అమ్మ కావాలి.!

Childrens Request To Collector Return Her Mother From Kuwait - Sakshi

జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లి కష్టాలు పడుతున్న అమ్మ

నాన్న లేడు.. నానమ్మ లేదు

పూట గడవడమే కష్టంగా మారిన వైనం

కలెక్టరేట్‌కు వచ్చి వేడుకున్న చిన్నారులు

సాక్షి, కడప : అమ్మ ఎప్పుడు వస్తుందో తెలి యదు... అంతవరకు ఎలా గడపాలో తెలియడం లేదు..అందరూ ఉన్నా అనాథలా బతుకుతున్నాం.. నాన్న లేడు..నానమ్మ దూరమైంది. ఇక ఉన్నది తాత మాత్రమే.. ఆయన నడవడమే కష్టం.. ఇలాంటి కష్టాలను తట్టుకుంటూ కాలం గడుపుతున్నాం.. మా అమ్మను చూడాలని ఉంది.. ఇక చిన్నోడు సునీల్‌ అయితే ఎప్పుడు పడితే అప్పుడు రాత్రి పూట నిద్రలో..ఒక్కసారిగా లేచి అమ్మా అంటూ  ఏడుస్తున్నాడు. మా చిన్నోడిని చూసే మాకూ ఏడుపు వస్తుంది. మా పరిస్థితి చూసైనా కనికరించండి...అమ్మను రప్పించండి...ఇంతమంది పెద్దలు ఉన్నారు. ఎంతోమంది అధికారులు ఉన్నారు....మీరనుకుంటే మా అమ్మను పిలిపించలేరా.. మా కష్టంలో కొంతైనా పాలుపంచుకోండంటూ చిన్నారులు అధికారులను వేడుకున్నారు. మూడేళ్లుగా తల్లికి దూరమై చిన్నారులు నరక యాతన అనుభవిస్తున్నారు. కేవలం తాత ఆధారంతో ఇంటి పట్టున ఉంటూ సమయానికి తినడానికి తిండి లేక....గాలికి, ఎండకు తిరుగుతూ ఎవరో ఒకరు పెట్టింది తింటూ కాలం వెళ్లదీస్తున్నారు.

చిన్నారుల కష్టంతో తల్లడిల్లుతున్న తాతయ్య
గాలివీడు మండలం పెద్దగొట్టివీడు పరిధిలోని రెడ్డివారిపల్లెకు చెందిన వెంకట రమణప్పనాయుడుకు నడవడం..కూర్చోవడమే కష్టంగా ఉంది. కట్టెలేనిదే ముందుకు కదల్లేని పరిస్థితి. ప్రతినిత్యం కళ్ల ముందు కష్టపడుతున్న మనవళ్లను, మనరాళ్లను చూసి కంటతడి పెట్టుకుంటున్నాడు. ఏదో ఒక పనిచేసి పోషించుదామన్నా వృద్ధాప్యంలో కాళ్లు చేతులు ఆడని పరిస్థితి. చిన్నారులను తలుచుకుని ఏడవని రోజులేదు.. బాధపడని సందర్భం లేదు.. కోడలు పార్వతమ్మ సౌదీకి వెళ్లి మూడేళ్లవుతున్నా ఒక్క రూపాయి పంపలేదు. కనీసం సంతోషంగా ఉందా అంటే అదీ లేదు. ఇటీవల ఫోన్‌ చేసి తాను పడుతున్న వేదనను మామకు వివరించింది. నన్ను పిలిపించుకోండంటూ ప్రాధేయపడింది. ఒక వైపు కోడలు పడే వేదన...మరోవైపు ఏడాదిన్నర క్రితం కుమారుడు నాగేంద్రనాయుడు చనిపోయాడు. జూన్‌ 13వ తేదీన భార్య రామసుబ్బమ్మ తనువు చాలించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇటు వెంకట రమణప్పనాయుడుకు, చిన్నారులకు కష్టాలు మొదలయ్యాయి. సమయానికి తిండి లేదు.. నిద్ర లేదు.. ..ప్రతి ఒక్కటీ ఇంట్లో సమస్యగానే పరిణమించాయి. 

అమ్మను రప్పించండి
సౌదీలో సేఠ్‌ ఇంటిలో పనికి వెళ్లిన అమ్మ అగచాట్లు పడుతోందని ఒకసారి చెప్పింది.. మూడేళ్ల నుంచి అమ్మను చూడలేదు.. చూడాలని ఉంది.. అమ్మను అక్కడి దేశం నుంచి రప్పించండని వనజ (13),రెడ్డి నాగ శంకర్‌నాయుడు (11), శైలజ (8), సునీల్‌కుమార్‌నాయుడు (5), తాతయ్య వెంకట రమణప్పనాయుడులు అర్థిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమానికి వచ్చిన వారు గోడు వెళ్లబోసుకున్నారు. ఇంతకుమునుపు కూడా కలెక్టర్‌ బాబూరావునాయుడును కలిశామని వారు వెల్లడించారు. మేమేమీ కోరడం లేదు.....మా అమ్మను రప్పించాలని వేడుకుంటున్నాం.. ఎందుకంటే మాకు ఆలనా, పాలన ఎవరూ లేరు. అమ్మ ఉంటే అన్నీ చూసుకుంటుంది.  ఏజెంట్లు, అధికారులను ఆదేశిస్తే న్యాయం జరుగుతుందని చిన్నారులతోపాటు తాతయ్య కన్నీటి పర్యంతమయ్యారు.

అధికారులను కలిసిన చిన్నారులు
కడప  కలెక్టరేట్‌లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ రామచంద్రారెడ్డిని చిన్నారులతోపాటు తాతయ్య కలిశారు. పార్వతమ్మను స్వదేశానికి రప్పించాలని.. పిల్లలకు ఆహారాన్ని అందించడానికి ఏవైనా ఆర్థికసాయం చేయాలని అడిగారు. పోలీసుల ద్వారా పార్వతమ్మను రప్పించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం డీఆర్‌డీఏ కార్యాలయంలో ‘బంధం’ యాప్‌ అధికారి వసుంధరను కలిసి వారు సమస్యను వివరించి న్యాయం చేయాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top