కమిషనరేట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే ? | Commissionerate expansion, there is nowadays? | Sakshi
Sakshi News home page

కమిషనరేట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే ?

Jan 8 2015 1:29 AM | Updated on Aug 21 2018 9:18 PM

నగర పోలీసు కమిషనరేట్ విస్తరణ మరికొంత జాప్యం కానుంది. కమిషనరేట్ విస్తరణలోని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మరోసారి చర్చిద్దామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సీపీ ప్రతిపాదనలపై సీఎం అనాసక్తి
 
విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్ విస్తరణ మరికొంత జాప్యం కానుంది. కమిషనరేట్ విస్తరణలోని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మరోసారి చర్చిద్దామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడి అధికారుల ప్రతిపాదనలపై దాటవేసినట్టు తెలిసింది. కమిషనరేట్ విస్తరణపై ముఖ్యమంత్రి అయిష్టత వ్యక్తం చేయడంతో అధికారులు కొంత ఇబ్బందికి లోనయ్యారు. నగరంలోని మహాత్మాగాంధీ రోడ్డులోగల ఓ హోటల్‌లో బుధవారం ప్రీబడ్జెట్‌పై ముఖ్యమంత్రి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనరేట్ విస్తరణపై కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  నవ్యాంధ్ర రాజధానిగా నగరాన్ని ప్రకటించడంతో కమిషనరేట్ విస్తరణ అనివార్యమైంది. ఇందుకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ వెంకటేశ్వరరావు కమిషనరేట్ తరఫున ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తుళ్లూరు, తెనాలి, తాడికొండ, తాడేపల్లి, అమరావతి, ఫిరంగిపురం, పెదకూరపాడు, క్రోసూరు, పెదకాకాని, కొల్లిపర, దుగ్గిరాల, అచ్చంపేట మండలాలను, నగర పోలీసు కమిషరేట్‌లో ఇప్పటికే ఉన్న విజయవాడ రూరల్, గన్నవరం, కంకిపాడు, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, తోట్లవల్లూరు, ఉయ్యూరు, పమిడిముక్కల మండలాలతో పాటు హనుమాన్ జంక్షన్, ఆగిరిపల్లి, నూజివీడు, కంచికచర్ల మండలాలను కలిపి విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు. రేంజ్‌లు మారడంతో పాటు ఆయా మండలాలను కలపడం రాజకీయ ఇబ్బందులు సృష్టిస్తుందనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అన్ని అంశాలను సానుకూలంగా చర్చించేందుకు మరోసారి ప్రయత్నిద్ధామంటూ ఇప్పటికిప్పుడైతే కమిషనరేట్ విస్తరణపై ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదని తెలిసింది. గత కొద్ది రోజులుగా కమిషనరేట్ విస్తరణపై నగర పోలీసులు పెద్దఎత్తున కసరత్తు చేసి ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందుకు సంబంధించి ప్రధాన కమిషనరేట్ల డేటాను సైతం సేకరించి పొందుపరిచినప్పటికీ ముఖ్యమంత్రి అనాసక్తి చూపడం  కమిషనరేట్ అధికారులకు మింగుడుపడటం లేదు.
 
పోలీసుల పనితీరుపై  అసంతృప్తి

నగర పోలీసుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకుని నిలువరించాలి తప్ప సామాన్యులకు ఇబ్బంది కలిగించే చర్యలకు దిగరాదంటూ పరోక్షంగా ఆపరేషన్ నైట్ డామినేషన్‌పై వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో కమిషనరేట్ పరిధిలోని దిగువస్థాయి అధికారుల పనితీరు ఏమాత్రం బాగోలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులు ముఖ్యమంత్రిని కలిసేందుకు రాగా పోలీసు అధికారులు అడ్డుకోవడంపై కూడా ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు తమ పద్ధతులను మార్చుకొని ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించాలి తప్ప ఇలాంటి చర్యలు మంచివి కావంటూ హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement