల్లిన నష్టానికి అంతే లేదు. రైల్వేకు దాదాపు రూ.200కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. స్టీల్‌ప్లాంట్‌కూ తీవ్ర నష్టం వాటిల్లింది. స్టీల్‌ప్లాంట్‌లోని 236 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్తు ప్లాంట్‌ను మూసివేయాల్సి వచ్చింది. దాంతో 12 విభాగాలు దెబ్బతిన్నాయి.ఏడెనిమిది దేశాలకు ఎగుమతులకు విఘాతం కలిగింది. 2వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎన్డీపీసీకి వాటిల్లిన నష్టమైతే అంతుచిక్కడం లేదు. 4 యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖపట్నంలో నిల్వ ఉన్న 5వేల మెట్రిక్ టన్నుల యూరియా పూర్తిగా నీట మునిగింది. తుపాను వల్ల పంటలకు ఏర్పడిన నష్టం అంతుచిక్కడం లేదు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో మొత్తం 44 మండలాల్లో లక్షలాది ఎకరాల పంట పూర్తిగా దెబ్బతింది. ఈ నష్టం అంచనాలకు అందడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు రూపొందిస్తేగానీ నష్టంపై  అంచనాకు రాలేని పరిస్థితి ఉంది.  ఇక ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టం అంతులేని విధంగా ఉంది. విశాఖపట్నంలో ప్రైవేటు వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థలు, చిన్న-మధ్యతరహా వ్యాపారాలు, పరిశ్రమలు పూర్తిగా స్తంభించిపోయాయి. వాటి భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు తీవ్ర విఘాతం కలిగింది.ఒక్క ఆంధ్రా యూనివర్సిటీకే రూ.100 కోట్లు అవసరమవుతాయని అంచనా. విశాఖలో పర్యాటక విభాగం కుప్పకూలిపోయింది. హోటళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 20ఏళ్లుగా వందల కోట్లతో తీర్చిదిద్దిన పార్కులు, పర్యాటక ప్రాంతాలు రూపురేఖలు లేకుండాపోయాయి.  బీచ్‌రోడ్డు, వుడా పార్కు, లుంబినీ పార్కు, కైలాసగిరి, జూపార్కు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటికి వాటిల్లిన నష్టం అంచనాలకు అందనిదిగా ఉంది. అది ఎన్ని వేల కోట్లు ఉంటుందన్నది ప్రస్తుతం ఊహలకే పరిమితమైంది. పూర్తిస్థాయి నివేదికలువస్తేగానీ వాస్తవ గణాంకాలు వెల్లడికావు.

 

ఎన్‌సీఎంసీ సమీక్ష

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో హుదూద్ తుపాను సహాయక చర్యలతో పాటు తాజా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్‌సేథ్ అధ్యక్షతన ఢిల్లీలో సోమవారం జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ(ది నేషనల్ క్రైసెస్ మేనేజ్‌మెంట్ కమిటీ-ఎన్‌సీఎంసీ) సమావేశం జరిగింది. తుపాను సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు కేంద్ర బృందాలను సైతం రంగంలోకి దింపినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్)కి చెందిన 42 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వీరంతా రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించడం, రోడ్లను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top