సాధారణ ఎన్నికలు ముగిసి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో నిత్యం దాడులు, గొడవలతో ఉద్రిక్త వాతవరణం నెలకొంటోంది.
దాదాపు పదేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న జిల్లా.. వరుస ఎన్నికల అనంతరం రాజకీయ ప్రేరేపిత హత్యలు, దాడులతో అట్టుడికిపోతోంది. టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక గ్రామాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల ఆగడాలకు పట్టపగ్గాలుండటం లేదు. గడచిన మూడు, నాలుగు నెలల్లో జరిగిన దాడుల్లో పది మంది హత్యకు గురికాగా వందలాదిమంది గాయపడ్డారు. రోజురోజుకూ పరిస్థితులు విషమిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవటం విస్మయం కలిగిస్తోంది.
సాక్షి, గుంటూరు: సాధారణ ఎన్నికలు ముగిసి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో నిత్యం దాడులు, గొడవలతో ఉద్రిక్త వాతవరణం నెలకొంటోంది. ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వినుకొండ, మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, పెదకూరపాడు అసె ంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నారుు. గత పదేళ్లుగా ఈ నియోజకవర్గాల్లోని ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారు. వరుసగా జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ దాడులు జరుగుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందోననే భయంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
గ్రామాల్లోని గొడవల్లో దెబ్బతిన్న బాధితులు పోలీస్ స్టేషన్‌లకు వెళ్లినపుడు పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. దీంతో తమకు న్యాయం జరగదని భావించిన వారు దెబ్బకు దెబ్బ అంటూ ప్రతి దాడులకు పాల్పడుతున్నారు. దుండగులకు తమదైన రీతిలో కౌన్సెలింగ్ నిర్విహ ంచాల్సిన పోలీసులు అధికార పార్టీ వారిని వదిలేస్తుండటంతో పరిస్థితులు దిగజారుతున్నారుు. పోలీ సులు ఏమీ చేయరన్న ధీమాతో అధికార పార్టీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారని జనం మండిపడుతున్నారు.
ఇవీ దారుణాలు..
వినుకొండ మండలం నీలగంగవరంలో మే 21న టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరచడంతో రావులపల్లి పెదమునయ్య అనే వ్యక్తి మృతి చెందారు. ఈ కేసులోని నిందితులను పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక చూద్దామనటం వారి నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా నిలుస్తోంది. అదే గ్రామంలో రోడ్డుపై వెళుతున్న 87 ఏళ్ల వృద్ధురాలిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి చంపబోయారంటూ వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేయించారు. కౌంటర్ కేసు ఉంటే వైఎస్సార్‌సీపీ వారు దారిలోకి వస్తారనేది టీడీపీ నేతల దుర్మార్గపు ఆలోచన. వీరికి అండగా నిలిచిన పోలీసులు బాధితులపై తప్పుడు కేసులు బనాయించారు.
వినుకొండ నియోజకవర్గం పరిధిలోని మేళ్లవాగు గ్రామంలో పదిహేను రోజుల క్రితం రాత్రి పొలానికి వెళ్లిన అన్నదమ్ములిద్దరిని టీడీపీ వర్గీయులు దారుణంగా హత్యచేశారు.
వేమూరు నియోజకవర్గంలోని పెరవలిపాలెంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి చెందిన ఎస్.ప్రభాకరరావుపై టీడీపీకి చెందిన సర్పంచ్ వర్గీయులు 30 మంది దాడి చేశారు. ఈ ఘటనలో ప్రభాకరరావు మృతి చెందారు.
నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు ఏడుసార్లు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు వె ళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై సాక్షాత్తు పోలీసుల సమక్షంలోనే దాడిచేశారు. ఈ విషయాన్ని రూరల్ ఎస్పీ రామకృష్ణకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులపై మాపై ఎస్పీకి చెబుతావా అంటూ టీడీపీ వర్గీయులు దాడి చేశారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ళ ఎంపీపీ ఎన్నికకు వెళుతున్న గుంటూరు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతోపాటు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న వాహనాలను దారికాచి అడ్డుకుని ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను గాయపరిచి ఎంపీటీసీలతో పాటు ఏడుగురిని కిడ్నాప్ చేశారు. ఇదంతా సాక్షాత్తు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సొంత నియోజకవర్గంలో జరగడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన జరిగి 45 రోజులు కావస్తున్నా ఇంతవరకు పోలీసులు కనీసం నిందితులను గుర్తించకపోవడంతో హైకోర్టు అక్షింతలు కూడా వేసింది. నాలుగు వారాల్లో దర్యాప్తు పూర్తిచేసి నివేదిక కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తిపై టీడీపీ నాయకులు దాడి చేసి గొడ్డళ్లతో అతని రెండు కాళ్లను నరికారు.
టీడీపీ హత్యలు, దాడులపై అసెంబ్లీలో రభస జరుగుతున్న సమయంలోనే పిడుగురాళ్ల పట్టణంలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేశారు. వారి కళ్లలో కారం కొట్టి తీవ్రంగా గాయపరిచారు.
తాజాగా గురజాల పట్టణంలో కొందరి హత్యకు దుండగులు పథక రచన వేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసు లు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు కిరాయి హంతకులు ఉన్నట్లు గుర్తించారు. ఎవరిని హతమార్చేందుకు వీరు ఇక్కడకు వచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఒత్తిడులకు తలొగ్గకుండా విచారణ జరిపి నిజానిజాలు బయటకు తీసి కఠిన చర్యలు తీసుకోకపోతే పల్నాడు ప్రాంతంలో మరిన్ని అరాచకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు సరైన రీతిలో వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రజలు వేడుకుంటున్నారు.