గాంధీ, అంబేద్కర్‌ ప్రేరణతోనే నవరత్నాలు: సీఎం జగన్‌

CM YS Jagan Mohan Reddy Independence Day Speech - Sakshi

సాక్షి, అమరావతి: మహాత్మా గాంధీ గ్రామస్వరాజ్యం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ ఆలోచనావిధానం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని, ఆ మహానుభావుల ప్రేరణతోనే ‘నవరత్నాలు’ పథకాలను రూపొందించానని ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు పూర్తవుతున్నా.. నేటికి సమాజంలో కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు మాయనిమచ్చలుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలు, మతాల పరంగా ఇప్పటికీ ప్రజలకు అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్య్రం పొందలేకపోతున్నవారి కోసం నామినేటెడ్ పోస్టులు, నామినేషన్‌ పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు తీసుకొచ్చామని తెలిపారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విధినిర్వహణలో సాహసోపేతంగా వ్యవహరించిన పలువురు రాష్ట్ర పోలీసులకు మెడల్స్‌ అందించారు. అనంతరం ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మహాత్మాగాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రస్తావనతో తన ప్రంసంగాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌.. తమ ప్రభుత్వ ప్రాధమ్యాలు, నవరత్నాలు, సామాజిక ప్రగతికి పెద్దపీట వేస్తూ ఇటీవల తీసుకొచ్చిన చట్టాలు, ప్రభుత్వ నిర్ణయాలను తన ప్రంసగంలో ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వ తప్పిదాలను గుర్తుచేసిన సీఎం..రైతులు, మహిళలు, యువతకి సంబంధించి ఇచ్చిన హామీలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను వివరించారు.

గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గ్రామ సచివాలయాలు తీసుకొస్తున్నామని తెలిపారు. మద్యపానాన్ని నిషేధించేదిశగా నూతన మద్య విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.రైతులకు, పేదలకు ఉచితంగా కరెంట్ ఇచ్చేందుకు వీలుగా చార్జీలు తగ్గించాలని విద్యుత్ సంస్థలని అడిగినందుకు హాహాకారాలు చేస్తున్నారని, కాంట్రాక్టర్లు, కమిషన్‌ల కోసం అడ్డగోలుగా పెంచిన టెండర్ ధరలను తగ్గించాలన్నందుకు  గగ్గోలు పెడుతున్నారని, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని చెప్పినందుకు నానా యాగీ చేస్తున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు.

తమ ప్రభుత్వ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్రగతిని మార్చే చట్టాలు తీసుకొచ్చామని తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేషన్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చే చట్టాలు తీసుకొచ్చామని, నామినేటెడ్ పదవులు, నామినేషన్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ చట్టం తీసుకొచ్చామని, ఇలాంటి చట్టాలు తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తమదేనని ఆయన పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతులకు రూ. 7 లక్షల పరిహారం అందజేస్తున్నామని చెప్పారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలించడం ద్వారా రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు, రాష్ట్ర విభజన నష్టాలను పూడ్చేందుకు నిర్దిష్ట లక్ష్యాలతో తమ ప్రభుత్వం ముందుకువెళ్తోందని తెలిపారు. ఇంకా వైఎస్‌ జగన్‌ తన ప్రంసగంలో ఏమన్నారంటే..

