ఉపాధి హామీ పథకం, కేంద్ర కాఫీ బోర్డు సంయుక్తంగా ఏజెన్సీలో అమలు చేస్తున్న కాఫీ ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ ఎప్పటి కి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది.
పాడేరు, న్యూస్‌లైన్: ఉపాధి హామీ పథకం, కేంద్ర కాఫీ బోర్డు సంయుక్తంగా ఏజెన్సీలో అమలు చేస్తున్న కాఫీ ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ ఎప్పటి కి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. కాఫీ ప్రాజెక్టు కుంభకోణంపై సమ గ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని హామీలిస్తున్న కలెక్టర్లు బదిలీపై వెళ్లిపోతుండడంతో పరిస్థితి మళ్లీ మొదటికే వస్తోంది.
గిరిజన రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదు. మన్యంలో 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన కాఫీ మొక్కల పెంపకానికి సంబంధించి ప్రోత్సాహక సొమ్ము పంపిణీలో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని రైతులతోపాటు గిరిజన సంఘం, వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనలు చేశా రు. గిరిజన సంఘం గ్రామాల వారీగా సర్వేలు నిర్వహించి సుమారు రూ.21 కోట్ల మేర అక్రమాలు జరిగాయని పేర్కొంటూ అప్పటి కలెక్టర్ వి.శేషాద్రికి నివేదిక సమర్పించింది. దీనిపై ఆయన సమగ్ర విచారణకు ఆదేశించినప్పటికీ మొక్కుబడిగా విచారణ సాగింది.
పెదబయలు మండలంలోని 5 మారుమూల పంచాయతీల్లో ప్రత్యేక సామాజిక తనిఖీలు చేపట్టి సుమారు రూ.60 లక్షల అవినీతి జరిగిందని నిర్ధారించా రు. ఐకేపీ, ఉపాధి హామీ పథకంలో పని చేస్తు న్న కింది స్థాయి ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. డుంబ్రిగుడ, హుకుం పేట, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి మండలాల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగినప్పటికీ ఇంతవరకు ప్రత్యేక సామాజిక తనిఖీలు నిర్వహించలేదు. హైదరాబాద్‌కు చెందిన అధికారుల బృందంతో విచారణ నిర్వహిస్తామని అప్పటి కలెక్టర్ ప్రకటించినప్పటికీ అది జరగలేదు.
ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి న ఆరోఖ్యరాజ్‌కు కాఫీ ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరపాలని కోరుతూ గిరిజన సంఘం నేతలు వినతిపత్రం సమర్పించారు. విచారణకు ఆయన కూడా హామీ ఇచ్చిన ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. ఉన్నత స్థాయి అధికారులు ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉండడంతోనే విచారణను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విచారణ ఊసెత్తకుండా బడా రాజకీయ నేతలతో అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నట్టు తెలిసింది. కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రులైన కిషోర్‌చంద్రదేవ్, పి.బాలరాజు కూడా కాఫీ అవినీతిపై విచారణకు ఆదేశించకపోవడం వెనుక చిదంబర రహస్యం ఏమిటో అంతుబట్టడం లేదు. దీనిపై సమగ్ర విచారణ కోరుతూ బాధిత రైతులు మరలా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.