సమైక్య రాష్ట్రాన్ని చిల్చిన పాపం ముమ్మాటికీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితికి ఆయన చేతకాని తనమే కారణమని..
నంద్యాల, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్రాన్ని చిల్చిన పాపం ముమ్మాటికీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితికి ఆయన చేతకాని తనమే కారణమని.. ఆ నెపాన్ని వైఎస్‌పైకి నెట్టేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్ర సమస్యలను చెప్పుకోవాలంటూ యూపీఏ ప్రభుత్వం దుష్ట చతుష్టయ కమిటీని నియమించిందని ఘాటుగా విమర్శించారు.
విభజన అనంతరం రగులుతున్న సమైక్య ఆందోళనల నేపథ్యంలో సోనియాగాంధీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో సీఎం కిరణ్ విలేకరుల సమావేశం నిర్వహించారని విమర్శించారు. సమస్యలను పరిష్కరించాల్సిన వ్యక్తే ప్రజలు, ప్రతిపక్షాల తరహాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 2001లో రాష్ట్ర విభజనకు బీజం వేసింది వైఎస్సార్ అని కిరణ్ పేర్కొనడం నీచ రాజకీయానికి నిదర్శనమన్నారు. అధిష్టానం ఏది చెబితే అది మాట్లాడటం వల్లే కిరణ్ రాష్ట్ర విభజనకు కారణమై చరిత్ర హీనుడిగా నిలిచారన్నారు. కీలకమైన సమయంలో ఆయనతో పాటు చంద్రబాబు మౌనం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందన్నారు. విభజన నిర్ణయంపై ప్రజలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన తరుణంలో వీరి మాటలు వారి ఆగ్రహంపై నీళ్లు చల్లేవిధంగా ఉన్నాయన్నారు. కిరణ్ కేబినెట్‌లో కీలక మంత్రిగా పని చేస్తున్న గీతారెడ్డి విభజన వ్యవహారం సీమాంధ్ర మంత్రులకు ముందే తెలుసని బహిరంగంగానే వివరిస్తున్నా.. ఈ నాయకులు తమకేమీ తెలియని బుకాయించడంలో అర్థం లేదన్నారు. నిర్ణయం ముందే తెలిసినప్పుడు ఆనాడే పార్టీకి, పదవులకు రాజీనామా చేసినట్లయితే విభజన జరిగేది కాదన్నారు.
దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా కాంగ్రెస్ నాయకులు విభజన నిర్ణయం ప్రకటన తర్వాత తలో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రోడ్డు మ్యాప్‌లు తీసుకురావాలని అధిష్టానం ముగ్గురికి అవకాశమిస్తే.. అందులో బొత్స, కిరణ్‌లు సీమాంధ్రకు చెందినవారే అయినా విభజనను అడ్డుకోలేకపోయారన్నారు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కావడంతోనే కిరణ్ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు చెప్పారు. ఢిల్లీలో కీ ఇస్తే తప్ప ఆయన ఇక్కడ కదల్లేని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన జరిగిన తొమ్మిది రోజులకు బయటికొచ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి కారణం అప్పటి వరకు సోనియా కీ ఇవ్వకపోవడం వల్లేనని భూమా వ్యంగ్యంగా విమర్శించారు.