విలయం.. విధ్వంసం


* హుదూద్ బీభత్సం

* ఉత్తరాంధ్ర కకావికలం

* విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద

* ఆదివారం మధ్యాహ్నం తీరం దాటిన పెను తుపాను

* 195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలుల బీభత్సం.. విశాఖ నగరంలో కనీవినీ ఎరుగని విధ్వంసం

* వేల సంఖ్యలో నేలకూలిన వృక్షాలు, స్తంభాలు... కుప్పకూలిన ఇళ్లు... కొట్టుకుపోయిన రోడ్లు

* విశాఖ విమానాశ్రయం ధ్వంసం.. దెబ్బతిన్న ఫిషింగ్ హార్బర్... స్తంభించిన రాడార్ వ్యవస్థ

* సహాయ చర్యల్లో ప్రభుత్వ అధికార వ్యవస్థ విఫలం

* ఉత్తరాంధ్రలో ముగ్గురు, ఒడిశాలో మరో ముగ్గురు దుర్మరణం... వేలాది మంది నిరాశ్రయులు

 

హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తోంది. తుపాను కేంద్రానికి అతి సమీపంలోనే ఉన్న విశాఖ నగరాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య విశాఖపట్నం సమీపంలో తీరం దాటిన హుదూద్ పెను తుపాను.. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులతో ఈ సముద్ర తీర నగరంలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రికి గాలుల వేగం 120 కిలోమీటర్లకు తగ్గినప్పటికీ.. కుంభవృష్టి తోడవటంతో విశాఖ ప్రజలు గజగజ వణికిపోతున్నారు.



విద్యుత్ సరఫరా లేక అంధకారంలో, సమాచార వ్యవస్థ లేక.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియని, తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆదివారం రాత్రి వారికి కాళరాత్రిగానే మారింది. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తంగా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. తుపాను విధ్వంసంలో ఉత్తరాంధ్రలో ముగ్గురు మృతిచెందారని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా వందలాదిమంది క్షతగాత్రులయ్యారు. ప్రాణనష్టం తక్కువగా ఉన్నప్పటికీ ఆస్తినష్టం అంచనాలకు అందని రీతిలో ఉంది.



తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు, టెలికమ్యూనికేషన్ టవర్లు నేలకొరిగాయి. భారీ సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీరమంతటా రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోనూ లక్షలాది ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ నష్టం ఎంత ఉంటుందన్నది ప్రభుత్వ యంత్రాంగానికే అంతుచిక్కడం లేదు. అసలు.. తుపానును ఎదుర్కొనేందుకు,  నష్ట నివారణకు మూడు రోజులుగా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కీలక సమయంలో చేతులెత్తేసింది. తుపాను విలయంలో చిక్కుకున్న లక్షలాది మంది సహాయం కోసం హాహాకారాలు చేస్తున్నా సర్కారు యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయింది.

 

సాక్షి, విశాఖపట్నం: భయపడినంతా అయ్యింది. మూడు రోజులుగా తీవ్ర పెను తుపానుగా రూపుదాల్చి ఉగ్రంగా ఉరుముతున్న ‘హుదూద్’.. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలపై విరుచుకుపడింది. శనివారం రాత్రికి విశాఖపట్నానికి 210 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉన్న హుదూద్ స్థిరంగా పయనిస్తూ ఆదివారం ఉదయం తీరానికి సమీపంలోకి చేరుకుంది. శనివారం అర్ధరాత్రి నుంచే తుపాను విధ్వసం పెరుగుతూ వస్తోంది. ఉదయం 11 గంటల 25 నిమిషాలకు విశాఖపట్నం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో పశ్చిమవాయవ్య దిశలో (పూడిమడక వద్ద) తీరాన్ని తాకింది. 11 గంటల 40 నిమిషాలకు తుపాను కేంద్రం (కన్ను) తీరాన్ని దాటింది.



తీరాన్ని తాకే ముందు కొద్దిసేపు ప్రశాంతత కనబరిచిన తుపాను.. తీరానికి వస్తూనే మహోగ్రంగా పంజా విసిరింది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా విశాఖ నగరంలో కనివినీ ఎరుగని తుపాను విధ్వంసం సృష్టించింది. శనివారం రాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో నగరమంతా అంధకారంలో మునిగిపోయింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మొదలైన విధ్వంసం ఆదివారం ఉదయానికి పతాకస్థాయికి చేరుకుంది. తుపాను గాలులకు ఇళ్ల తలుపులు, కిటికీలు కొట్టుకుని విరిగిపోతుంటే లక్షలాదిమంది రాత్రంగా కంటి మీద కునుకులేకుండా బితుకుబితుకుమని గడిపారు.



