ఇంటింటా పింఛన్ల పండుగ

CM YS Jagan video conference on Spandana Programme - Sakshi

‘స్పందన’పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పంపిణీ చేయనున్న వలంటీర్లు

ఫిబ్రవరి నుంచి 54.64 లక్షల మందికిపైగా పెన్షన్లు

కొత్తగా 15.64 లక్షల మందికి ప్రయోజనం

15 నుంచి 21 వరకు కొత్త పెన్షన్, బియ్యం కార్డులు పంపిణీ

11.60 లక్షల మంది విద్యార్థులకు 20న ‘జగనన్న వసతి దీవెన’ 

ఉగాదికి 25 లక్షల మంది పేద మహిళలకు స్టాంప్‌ పేపర్‌పై ఇళ్ల పట్టాలు

15 నుంచి వైఎస్సార్‌ కంటి వెలుగు మూడో విడత  

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు పారదర్శకంగా భర్తీ

అందులో సగం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే

ఏప్రిల్‌కల్లా 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు

దేశం మొత్తం మాట్లాడుకునేలా దిశ చట్టం అమలు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 54.64 లక్షల మందికిపైగా  పేదలకు మేలు చేకూరుస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు పింఛన్లు 39 లక్షలు మాత్రమే ఉండగా ఇప్పుడు 54.64 లక్షల మందికిపైగా పెన్షన్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. తద్వారా కొత్తగా 15.64 లక్షల మందికి పింఛన్లతో ప్రయోజనం కలగనున్నట్లు స్పష్టమవుతోంది. గ్రామ, పట్టణ వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్‌ సొమ్మును పంపిణీ చేస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్పందన ద్వారా అందే దరఖాస్తుల్లో దాదాపు 60 శాతం వరకు బియ్యం కార్డులు, పెన్షన్లు, ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. స్పందనలో అధికారులు బాగా పనిచేశారని చాలామంది ప్రశంసించారన్నారు. స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ...  

15 నుంచి కొత్త పెన్షన్‌కార్డులు, బియ్యం కార్డులు
‘‘వైఎస్సార్‌ నవశకం ద్వారా కొత్తగా బియ్యం కార్డులు, పెన్షన్‌ అర్హుల ఎంపిక ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఫిబ్రవరి 15వతేదీ నుంచి 21 వరకు వీటి పంపిణీని పూర్తి చేయాలి. నిర్దేశిత సమయానికి కార్డులు ప్రింట్‌ చేసి పంపిణీకి సిద్ధం చేయాలి. సామాజిక తనిఖీ ఫిబ్రవరి 2 కల్లా పూర్తి కావాలి. ఆ వెంటనే కార్డుల పంపిణీ చేపట్టాలి. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే గ్రామ సచివాలయాల ద్వారా కొత్త కార్డుల మంజూరు జరుగుతుంది. 

ఇళ్ల స్థలం లేదని ఎవరూ చేయి ఎత్తకూడదు..  
అర్హులైన పేదలందరికీ ఉగాదికి ఇళ్ల స్థలాల పట్టాలను మంజూరు చేయాలి. 25 లక్షల మంది మహిళలకు వారి పేర్లతో రూ.10 స్టాంపు పేపర్‌పై ఇళ్లపట్టాలు జారీ చేస్తాం. లాటరీ ద్వారా ఇళ్ల  స్థలాల కేటాయింపు  చేయాలి. ఫిబ్రవరి 15 లోగా ఇళ్ల పట్టాల అర్హుల జాబితా సిద్ధం కావాలి., ప్రజాసాధికార సర్వేకి, ఇళ్ల పట్టాల మంజూరుకు ముడిపెట్టకూడదు. గతంలో ఇళ్లు పొందిన వారి వివరాలను ప్రభుత్వం వద్ద ఉన్న 2006 ఏడాది వివరాలతో సరిపోల్చి చూడాలి. గ్రామాల్లో నా పర్యటన సందర్భంగా ఇళ్ల స్థలాలు లేవని ఎవరూ చేతులు ఎత్తకూడదు. ఇళ్ల పట్టాలు ఇచ్చే స్థలాలకు మెజార్టీ లబ్ధిదారులు అంగీకారం తెలపాలి.

మొక్కుబడిగా ఇస్తే ఎవరూ అక్కడ ఉండేందుకు ఇష్టపడరని గుర్తుంచుకోవాలి. మనం ఇచ్చే ఇళ్ల స్థలం వారి ముఖంలో సంతోషాన్ని నింపాలి. స్థలాలు నివాసయోగ్యంగా ఉండాలి. లబ్ధిదారుడు సంతోషంగా ఉండాలి. లేదంటే డబ్బులు వృథా కావడమే కాకుండా లబ్ధిదారులకు అసంతృప్తే మిగులుతుంది. ప్లాటింగ్‌ చేసేటప్పుడు ఈ అంశాలను కలెక్టర్లు కచ్చితంగా పరిశీలించాలి. ఊరికి దూరంగా, నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. ఫిబ్రవరి 15 కల్లా అర్హుల జాబితా సిద్ధం కావాలి. 21 కల్లా లబ్ధిదారుల వివరాలను కలెక్టర్లు పంపించాలి. ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్ల అభివృద్ధి ఫిబ్రవరి 25 కల్లా జరగాలి. మార్చి 1 కల్లా ఇళ్ల స్థలాల కోసం భూముల సేకరణ పూర్తి కావాలి. మార్చి 10 కల్లా సేకరించిన స్థలాల్లో ప్లాట్లను అభివృద్ధి చేయాలి. మార్చి 15 కల్లా లాటరీలు కూడా పూర్తిచేసి ప్లాట్ల కేటాయింపు జరగాలి.  
 
