తొలి దశ.. 4,159 టన్నులు

తొలి దశ.. 4,159టన్నులు


నోటిఫికేషన్  జారీ చేసిన అటవీ శాఖ

ఈ-టెండర్, ఈ-వేలం బాధ్యత ‘ఎంఎస్‌టీసీ’కి అప్పగింత

వచ్చే నెల 19 నుంచి 26 వరకు వేలం

ఎర్రచందనం వేలానికి రంగం సిద్ధం


 

 

హైదరాబాద్: ఎర్ర చందనం వేలానికి రంగం సిద్ధం చేశామని, తొలిదశలో 4159.693 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం దుంగలను వేలం వేయడానికి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశామని ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ జోసెఫ్ తెలిపారు. అటవీ శాఖ అధికారులతో కలిసి ‘అరణ్య భవన్’లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేలాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఈ-వేలం, ఈ-టెండర్ నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఎంఎస్‌టీసీ లిమిటెడ్’కు అప్పగించామని వెల్లడించారు. చైనా, సింగపూర్, జపాన్, హాంకాంగ్ తదితర దేశాల్లో ఎర్రచందానికి అధిక డిమాండ్ ఉన్న దృష్ట్యా.. వేలానికి ఆయా దేశాల్లో విస్తృత ప్రచారం కల్పించడానికి రోడ్‌షోలు నిర్వహించే యోచనలో ఉన్నామని తెలిపారు. అంతర్జాతీయ పత్రికల్లో ప్రకటనలూ ఇవ్వనున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, బాకరాపేట, నెల్లూరు జిల్లాల్లోని ఆదురూపల్లి, ఉదయగిరి, వెంకటగిరి, వైఎస్సార్ జిల్లాలోని కడపలో ఎర్రచందనాన్ని నిల్వ ఉంచిన డిపోలను ఈనెల 11 నుంచి వచ్చే నెల 17 వరకు సందర్శించడానికి అవకాశం ఉందని తెలిపారు. వచ్చే నెల 19 నుంచి 26 వరకు డిపోల వారీగా ఈ-వేలం ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఈ-టెండర్, ఈ-వేలం.. రెండు ప్రక్రియలు వేర్వేరుగా ఒకే సమయంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని చెప్పారు. టెండర్, వేలంలో పాల్గొనాలనుకొనే వారు ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ-టెండర్‌లో కోట్ చేసిన ధరలు రహస్యంగా ఉంటాయని, ఈ-వేలం విధానంలో పోటీదారులు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చని చెప్పారు.ఈ-వేలంలో కోట్ చేసిన ధర కంటే ఈ-టెండర్‌లో ఎవరైనా ఎక్కువ ధర కోట్ చేసి ఉంటే వారికే ఎర్రచందనం దక్కుతుందని వివరించారు. దుంగలు రూపంలో ఎర్రచందనం విక్రయించడం ఇదే తొలిసారని తెలిపారు. 2006, 2008లో రెండుసార్లు ఎర్రచందనం విక్రయించినా, దుంగల రూపంలో కాకుండా బొమ్మలు, ఇతర వస్తువులుగా తయారు చేసి విక్రయించామని చెప్పారు. 2008లో దుంగల రూపంలో విక్రయించడానికి టెండర్లు ఆహ్వానించినా.. కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో నిలిపివేశామన్నారు. అయితే అప్పుడు దుంగల కొనుగోలుకు ఒక్కో మెట్రిక్ టన్ను ఎ-గ్రేడ్‌కు రూ. 7 లక్షలు, బి-గ్రేడ్‌కు రూ. 6 లక్షలు, సి-గ్రేడ్‌కు రూ. 5.3 లక్షలు, నాన్‌గ్రేడ్‌కు 3.6 లక్షలు కోట్ చేశారని వివరించారు. ఎర్రచందనం విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్ము రాష్ట్ర ప్రభు త్వ ఖజానాకు చేరుతుందనిఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top