
బాలలకు ధీ(బీ)మా!
అనంతపురం ఎడ్యుకేషన్ : సర్కారు పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో చాలామంది దాదాపు నిరుపేద కుటుంబాలకు చెందినవారే.
అనంతపురం ఎడ్యుకేషన్ : సర్కారు పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో చాలామంది దాదాపు నిరుపేద కుటుంబాలకు చెందినవారే. విధి వక్రించి, ప్రమాదవశాత్తూ కొందరు పిల్లలు జీవితాల్ని అర్ధంతరంగా ముగిస్తున్నారు. కడుపుకోతకు గురై.. తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. పోయిన బిడ్డలను ఎటూ తెచ్చివ్వలేము.
కొంతలో కొంత అండగా ఉంటే వారి కుటుంబాలు కుదుపునకు గురవుకుండా ఉంటాయనే గొప్ప ఆలోచనతో 2010 నవంబరు 11న అప్పటి జిల్లా కలెక్టరు బుసిరెడ్డి జనార్దన్‌రెడ్డి ‘బాలల బీమా’ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ఇతర ఏ జిల్లాల్లోనూ లేనివిధంగా అనంతపురం జిల్లాలో మాత్రమే ఈ పథకం అమలవుతోంది. ‘ది ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఈ బాధ్యత తీసుకుంది. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, రెసిడెన్షియల్, ఎయిడెడ్ ,ఆదర్శ పాఠశాలలు, కస్తూరిబా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
ప్రీమియం చెల్లింపు ఇలా...
పథకం ప్రారంభంలో ఒక్కొక్క విద్యార్థి నుంచి ఏడాదికి రూ.2 చొప్పున ప్రీమియం కట్టించుకునేవారు. రెండో సంవత్సరం (2011-12) నుంచి రూ.5కు పెంచారు. ప్రమాదవశాత్తూ అంటే రోడ్డు ప్రమాదాలు, నీటమునక, విద్యుదాఘా తం, పాము, తేలు, కుక్కకాటు తదితర కారణాలతో మరణించినా, అంగవైకల్యం చెందినా బీమా మొత్తం పొందేందుకు అర్హులు.
చనిపోయినా, పూర్తి వైకల్యం చెందినా రూ. 25 వేలు, కొంతమేర వైకల్యం చెందితే రూ.10 వేల బీమా మంజూరవుతుంది. పాఠశాల హెచ్‌ఎం తమ పాఠశాలలో నమోదైన ప్రతి విద్యార్థి నుంచి బీమా ప్రీమియం సేకరించి.. సంబంధిత ఎంఈఓ ద్వారా బాలల బీమా కోఆర్డినేటరుకు అందజేయాలి. అక్కడి నుంచి ఇన్సూరెన్స్ కంపెనీకి చేరుతుంది.
వెంటనే సమాచారమివ్వాలి..
ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత పాఠశాల హెచ్‌ఎం, ఎంఈఓ, సీఆర్పీ, ఎంఐఎస్ కో ఆర్డినేటరు, డాటా ఎంట్రీ ఆపరేటరు బాలల బీమా కోఆర్డినేటరుకు సమాచారం అందించాలి. వారు ఇన్సూరెన్స్ కంపెనీకి చేరవేస్తారు. బీమా మొత్తం వెంటనే మంజూరవుతుంది.
స్పందిస్తున్న ప్రజాప్రతినిధులు
కొందరు ప్రజాప్రతినిధులు స్పందించి.. వారి పరిధిలోని విద్యార్థులకు సంబంధించిన ప్రీమియం చెల్లిస్తున్నారు. ఈ విషయంలో ఒకర్ని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతున్నారు. వార్డుమెంబరు స్థాయి నుంచి సర్పంచు, మండల, నియోజకవర్గ స్థాయి వరకు ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు. ఈ ఏడాది మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వారి నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు ప్రీమియం చెల్లించారు.
ఆ రెండు జిల్లాల్లో ఫెయిల్యూర్..
మన జిల్లాకంటే ముందు కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలో బాలలబీమా పథకం అమలైంది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఒకట్రెండు క్లెయిమ్‌లు కూడా లేవని సమాచారం. అయితే.. అప్పటి కలెక్టరు జనార్దన్‌రెడ్డి మన జిల్లాలో అమలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. బాలల బీమా పథకం పర్యవేక్షణకు ప్రత్యేకంగా కోఆర్డినేటరును నియమించారు. ఎస్‌ఎస్‌ఏలో పని చేస్తున్న ఆరోగ్య సమన్వయకర్త జయశేఖర్‌రెడ్డి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి, క్రోడీకరించి.. లబ్ధిదారులకు బీమా అందేలా చూస్తున్నారు. దీంతో ఇప్పటిదాకా అర్హులందరికీ బీమా అందింది.
ప్రీమియం చెల్లింపునకు 10న తుది గడువు
2014-15 సంవత్సరానికి సంబంధించి ప్రీమియం చెల్లించేందుకు ఈనెల 10న తుది గడువు అని సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్టు ఆఫీసర్ (పీఓ) మధుసూదన్‌రావు, బాలల బీమా కోఆర్డినేటరు జయశేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రీమియం చెల్లించేలా హెచ్‌ఎంలు, ఎంఈఓలు చొరవ చూపాలన్నారు.