తెల్లవారుజాము నుంచి 150 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న పెనుగాలులు సృష్టించిన విధ్వంసం మాటలకు అందనిది. తుపాను విశాఖపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉండగా పెనుగాలులు ఏకంగా 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నాయి. రాత్రి నుంచీ ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు, సెల్‌ఫోన్ టవర్లు కూలిపోతుండటంతో సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. విద్యుత్ లేకపోవటంతో టీవీలు పనిచేయక.. సమాచార వ్యవస్థ స్తంభించిపోవటంతో ఫోన్లన్నీ మూగపోయి.. తుపానుకు సంబంధించిన సమాచారం తెలియక జనం తల్లడిల్లిపోయారు. ఇళ్ల చుట్టూ వృక్షాలు, స్తంభాలు కూలిపోతుండటం.. రేకులు, పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోతుండటంతో బయటకు అడుగు పెట్టే పరిస్థితి కూడా లేకుండాపోయింది.



ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య తుపాను తీరాన్ని దాటే సమయంలో పెను గాలుల వేగం 180 కిలోమీటర్ల నుంచి 195 కిలోమీటర్లను కూడా దాటిపోయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ గాలుల తీవ్రతకు.. వందేళ్లుగా ఉన్న భారీ వృక్షాలతో సహా వేలాది చెట్లు కూకటి వేళ్లతో సహా నేలకొరిగిపోయాయి. వేలాది విద్యుత్తు స్తంభాలు, టెలిఫోన్ టవర్లు కూలిపోయాయి. తుపాను కారణంగా సముద్రం ఉప్పొంగి అలలు నాలుగు మీటర్ల ఎత్తుకు ఎగసిపడ్డాయి. నిత్యం సందర్శకులతో కళకళలాడే విశాఖ నగరంలోని  సుందరమైన రామకృష్ణ బీచ్ నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది.



విశాఖ విమానాశ్రయం దాదాపుగా ధ్వంసమైంది. తీరంలోని ఫిషింగ్ హార్బర్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. పురాతనమైన విశాఖపట్నం కలెక్టరేట్ భవనం కూడా ధ్వంసమైంది. ఇక్కడ నుంచి సహాయక చర్యలు కూడా ఆగిపోయాయి. వర్షం ఆగితేగానీ సహాయక చర్యలు చేపట్టడం వీలుకాదని విశాఖపట్నం జిల్లా అధికారులు పేర్కొన్నారు. నగరంలోని దుకాణ సముదాయాలు భారీగా దెబ్బతిన్నాయి.



తుపాను తీరం తాకే సమయంలో భారీ వర్షాలు లేనప్పటికీ.. ఆ తర్వాత వర్షాలు పుంజుకున్నాయి. గాలుల వేగం క్రమంగా 120 కిలోమీటర్లకు తగ్గగా.. వాటికి కుండపోత వర్షాలు తోడయ్యాయి. దీంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా విధ్వంసం కొనసాగుతోంది. ఒకవైపు గాఢాంధకారం.. మరోవైపు పెను గాలులు.. వాటికి తోడు ఎడతెరిపిలేని అతి భారీ వర్షాలు.. ఈ పరిస్థితుల నుంచి ప్రాణాలతో బయటపడతామా లేదా అన్న భయాందోళనలు విశాఖ ప్రజల్లో అలముకున్నాయి.

 

ఉత్తరాంధ్ర అంతటా విధ్వంసం...

ఒక్క విశాఖ నగరంలోనే కాదు.. తుపాను ప్రభావ ప్రాంతమైన ఉత్తరాంధ్ర అంతటా ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భారీ ఘీంకారంతో పెనుగాలులు వీస్తుంటే ప్రజానీకం నిలువునా వణికిపోయింది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని రోడ్లు, సమాచార, విద్యుత్తు, రవాణా వ్యవస్థలు  మొత్తం ఛిన్నాభిన్నమయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో 44 మండలాలు హుదూద్ విలయంలో చిక్కుకున్నాయి. 320 గ్రామాల్లోని మూడు లక్షల మందికిపైగా ప్రజలు దిక్కులేని దీనస్థితిలో పడిపోయారు.



