హరిపాలెం ఆవకాయ ఆ టేస్టే వేరప్పా..!

Atchutapuram Pickles Famous in Visakhapatnam - Sakshi

తీపి ఆవకాయ తయారీలో 100 కుటుంబాలు

రసాయనాలు లేకుండా తయారీ.. అందుకే అంత క్రేజ్‌

అచ్యుతాపురం నుంచి అండమాన్‌ వరకు అమ్మకాలు

ఏడు దశాబ్దాల నుంచి పచ్చళ్ల తయారీయే ప్రధాన వృత్తి

ప్రభుత్వ ప్రోత్సాహం లేదంటున్న తయారీదారులు

అది ఆవకాయ కాదు..ఆహా.. అనిపించే ‘కాయ’.తియ్య తియ్యగా జిహ్వనుజివ్వుమనే పించే ‘కాయ’.రసాయనాలకు దూరంగా..శుచి, శుభ్రతలే ధ్యేయంగాహరిపాలెం వాసులుఅందించే అవకాయ.రుచి అమోఘం అంటున్నారుభోజన ప్రియులు. ఎంత కాలంనిల్వ ఉంటే అంత రుచిఅని చెబుతున్నారు తయారీదారులు. నాణ్యతా ప్రమాణాలే తమ రుచికికారణమంటున్నారు విక్రయదారులు. అచ్యుతాపురం నుంచి అండమాన్‌ వరకు అమ్మకాలు సాగేఈ తీపి ఆవకాయపై ప్రత్యేక కథనం.

అచ్యుతాపురం(యలమంచిలి) :హరిపాలెం తీపి ఆవకాయకు గిరాకీ తగ్గడంలేదు. ఇక్కడ తయారైన ఆవకాయ జిల్లాలు, రాష్ట్రాలు దాటి అండమాన్, పశ్చిమ బెంగాల్‌ వరకూ ఎగుమతవుతోంది. ప్రోత్సాహం ఉంటే లక్షల్లో పెట్టుబడిపెట్టి డ్రమ్ములకొద్దీ ఆవకాయ సిద్ధం చేసి ఎగుమతి చేయడానికి ఇక్కడి వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు.

ఎందుకంత క్రేజ్‌...
మార్కెట్‌లో లభించే వివిధ బ్రాండ్ల ఆవకాయల తయారీకి యంత్రాలను వినియోగిస్తారు. నిల్వ చేసేందుకు రసాయనాలను కలుపుతారు. హరిపాలెంలో తయారు చేసే ఆవకాయకు రసాయనాలు వాడరు. ఏడాది నిల్వచేసిన తరువాతే అమ్మకాలు మొదలుపెడతారు. అన్నీ సమపాళ్లలో కలిపి శుచిగా నిల్వ చేస్తే అద్భుతమైన రుచి ఆవకాయ సొంతమవుతుందని చెబుతున్నారు తయారీదారులు.

ఇదీ జీవన చిత్రం...
హరిపాలెంలో 100 కుటుంబాలున్నాయి. ఒక్కొక్క కుటుంబం 10 డ్రమ్ముల పచ్చడి తయారు చేస్తుంది. ఏడాది పొడవునా రిటైల్, హోల్‌సేల్‌గా అమ్మకాలు జరుపుతారు. ఏడుదశాబ్దాల నుంచి ఇక్కడ పచ్చడి తయారీనే ఉపాధిగా ఎంచుకున్నారు. వీళ్లు తయారుచేసే విధానంలో ఏడాది వరకు పచ్చడి నిల్వ ఉంటుంది. ‘పెంటకోట’, ‘కాండ్రేగుల’ ఇంటిపేరు ఉన్న కుటుంబాలు ఇక్కడ పచ్చడి తయారీలో సిద్ధహస్తులు.  