నిర్మాణాలు పూర్తయ్యాకే వారిని తరలించాలి 
అభ్యంతరకర ప్రాంతాల్లో నివాసముంటున్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారికి ప్లాట్ల్లను ఎక్కడ కేటాయిస్తున్నారో చూపించి అంగీకారం పొందాలి. వచ్చే ఏడాది చేపట్టబోయే ఇళ్ల నిర్మాణాల్లో వీరికి ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలియచేయాలి. ఆ ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే  అభ్యంతరకర ప్రాంతాల్లో ఉన్నవారిని తరలించాలి. అభ్యంతరాల్లేని ప్రాంతాల్లో నివసించే వారిని ఎలాగూ రెగ్యులరైజ్‌ చేస్తాం. ఈ విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. మనం దాపరికం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని తెలియచేయాలి. మనకు ఓటు వేయనివారైనా ఫర్వాలేదు కానీ వారికి మాత్రం మంచి జరగాలి. దీన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమంగా తీసుకోవాలి. భవిష్యత్తు తరాలన్నీ ఈ ప్రభుత్వాన్నీ, అధికారులనూ గుర్తుంచుకుంటాయి.  
 
ఫిబ్రవరి 20న ‘వసతి దీవెన’ ప్రారంభం 
రాష్ట్రంలో దాదాపు 11.60 లక్షల మంది విద్యార్ధులకు మేలు చేసే ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఫిబ్రవరి 20వతేదీన ప్రారంభిస్తాం. మొదటి విడత కింద ఫిబ్రవరిలో డబ్బులు అందచేస్తాం. జూలై– ఆగస్టులో రెండో విడత డబ్బులు ఇస్తాం. బోర్డింగ్, లాడ్జింగ్‌  ఖర్చుల కోసం ఈ డబ్బులను విద్యార్ధుల తల్లులకు అందచేస్తాం. జగనన్న వసతి దీవెన కింద ఐటిఐæ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇతర కోర్సులకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తాం. 

 
ఏప్రిల్‌ చివరికి 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు 

ఏప్రిల్‌ నెలాఖరు నాటికి 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాల వద్దే ఏర్పాటవుతాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే కార్యక్రమం. నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు, ఎరువులను గ్రామాల్లోనే అందించడంతో పాటు రైతులు పంటవేసే సమయానికే కనీస గిట్టుబాటు ధరలు ప్రకటిస్తాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగంలో సమూల మార్పులను తెస్తాం. పశు వైద్య సిబ్బంది కూడా వీటిల్లో అందుబాటులో ఉంటారు. పశువుల ఔషధాలు కూడా అక్కడే లభిస్తాయి. రైతు భరోసా కేంద్రాలకు భవనాలను సమకూర్చాల్సిన బాధ్యత కలెక్టర్లదే. రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో శాశ్వతంగా ప్రదర్శించాలి. ఎవరైనా అవకాశం కోల్పోతే ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించాలి. మిగిలిన అన్ని పథకాల లబ్ధిదారుల జాబితాలను కూడా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి.  
 
ఏ సేవ ఎప్పుడనేది తెలియచేయాలి.. 

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు అందిస్తుండగా ఇందులో 336 సేవలను కేవలం 72 గంటల్లో పూర్తి చేయాలని నిర్దేశించాం. మిగిలిన సేవలకు కూడా కాల వ్యవధి నిర్ణయించాం. ఏ సేవ ఎన్ని రోజుల్లో అందిస్తారనే వివరాలు సచివాలయాల్లో ప్రదర్శించాలి. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు, వలంటీర్లు చురుగ్గా విధులు నిర్వర్తించేలా ఒక వ్యవస్థను సిద్ధం చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ స్పందన సందర్భంగా దరఖాస్తులకు సంబంధించి ఇచ్చే రసీదులపై వెంటనే స్పందించాలి. కలెక్టర్లు నేరుగా వీటి కార్యకలాపాలను పర్యవేక్షించాలి. దరఖాస్తుల స్వీకరణ, రశీదులు, పరిష్కారం అంతా డాష్‌ బోర్డులో కనిపించాలి.  అధికారులు చాలకపోతే ఆ మేరకు ఏర్పాట్లు చేస్తాం. మనం చేస్తున్న కార్యక్రమాలమీద ఏకాగ్రత లేకుంటే వ్యవస్థలో మార్పులు తీసుకురాలేం. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల పర్యవేక్షణను జిల్లాల్లో ఒక జేసీకి అప్పగించాలి. 
  
