
ఓ రేంజ్‌లో అవినీతి!
అటవీశాఖలో అవినీతి రాజ్యమేలుతోంది...
రెవెన్యూ, పోలీస్ శాఖల్లోనే కాదు అటవీశాఖలో కూడా అవినీతికి అంతుండడం లేదు. జిల్లాలో ఉన్న విజయనగరం, కురుపాం, పార్వతీపురం, సాలూరు రేంజ్‌ల్లో కొంతమంది అధికారులు చేతివాటానికి అలవాటుపడ్డారు. నెలకు రూ.వేలల్లో అక్రమార్జనే లక్ష్యంగా పెట్టుకుని అటవీ సంపదను ధారాదత్తం చేస్తున్నారు. అంతా సక్రమంగా ఉన్నా కలప రవాణా పర్మిట్‌కు లంచం గుంజుతున్నారు. సాలూరు అటవీ రేంజ్ అధికారి....ఏసీబీ అధికారులకు గురువారం దొరికిపోయారు. పదేళ్ల క్రితం ఇదే రేంజ్ పరిధిలో తోణాం ఫారెస్ట్ గార్డు రామనాథం రూ.రెండు వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కోర్టు ఆదేశం మేరకు ఆయనను రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే దొరకనివారెందరో ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- చేయి తడిపితేనే పర్మిట్లు మంజూరు
- కలప లారీకి రూ.5 వేలు లంచం సాధారణమన్న వాదనలు
- మూలబొడ్డవర చెక్‌పోస్టుపై లెక్కకు మించి ఆరోపణలు
- కర్రల మిల్లుల యజమానులతో లోపాయికారీ ఒప్పందాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అటవీశాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. దొరికితే... లేదంటే దొరగా కొనసాగిపోతున్నారు. చాలా మంది అధికారులు ముడుపులు తీసుకున్నాకే పనులు పూర్తి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమార్జన కోసం కర్రల మిల్లుల యజమానులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని తెలిసింది. చెక్‌పోస్టులు చేతివాటానికి చిరునామాగా మారిపోయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
- ఇటీవల గోదావరి జిల్లాలకు చెందిన ఓ వ్యక్తి ఒడిశాలో కొనుగోలు చేసిన గుగ్గిలం విత్తనాన్ని పర్మిట్ తీసుకోకుండా రవాణా చేస్తూ పి.కోనవలస చెక్ పోస్టు వద్ద పట్టుబడ్డారని, ఆ సరుకును సీజ్ చేయకుండా ముడుపులు తీసుకుని, ఆ తర్వాత హుటాహుటిన పర్మిట్ కోసం దరఖాస్తు చేయించారన్న ఆరోపణలు అటవీ శాఖాధికారులపై వచ్చాయి.
- హుద్‌హుద్ తుపాను ధాటికి రిజర్వుడు ఫారెస్టులో చాలా చెట్లు కూలిపోయాయి. అయితే కొందరు అటవీశాఖ అధికారులు కూలిపోని చెట్లను కూడా నరికించి, వాటిని కూడా హుద్‌హుద్ ధాటికి కూలిన చెట్ల లెక్కలో కలిపేశారన్న ఆరోపణలొచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఈ తరహా అక్రమాలు జరిగినట్టు బాహాటంగా విమర్శలొచ్చాయి.
- నీరు- చెట్టు కింద రిజర్వుడు ఫారెస్టుల్లోని చెరువుల్లో తీసిన పూడికలు, మొక్కలు నాటేందుకు తీసిన గుంతల్లో కూడా అవినీతి జరిగిందన్న వాదనలు ఉన్నాయి. చేపట్టిన పనులకు, రికార్డుల్లో పేర్కొన్న అంకెలకు తేడా ఉందని, పర్యవేక్షణ లేక పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి.
- ఇదంతా ఒక ఎత్తు అయితే ఎస్.కోట పరిధిలోకి వచ్చే మూల బొడ్డవర చెక్‌పోస్టులో లంచం ఇవ్వనిదే బొగ్గుల సంచి కూడా కదలదన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడొక అనధికార వ్యక్తి దందా నడుపుతున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. సాధారణంగా సొంత హక్కు దారుడు తమ భూమిలో ఉన్న చెట్లను నరకాలంటే ముందుగా రెవెన్యూ అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత అటవీ శాఖాధికారుల నుంచి కట్టింగ్ ఆర్డర్ తీసుకోవాలి. ఈ రెండూ ఉన్న వారికి తరలింపునకు పర్మిట్ ఇవ్వాలి. ఇక్కడి వాటన్నింటికీ తిలోదకాలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ చెక్‌పోస్టు మీదుగానే అరకు, అనంతగిరి ప్రాంతాల నుంచి జోరుగా గంజాయి రవాణా జరుగుతోంది. ఇప్పటికే సాధారణ పోలీసులు నిఘా పెట్టారు. నాలుగైదు వాహనాల్ని గుర్తించినట్టు సమాచారం. ఏదో ఒక రోజు దాడులు చేసి పట్టుకునే అవకాశం ఉంది. చెక్‌పోస్టులో పెద్దగా నిఘా లేకపోవడమో, చేతివాటమో తెలియదు గాని గంజాయి రవాణాకు రాచమార్గమైపోయిందన్న వాదనలు ఉన్నాయి.
- ఎస్.కోట పరిధిలో కర్రల మిల్లులకు పెద్ద ఎత్తున అటవీ కలప వస్తున్నట్టు సమాచారం. అధికారులతో ఉన్న లోపాయికారీ ఒప్పందాలతో మూడు పువ్వులు, ఆరు కాయలుగా కర్రల మిల్లుల వ్యాపారం నడిచిపోతున్నట్టు భోగట్టా. ఫిర్యాదులొస్తే తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నట్టు విమర్శలు కూడా ఉన్నాయి. ఇక, సీజ్ చేసిన కలప, వాహనాల విషయంలో కూడా బేరసారాలు జరుగుతున్నాయి. వేసిన అపరాధ రుసుముకు, వసూలు చేసిన మొత్తానికి పెద్ద ఎత్తున తేడా ఉంటోంది.