అనేక ఉద్యమాల మిశ్రమం మన జాతీయోద్యమం
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు పూర్తయి.. 73వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. 1857లో మంగళ్‌ పాండే బ్రిటీష్‌ పాలకులపై తిరగబడి సిపాయిల తిరుగుబాటు ఉద్యమాన్ని ప్రారంభిస్తే.. ఆ తరువాత 90 ఏళ్లకు 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మన దేశాన్ని మన ప్రజలే పరిపాలించాలి. మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకోవాలి. మన తలరాతల్ని మనమే మార్చుకోవాలి. మనల్ని దోపిడీ చేసే పాలకులు గద్దె మీద ఉండటానికి వీల్లేదు. విభజించి పాలించే ఆలోచనలు పోవాలి.. సంఘ సంస్కరణలు రావాలి. కులాలు, మతాలు, వర్గాలు అన్న విభేదాలు చెరిగిపోవాలి. మనవత్వం నిలిచిపోవాలి అంటూ మన దేశ స్వాతంత్ర్య ఉద్యమం అనేక గొప్ప భావాలతో ముందుకు సాగింది. బ్రిటిష్‌ వాడి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడటంతోపాటు. మన దేశంలో ఉన్న అంటరానితనానికి, మనుషుల్ని విభజిస్తున్న కులం పునాదుల్ని పెకలించడానికి, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఒకే సమయంలో జరిగిన అనేక ఉద్యమాల మిశ్రమం మన జాతీయోద్యమం.

వందల భాషలు, వేల కులాలు, అనేక మతాలు.. వందలకొద్ది సంస్థానాల ఈ దేశం.. స్వాతంత్ర్య పోరాట ఫలితంగానే ఒక్కటయింది. వందేమాతరం, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, జైహింద్‌, క్విట్‌ ఇండియా అంటూ మహామహులు ఇచ్చిన నినాదాలు.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశభక్తిని రగిలించాయి’ అని గుర్తుచేశారు. ఒక జాతీగానీ, ఒక దేశంగానీ స్వాతంత్ర్యాన్ని కోల్పోతే.. ఎన్ని వందల ఏళ్లు బానిసలుగా, సెకండ్‌ క్లాస్‌ సిటిజెన్లుగా మానవహక్కులు లేకుండా బతకాల్సి వస్తుందో.. ఎన్ని పోరాటాలు, ఎంతటి త్యాగాలు చేయాల్సి వస్తుందో మన స్వాతంత్ర్య ఉద్యమం చెప్తోంది.

వ్యవస్థలో మార్పు కోసమే నవరత్నాలు
‘1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం దేశ ప్రజలందరికీ వచ్చిందా? లేక కొందరికే వచ్చిందా? అన్నదానిపై మనం బాధ్యతగా సమాధానం వెతకాలి. స్వాతంత్ర్యం అనంతరం వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించాం. అని ఆ అభివృద్ధి ఫలాలు అందాల్సిన వారికి అందలేదు. అవినీతి, దళారీ వ్యవస్థ వేగంగా బలపడింది. ఎలాంటి విలవలూ లేని గత రాజకీయాన్ని కొనసాగిద్దామా? లేక ఈ వ్యవస్థను మార్చుకుందామా? మనం చెడిపోయిన ఈ వ్యవస్థలో భాగస్వాములుగా ఉంటూ.. అవినీతి, అధికారం పాలు, నీళ్లలా కలిసిపోయాయని.. అవి అలాగే ఉంటాయని వదిలేద్దామా? లేక ఈ పరిస్థితులను మారుద్దామా? అన్నది గుండెలపై చేతులు వేసుకొని ఆలోచించాల్సిన సమయం. ఈ వ్యవస్థలో మార్పు తీసుకువద్దామనే దృఢ నిశ్చయంతో నవరత్నాలు తీసుకొచ్చాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్ర్యాన్ని పొందలేకపోయిన వారి కోసం నామినేటెడ్‌ పదవుల్లో, నామినేషన్‌ పదవుల్లో రిజర్వేషన్‌ కేటాయిస్తూ చట్టాలు తీసుకొచ్చాం’ అని సీఎం జగన్‌ తెలిపారు.

శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు
‘మన వ్యవస్థను మార్చుకుందామన్న దృఢ నిశ్చయంతో ధైర్యంగా ముందండుగువేశాం. సామాజిక న్యాయ చరిత్రలోనే కనీవీని ఎరుగనివిధంగా బడుగులు, మహిళలకు పెద్దపీట వేస్తూ చరిత్రగతిని మార్చే చట్టాలను తీసుకొచ్చాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేసిన మొట్టమొదటి రాష్ట్రం మనదే. బీసీ కులాలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదు.. భారతీయ సంస్కృతి, నాగరికతలకు బ్యాన్‌బోన్‌లుగా వెన్నెముక కులాలుగా చేస్తామన్న మాటకు కట్టుబడి బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. భారతదేశ రాజకీయ చరిత్రను మలుపులు తిప్పేలా సామాజిక న్యాయానికి బాటలు వేసే చట్టాలు చేశాం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవుల్లో, నామినేటెడ్‌ పనుల్లో 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టాలు తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం కూడా మనదేని గర్వంగా చెప్తుతున్నా. గతంలో ఎప్పుడూలేనివిధంగా నామినేటెడ్‌ పదవుల్లో, నామినేషన్‌ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టాలను తీసుకొచ్చాం’ అని సీఎం పేర్కొన్నారు.

పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు
‘పరిశ్రమల్లో, ఫ్యాక్టరీల్లో 75శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే కేటాయించాలంటూ చట్టం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనదే. పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో ముందుగానే తెలుసుకొని.. స్థానిక యువతకు అందుకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి.. అటు పరిశ్రమలకు, ఇటు స్థానికులకు వెన్నుదన్నుగా నిలబడాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యనియంత్రణలో భాగంగా బెల్ట్‌ షాపులు మూయించడమే కాకుండా వాటిని శాశ్వతంగా మూయించేందుకు లాభాపేక్ష లేకుండా అక్టోబర్‌ 1నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మేలా నిర్ణయం తీసుకున్నాం. భూయాజమానులకు ఎలాంటి నష్టం కలుగకుండా కౌలురైతులకు వైఎస్సార్‌ రైతు భరోసాతోపాటు పంటల బీమా, పంటల పరిహారం అందించేందుకు చట్టం తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం మనదే.

అనేక సంస్కరణలకు శ్రీకారం..
‘చదువును వ్యాపారంగా మార్చేసిన కార్పొరేట్‌ సంస్కృతిని మార్చేందుకు విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌నుతీసుకొచ్చాం. విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను మొదటి సమావేశాల్లోనే ఏర్పాటుచేసిన ప్రభుత్వం మనది. ఇరిగేషన్‌ కాంట్రాక్టులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కాంట్రాక్టులు అంటే కేవలం కమీషన్లు, దోపిడీలకు మారుపేర్లుగా మారిన నేపథ్యంలో ఈ వ్యవస్థను మార్చి ప్రతి రూపాయికీ జవాబుదారితీనం ఉండాలన్న సంకల్పంతో మొత్తం టెండరింగ్‌ పద్ధతిలోనే సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. జ్యుడీషియల్‌ ప్రివ్యూ యాక్ట్‌ ద్వారా టెండరు పనుల ఖరారు ప్రక్రియను హైకోర్టు న్యాయమూర్తి ముందు పెడుతూ..ఆయన నిర్ణయమే తుది నిర్ణయంగా మారుస్తూ.. దేశ చరిత్రలోనే తొలిసారిగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మనది. అంతేకాకుండా రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా సంస్కరణలు తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం మనది. వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగే రూ. కోటి దాటిన కొనుగోళ్లన్నింటినీ పారదర్శకత పెంచేలా ఆన్‌లైన్‌లో పెడతాం.. కొనుగోలు చేయాల్సిన వస్తువుల నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించి.. మునపటి రేట్ల కంటే తక్కువకే సరఫరా చేసేందుకు ఎవరైనా ముందుకువస్తే వారికే ఆ అవకాశం ఇస్తాం.

