ప్రతి ఆసుపత్రిలో ఐసొలేషన్‌ వార్డు

Coronavirus: CM YS Jagan High Level Review On Covid-19 Prevention - Sakshi

కోవిడ్‌–19 కట్టడి చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

జిల్లాకో టెస్టింగ్‌ ల్యాబ్‌..ఇప్పుడున్న వాటి సామర్ధ్యం పెరగాలి

ఢిల్లీ యాత్రికులు, వారి సన్నిహితులను వేగంగా పరీక్షించాలి 

ఇంటింటి ఆరోగ్య పరిస్థితిపై నిరంతర సర్వే కొనసాగాలి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రతి జిల్లాలో ఒక టెస్టింగ్‌ ల్యాబ్‌ అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌ల సామర్థ్యం పెంచి ఢిల్లీ యాత్రికులు, వారిని కలిసిన వారికి వేగంగా కరోనా పరీక్షలు పూర్తి చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిపై సర్వే నిరంతరాయంగా కొనసాగుతుండాలని స్పష్టం చేశారు. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలపై సీఎం జగన్‌ ఆదివారం తన నివాసంలో సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి. డీజీపీ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల తదితరులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..

ఐసోలేషన్‌ వార్డులోనే చికిత్స..
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. కోవిడ్‌ –19 లక్షణాలతో ఏ రోగి వచ్చినా ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్‌ వార్డులోనే ఉంచి చికిత్స చేయాలి. వైద్యులు, వైద్య సిబ్బంది జాగ్రత్తలు పాటిస్తూ అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుని ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స అందించాలి. దీనిపై ఇప్పటికే జారీ అయిన మార్గదర్శకాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికి 7 చోట్ల ల్యాబ్‌లు ఉండగా విశాఖ, విజయవాడ సహా మూడుచోట్ల ల్యాబ్‌ల సామర్థ్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఢిల్లీ యాత్రికులు, వారితో సన్నిహితంగా మసలిన వారికి వేగంగా పరీక్షలు పూర్తి చేసి సెకండరీ కాంటాక్ట్స్‌పై దృష్టి సారించాలని సీఎం పేర్కొన్నారు.

మలిదశలో వారికి పరీక్షలు
క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలింపుపై మార్గదర్శకాలను సంపూర్ణంగా పాటిస్తూ మెరుగైన సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇంటింటి సర్వే డేటా ఆధారంగా కరోనా లక్షణాలు ఉన్నవారికి, వైద్యులు సూచించిన వారికి తదుపరి దశలో పరీక్షలు నిర్వహించాలని సీఎం సూచించారు. ఆ తర్వాత నిర్దేశించుకున్న చర్యల మేరకు ర్యాండమ్‌గా పరీక్షలు చేపట్టాలన్నారు.

విశాఖలో ర్యాండమ్‌ పరీక్షలు
కరోనా వ్యాప్తి స్థాయిని అంచనా వేసేందుకు విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా క్లస్టర్ల వారీగా నిర్వహించిన ల్యాబ్‌ పరీక్షల ఫలితాలను సీఎంకు అధికారులు వివరించారు. విశాఖలో కరోనా పాజిటివ్‌ కేసులున్న రెడ్‌ జోన్లను 8 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌ నుంచి 20 నమూనాలు చొప్పున సేకరించి పరీక్షించారు. విదేశాలనుంచి వచ్చిన వారు, రిస్క్‌ ఎక్కువగా ఉన్న వయసు వ్యక్తులు తదితర కేటగిరీల వారీగా నమూనాలు సేకరించారు. అన్ని ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయని సీఎంకు అధికారులు తెలిపారు.

సరిపోల్చి విశ్లేషించాలి...
► ప్రతి కుటుంబాన్ని సర్వే చేయగా వెల్లడైన ఫలితాలను వైద్య సిబ్బంది, పోలీసుల సహాయంతో సేకరిస్తున్న వివరాలతో సరిపోల్చి ఎప్పటికప్పుడు విశ్లేషించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. వైరస్‌ సోకిన వారికి వైద్యం అందించే విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

లాక్‌డౌన్‌ తర్వాత జాగ్రతలు...
► రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌జోన్లు, హాట్‌ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అనంతరం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 14వతేదీ తర్వాత కేంద్ర ప్రభుత్వం జారీ చేసే మార్గ దర్శకాల ఆధారంగా తగిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తం కావాలని సీఎం సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top