హరిపురం ఆవకాయ ప్రత్యేకతలివే...
కల్వటేరు రకానికి చెందిన మామిడి కాయలను మాత్రమే పచ్చడి తయారీకి వినియోగిస్తారు.
తూర్పుగోదావరి, ఇతర ఏజెన్సీ ప్రాంతాల నుంచి మామిడికాయల్ని దిగుమతి చేసుకుంటారు.  
వారపు సంతల్లో మిరిపకాయలు కొనుగోలు చేస్తారు.
రసాయనాలు వినియోగించకుండా తయారు చేసిన బెల్లంను సమీకరిస్తారు.
మే నెలాఖరునాటికి మామిడి కాయ ముక్కలను నానబెట్టి, ఎండబెట్టి తయారీకి సిద్ధం చేస్తారు.
కారం, ఆవపిండి, బెల్లంతో, నూనెలను కలిపి డ్రమ్ముల్లో నిల్వచేస్తారు.
రెండు నెలల పాటు మగ్గిన తరువాత అమ్మకాలు ప్రారంభిస్తారు.
గ్రామంలో హోల్‌సేల్‌గా, ఇతర గ్రామాలకు వెళ్లి రిటైల్‌గా అమ్మకాలు సాగిస్తారు.  

పెరుగుతున్న ధరలు..
ముడిసరుకుల ధరలు ఏటా బాగా పెరిగిపోతున్నాయని చెబుతున్నారు తయారీ దారులు. టన్ను మామిడి 11వేలు, బస్తా మిరప 14వేలు, బెల్లం వందకిలోలు 5వేలకు లభిస్తున్నాయని అంటున్నారు. మెంతులు, వెల్లుల్లి, ఆవాలు, నూనె ధరలు బాగా పెరిగాయంటున్నారు. ధరలు సంగతి ఎలా ఉన్నా నాణ్యతలో ఎక్కడా రాజీపడమని అదే హరిపాలెం ఆవకాయ ప్రత్యేకతని వివరిస్తున్నారు తయారీదారులు. గత ఏడాది కిలో పచ్చడి ధర రూ.120. ఈ ఏడాది రూ.150గా ఉంది.

అండమాన్‌కు ఆవకాయ..
హరిపాలెంలో తయారైన పచ్చడిని ఒడిశా, అండమాన్, విశాఖ ఏజెన్సీ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రిటైల్‌ వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. గ్రామంలో హోల్‌సేల్‌గా అమ్మకాలు సాగుతుంటాయి. కొందరు బైక్‌లు, సైకిళ్లపై పచ్చడిని గ్రామాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. అండమాన్‌లో స్థిరపడిన హరిపాలెం వాసులు ఏదైనా పనిమీద తమ గ్రామానికి వచ్చినప్పుడు వంద నుంచి రెండొందల కిలోల పచ్చడిని అక్కడ విక్రయించేందుకు తీసుకెళుతుంటారు.  

కరువైన ప్రోత్సాహం...  
ఆవకాయ తయారీని చిన్నతరహా పరిశ్రమగా హరిపాలెం గ్రామస్తులు 70 ఏళ్ల క్రితం స్వీకరించారు. మే, జూన్‌లలో ఏడాదికి అవసరమైన ముడిసరుకు సిద్ధం చేసుకోవాలి. ఇందుకు ఒక్కొక్క కుటుంబానికి రూ.3లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెట్టుబడి అవసరమవుతుంది. పెట్టుబడికి ప్రభుత్వ ప్రోత్సాహం లేదని చెబుతున్నారు తయారీదారులు. నగలు, ఇతర ఆస్తులను తాకట్టుపెట్టి, అధికవడ్డీలకు అప్పులు చేసి ఆవకాయను తయారు చేస్తున్నామని చెబుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కుటుంబానికి రూ.50 వేలు చొప్పున బ్యాంకు రుణం లభించేదని, ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మమ్మల్ని పట్టించుకోరూ...
పచ్చడి తయారీలో డ్రమ్ములు, కోత, ప్యాకింగ్‌ యంత్రాలు, రిటైల్‌ వ్యాపారులకు మోపెడ్‌ల అవసరం ఉంది. ప్రభుత్వం ఆవకాయ తయారీని వృత్తిగా గుర్తించాలి. అవసరమైన సహకారం అందించాలని కోరుతున్నారు హరిపాలెం వాసులు.

రసాయనాలకు దూరంగా..
తీపి ఆవకాయకు గిరాకీ పెరిగింది. అన్నీ సమపాలల్లో వేసి శుచిగా తయారు చేస్తాం. రసాయనాలు వాడకుండా తయారు చేయడమే మా ఆవకాయ ప్రత్యేకత. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరింత ఉత్పత్తి చేస్తాం.
– కాండ్రేగుల శ్రీను

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top