ల్యాండ్‌ మాఫియాకు చెక్‌
ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ల్యాండ్‌ మాఫియా, అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ రికార్డులకు చెక్‌ పెట్టేవిధంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. రైతు అప్పుల్లో మునిగితేలుతుంటే.. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయం వాటా పెరిగిందని చెప్పడం వారిని అవమానించడమే అవుతుంది. కాబట్టే రైతు ఆనందం, రైతు ఆదాయంఈ రెండూ పెరిగేందుకు ఏం చేయాలన్న ఆలోచనతో ఈ రెండున్నర నెలల్లోనే మనందరి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ. 84వేల కోట్ల పంట రుణాలుగా అందించాలని నిర్ణయించాం. పంట రుణాలు తీసుకున్న రైతులు గడువులోగా తిరిగి చెల్లిస్తే.. ఆ రుణాల మీద వడ్డీ ఉండదు. మన రైతన్నను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తం చేయటానికి ఈ చర్యలు తీసుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 60శాతానికిపైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటిపూటే 9 గంటలు కరెంటు సరఫరా చేస్తున్నాం. వచ్చే ఏడాది జులై నాటికి మిగిలిన 40శాతం ఫీడర్లలో కూడా పగటిపూట పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికోసం రూ. 1700 కోట్లు ఇవ్వలేం అని విద్యుత్‌ సంస్థలు చెబితే.. వెంటనే ఆ మొత్తాన్ని కేటాయించి, పనులు ముందుకు తీసుకువెళుతున్నాం.

భారత దేశ చరిత్రలోనే ఒక రికార్డు
ఆక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్‌ కరెంటు అందిస్తున్నాం. తద్వారా రూ. 720 కోట్ల మేర ఆక్వా రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నాం. పంటల బీమా కోసం 55 లక్షల మంది రైతుల తరఫున 56 లక్షల హెక్టార్లకు రూ. 2,164 కోట్ల బీమా ప్రీమియాన్ని రైతుల తరఫున ప్రభుత్వమే కడుతుంది. గిట్టుబాటు ధరకు గ్యారంటీ కల్పించడానికి రూ. మూడువేల కోట్లతో ధరల స్థీరికరణ నిధిని ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వం విత్తన బకాయిలకు సంబంధించి రూ. 384 కోట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ. 1500 చొప్పున రూ. 300 కోట్లు బోనస్‌గా విడుదల చేశాం. 2018-19 సంవత్సరానికి సంబంధించిన రూ. 2,000 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. అంతేకాకుండా తుపానులు, కరువుల కారణంగా పంట నష్టపోయిన రైతులను గాలికి వదిలేయకుండా.. ఇన్‌పుట్‌ సబ్సిడీలు సంవత్సరాల తరబడి ఇవ్వకుండా ఎగ్గొడుతున్న పరిస్థితులను మార్చి.. రైతులను ఆదుకోవడానికి రూ. రెండువేల కోట్లతో విపత్తు సహాయక నిధిని ఏర్పాటు చేశాం. ఖరీఫ్‌లో విపత్తు వస్తే రబీలోపు నష్టపరిహారం అందిస్తాం. రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతు కుటుంబానికీ రూ. 12,500 చొప్పున ఈ అక్టోబర్‌ నుంచే అందించబోతున్నాం. మేనిఫెస్టోలో చెప్పినదానికంటే 7 నెలల ముందే ఈ రబీ సీజన్‌ నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. మొత్తం 55 లక్షల మంది రైతుల కుటంబాలకు దాదాపు రూ. 8,750కోట్లు అందజేయబోతున్నాం. దాదాపు 16 లక్షలమంది కౌలు రైతులకు కూడా రైతు భరోసాను అందిస్తున్నాం ఇంత భారీమొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించటం కేవలం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల భారత దేశ చరిత్రలోనే ఒక రికార్డు. మొదటి ఏడాదే సహకార రంగం పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్‌ స్టోరోజీలు, అవసరం మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లభించేలా భరోసా ఇస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ వాటి నాణ్యత పరిశీలించేలా లేబొరెటరీలు ఏర్పాటు చేస్తాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top