రాష్ట్రాన్ని విభజిస్తే ముందుగా నష్టపోయేది సీమాంధ్ర ప్రాంతంలోని రైతులేనని రైతు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్ర స్పష్టం చేశారు.
పాలకొల్లు, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజిస్తే ముందుగా నష్టపోయేది సీమాంధ్ర ప్రాంతంలోని రైతులేనని రైతు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్ర స్పష్టం చేశారు. స్థానిక చాంబర్స్ భవనంలో గురువారం నిర్వహించిన రైతు జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1956లో రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల ఎకరాలు సాగులో ఉంటే ప్రస్తుతం 84 లక్షల ఎకరాలకు పెరిగిందని, రాష్ట్రంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 34 లక్షల ఎకరాలు సాగులోని రానున్నాయన్నారు. అయితే రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతానికి సాగు, తాగునీటి ఎద్దడి ఏర్పడి ఇక్కడి భూములు ఎడారిగా మారిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులకు ఏర్పడే నష్టాన్ని ముందుగానే గుర్తించి రైతులంతా పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. సీమాంధ్ర ప్రాంత కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓట్లుద్వారా బుద్ధి చెప్పాలని నాగేంద్రనాథ్ పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా రైతు జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఈనెల 19న పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో రైతు సమైక్య గర్జన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గర్జన విజయవంతానికి ఒక కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో పెన్మెత్స రామభద్రిరాజు, గుమ్మాపు సూర్యవరప్రసాద్, యడ్ల తాతాజీ, కోడి విజయభాస్కర్, తమ్మినీడి సత్యనారాయణ, అప్పారి సుబ్బారావు, చివటపు నాగేశ్వరరావుతో సహా 15 మంది సభ్యులు ఉన్నారన్నారు. ఈనాటి సమావేశంలో పాలకొల్లు, పోడూరు తహసిల్దార్లు పి.వెంకట్రావు, వి.స్వామినాయుడు, ఏడీఏ పి.మురళీకృష్ణ, నరసాపురం ఆర్టీసీ డీఎం గిరిధరకుమార్, యడ్ల తాతాజీ పాల్గొన్నారు.