15 నుంచి ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ మూడో విడత  
వైఎస్సార్‌ కంటి వెలుగులో భాగంగా మూడో విడత కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. అవ్వా తాతలపై ప్రత్యేక దృష్టి సారించాలి. దాదాపు 1.25 కోట్ల మందికి పరీక్షలు చేయాలని నిర్ణయించాం. జూలై 31 దాకా మూడో విడత కార్యక్రమం కొనసాగుతుంది. ఫిబ్రవరి 15 నుంచి ఆరోగ్యకార్డులు జారీ చేస్తాం.  ఇప్పటివరకూ 66,15,467 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా లక్షన్నర మందికి కంటి అద్దాలు పంపిణీ కొనసాగుతోంది. 46 వేల మందికి శస్త్రచికిత్సలు జరిగాయి. మనం దృష్టి పెట్టకుంటే ఆ పిల్లల పరిస్థితి అలాగే ఉండేది. శ్రద్ధ వహిస్తే ఎంతమందికి మంచి జరుగుతుందో దీని ద్వారా ప్రత్యక్షంగా చూస్తున్నాం. అవ్వా తాతల మీద కూడా మనం ఇలాంటి శ్రద్ధ తీసుకుంటాం.  

‘అమ్మ ఒడి’ తల్లులు 42,33,098 మంది
అమ్మ ఒడి కింద 42,33,098 మంది తల్లులను గుర్తించామని, పథకం ద్వారా ఇప్పటివరకు 41,25,808 మందికి రూ.6,188 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 1,07,290 ఖాతాల ట్రాన్సాక్షన్స్‌ విఫలమైనట్లు గుర్తించామన్నారు. దీనికి కారణాలను పరిశీలించాలని సీఎం సూచించగా వివరాల నమోదులో తప్పుల కారణంగా ట్రానాక్షన్స్‌ ఫెయిల్‌ అయ్యాయని, ఈ వారంలో దీన్ని సరిదిద్దుతామని బ్యాంకు అధికారులు చెప్పారన్నారు. 
 
మధ్యాహ్న భోజన నాణ్యతపై యాప్‌
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడరాదని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. కలెక్టర్లు స్కూళ్లకు వెళ్లి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. సెర్ప్‌లో ఆర్డీవో స్థాయి అధికారి మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాలని  ఆదేశించారు. భోజనం నాణ్యతపై రెండు వారాల్లో ఒక యాప్‌ అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. పాఠశాలల్లో బాత్‌రూమ్స్‌ నిర్వహణపై దృష్టిపెట్టాలని, అంగన్‌వాడీలు, స్కూళ్లలో పరిస్థితులపై శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు.  
 
వర్షాకాలానికి 60–70 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉండాలి
జనవరి 10 నుంచి ఉభయ గోదావరి, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ ప్రారంభమైందని, ఇప్పటివరకు 1,12,082 టన్నులు ఇంటివద్దే ప్రజలకు అందచేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 48 –72 గంటల్లో ఇసుక డోర్‌ డెలివరీ జరుగుతోందన్నారు. జనవరి 30న అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇసుక డోర్‌ డెలివరీ ప్రారంభమవుతుండగా ఫిబ్రవరి 7 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో డోర్‌ డెలివరీ మొదలు కానుందని తెలిపారు. ఫిబ్రవరి 14 నుంచి గుంటూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ ప్రారంభం కానుంది. 16.5 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉందని అధికారులు పేర్కొనగా వర్షాకాలం వచ్చేసరికి 60–70 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంచాలని సీఎం సూచించారు.   
 
దేశమంతా చర్చించేలా దిశ చట్టం అమలు

దిశ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్‌ ఆరా తీశారు. ఫిబ్రవరి మొదటి వారానికి రాజమండ్రి, విజయనగరంలో దిశ పోలీస్‌ స్టేషన్లు సిద్ధమవుతున్నాయని, మిగిలిన పోలీస్‌స్టేషన్లు కూడా ఫిబ్రవరి రెండో వారాంతానికి సిద్ధమవుతాయని డీజీపీ తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌ ఏర్పాటవుతాయని సీఎంకు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను ఎస్పీలు వెంటనే పరామర్శించాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెచ్చిన దిశ చట్టం అమలు కూడా అదే రీతిలో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. 
 
ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో దళారుల నిర్మూలన

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించామని సీఎం పేర్కొన్నారు. ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతోందని, మార్చి కల్లా పూర్తి చేస్తామని చెప్పారు.  
లంచగొండితనం లేకుండా, కోతలు లేకుండా ఉద్యోగికి నేరుగా జీతం వచ్చేలా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మేలు చేస్తున్నామని సీఎం తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top