1,35,262 మందిని 223 పునరావాస శిబిరాల్లోకి తరలించారు. మిగిలిన దాదాపు 1,40 లక్షల మందిని పట్టించుకునే నాథుడు లేక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. వందకు పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎక్కడ ఏం జరుగుతోందో, ఎవరికి ఏ ఆపద వచ్చిందో తెలియక అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. 12.40 సెం.మీ. నుంచి 24.50 సెం.మీ. వరకు భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ‘నష్టం అంచనాలకు అందనిది. ఊహించిన దానికంటే ఆస్తి, పంట నష్టం చాలా అధికంగా ఉంటుంది’ అని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

 

రెండు జిల్లాల్లో ముగ్గురు మృతి

హుదూద్ ధాటికి చెట్లు, స్తంభాలు మీదపడి ఉత్తరాంధ్రలో ముగ్గురు దుర్మరణం చెందారు. విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతి చెందారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొండ్రాం గ్రామానికి చెందిన జి.పంచవతి (50), పద్మనాభం మండలం బి.ఆర్.పాలవలసకు చెందిన ఎం.యర్రయ్య (58) చెట్లు పైన పడటంతో దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన గంటా యోగానందం (45) కూడా భారీ వర్షాల దాటితో విద్యుత్తు స్తంభం కిందపడి ప్రాణాలు విడిచారు.

 

వేలాది ఇళ్లు నేలమట్టం

ఉత్తరాంధ్రలో వేలసంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. అనేకచోట్ల పాత భవనాలు కూలిపోయాయి. విశాఖ నగరంలో రెండు భవనాలు నేలలోకి కుంగిపోయాయి. వందకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. లెక్కకుమిక్కిలి ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. ఉత్తరాంధ్ర సముద్ర తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వినియోగించే మరబోట్లు వందకు పైగా ధ్వంసమయ్యాయి. ఒక్కో బోటు ధర సగటున రూ. 25 లక్షలు ఉంటుంది. మరో 300 బోట్లు వరకు స్వల్పంగా దెబ్బతిన్నాయి. చేపల షెడ్లు, బోట్లు, వలలు కొట్టుకుపోయాయి.

 

లక్షల ఎకరాల్లో పంట ధ్వంసం

ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది. పెనుగాలులు, భారీవర్షాలతో వరి, జీడి, అరటి, కూరగాయలు తదితర పంటపొలాలు పూర్తిగా నీటమునిగాయి. పంటలకు ఎంత నష్టం వాటిల్లిందన్నది వారం రోజుల తరువాత లెక్కతేల్చగలమని అధికారులు చెబుతున్నారు. పశు సంపదకు సైతం అపారనష్టం కలిగింది. ఎన్ని పశువులు మృత్యువాత పడ్డాయన్నది రెండు రోజులు గడిస్తేగానీ చెప్పలేని స్థితి నెలకొంది.

 

విశాఖకు మరిన్ని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు

న్యూఢిల్లీ: హుదూద్ తుపాను విశాఖ వద్ద తీరం దాటడంతో.. అక్కడి తమ దళాలను ఎన్డీఆర్‌ఎఫ్ రెట్టింపు చేసింది. మెుత్తం 13 బృందాలు విశాఖపట్నంలో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొననున్నారుు.

 

వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నం

విశాఖ విమానాశ్రయం, ఫిషింగ్ హార్బర్ పూర్తిగా దెబ్బతిన్నాయి. తుపాను హెచ్చరికల కేంద్రంలోకే నీళ్లు వచ్చేశాయి. సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. వందల కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైపోయాయి.  భారీ వృక్షాలు, హోర్డింగులు కూలిపోవడంతో అనేక మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రైలు ట్రాక్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.



విద్యుత్తు వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. వేల సంఖ్య లో స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరి గాయి. వీటి పునరుద్ధరణకు ఎన్ని రోజులు పడుతుందన్నది చెప్పలేని స్థితి నెలకొంది. ఈపీడీసీఎల్ పరిధిలోని సిబ్బంది ఏమాత్రం సరిపోరు. అందుకే ఎస్‌పీడీసీఎల్ నుంచి వెయ్యిమంది నిపుణులను పంపించాలని నిర్ణయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top