మద్యానికే మతిపోయేలా! | Corruption in Excise Department | Sakshi
Sakshi News home page

మద్యానికే మతిపోయేలా!

May 27 2019 1:18 PM | Updated on Jul 11 2019 8:44 PM

Corruption in Excise Department - Sakshi

శ్రీకాకుళం రూరల్‌:వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం ఎంత? అసలు, దీనికి సంబంధించిన లెక్కలన్నీ రికార్డుల్లో నమోదు చేశారా? లేదా... చీప్‌ లిక్కర్‌ మాత్రమే ధ్వంసం చేసి, మిగిలిన మద్యం ఏం చేసినట్టు, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ తీరుపై ఇలా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఆ శాఖ ఇన్‌చార్జి ఎస్‌ఐ కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది.
నగరంలోని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో 2018లో శ్రీకాకుళం నగరంతోపాటు గార, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్‌ మండలాల్లో రూ.5 లక్షల విలువల మద్యాన్ని పట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితమే చీప్‌ లిక్కర్‌ ధ్వంసం చేసి, విలువైన మద్యాన్ని మాత్రం పక్కదోవ పట్టించినట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా స్టేషన్‌ ఎస్‌ఐగా బాధ్యతలు చేపడుతున్న అధికారి సూచనల మేరకు అత్యంత రహస్యంగా సాగుతున్నట్లు సమాచారం.

 ఆ విలువైన మద్యం ఏమైనట్లు?
వాస్తవంగా శ్రీకాకుళం ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో పట్టుకున్న నాలుగు మండలాలకు సంబంధించిన మద్యాన్ని నగర కేంద్రంలోని శ్రీకాకుళం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేష¯న్‌లోనే భద్రపరిచారు. ఎక్కువుగా డీఎస్, ఓసీ, ఐబీలతోపాటు గోల్డ్‌రేస్‌లు భారీస్థాయిలో పట్టుకున్నారు. వీటిని స్టేషన్‌ ఆవరణలో ధ్వంసం చేయగా, అతి విలువైన మద్యాన్ని మాత్రం పక్కదారి పట్టించారు. ఈ వ్యవహారమంతా శ్రీకాకుళం ఎక్సైజ్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ కనుసన్నల్లోనే జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 అన్నీ తానై చక్కబెడుతూ...
గతంలో శ్రీకాకుళం ఎక్సైజ్‌ స్టేషన్‌లో పని చేసిన ఓ మహిళా అధికారి ఎన్నికల విధి నిర్వహణలో అలసత్వం వహించిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఏప్రిల్‌ 9న సస్పెన్సన్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్టేషన్‌ పూర్తి బాధ్యతలు ఇన్‌చార్జి ఎస్‌ఐగా పనిచేస్తున్న అధికారికి అప్పగించారు. అప్పట్నుంచి స్టేషన్‌లో వివిధ కేసుల పంచాయతీతోపాటు తన పరిధిలోని నాలుగు మండలాల్లో అక్రమ వసూళ్లు ఈయన హయాంలోనే జరగాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. గతంలో పనిచేసి సస్పెన్స్‌న్‌కు గురైన అధికారి స్థానంలో ఇంతవరకూ స్టేషన్‌ హౌస్‌ అధికారిని నియమించలేదంటే ఈయన ఉన్నతాధికారులకు అందిస్తున్న సేవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్‌ఐ తాను చెప్పిందే వేదం అన్న రీతిలో సిబ్బందిపై ఒత్తిడి తేవడం, ఉన్నతాధికారుల వద్ద మార్కులు కొట్టేందుకుగాను తోటి సిబ్బందిపై చాడీలు చెప్పడం, ఇలా స్టేషన్‌ వ్యవహార కార్యకలాపాలన్నీ ఈయన కనుసైగల్లోనే జరుగుతున్నాయి. నెలసరి మామ్ముళ్లతోపాటు బెల్టుషాపుల వద్ద భారీస్థాయిలో అక్రమ వసూళ్లకు పాల్పడటం, వైన్‌షాపు యజమానులతో కుమ్మక్కై అధిక ధరకు మద్యం విక్రయించడం నెలరోజులుగా చేస్తున్నప్పటికీ సంబంధిత శాఖాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం శ్రీకాకుళం మండలంలోని ఇప్పిలి నుంచి బలివాడ జంక్షన్‌కు వెళ్లే రహదారిలోనే ప్రభుత్వ స్థలంలో ఓ మహిళ దర్జాగా బెల్టుషాపు నడుపుతోంది. ఈమె వద్ద ఎక్సైజ్‌ సిబ్బంది ప్రతినెలా మామ్మాళ్లు తీసుకుంటూ వదిలేస్తుండటం గమనార్హం. 

దర్యాప్తు చేస్తా
విలువైన మద్యాన్ని ఎవరైనా పక్కదోవ పెడితే వారిపై చర్యలు తప్పవు. శ్రీకాకుళం స్టేషన్‌ పరిధిలో అధిక ధరలకు మద్యం విక్రయించినా, షాపుల నుంచి వసూళ్లకు పాల్పడినా వారిపై చర్యలు తీసుకుంటాం. కొత్త ప్రభుత్వం వచ్చింది, కాబట్టి ఆదిశగా కొన్ని మార్పులు చేర్పులు జరగనున్నాయి.– సుఖేష్, ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement