రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో యాత్ర ఎలా చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
కడప(వైఎస్ఆర్ జిల్లా): రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో యాత్ర ఎలా చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రపై ఆయన మండిపడ్డారు. విభజన విషయంలో తప్పు చేసిన పార్టీలను నిలదీయాలన్నారు. లేకుంటే ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం ఉండదని చెప్పారు.
రాజీనామాలు చేయని సీమాంధ్ర టీడీపీ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. సమైక్యాంధ్ర కోసం ఆమరణ దీక్ష చేసిన ఘనత వైఎస్ జగన్మోహన రెడ్డి, విజయమ్మలకే దక్కుతుందని పేర్కొన్నారు. రాజీనామాలు ఆమోదించకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారన్నారు. ఉద్యమకారులను, ఉద్యోగులను అవమానించకుండా చంద్రబాబు, కిరణ్, కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు సమైక్యాకాంక్షను ఫ్యాక్స్ ద్వారా ప్రధానికి, రాష్ట్రపతికి పంపాలన్నారు.